logo

వానొస్తే మునకే

నగర, పురపాలికల్లో వర్షాలను దృష్టిలో (మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ వర్క్స్‌) పెట్టుకుని ముందస్తుగా నిర్వహించాల్సిన కాల్వల పూడికతీతలు, డ్రెయిన్ల శుభ్రత, పల్లపు ప్రాంతాల మెరుగుదల పనులను జూన్‌ కల్లా పూర్తి చేయాలని అన్ని నగర, పురపాలికలకు పురపాలకశాఖ నుంచి

Updated : 27 Jun 2022 06:29 IST
కాగితాలపైనే పూడిక తీతలు
మొక్కుబడిగా మాన్‌సూన్‌ ప్రణాళిక పనులు
ఈనాడు, అమరావతి

చుట్టుగుంట సెంటర్‌ నుంచి నల్లపాడు వెళ్లే ప్రధాన మురుగునీటి కాల్వలో పేరుకుపోయిన బురద

నగర, పురపాలికల్లో వర్షాలను దృష్టిలో (మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ వర్క్స్‌) పెట్టుకుని ముందస్తుగా నిర్వహించాల్సిన కాల్వల పూడికతీతలు, డ్రెయిన్ల శుభ్రత, పల్లపు ప్రాంతాల మెరుగుదల పనులను జూన్‌ కల్లా పూర్తి చేయాలని అన్ని నగర, పురపాలికలకు పురపాలకశాఖ నుంచి ఆదేశాలు ఉన్నాయి. కానీ ఆ పనులకు సంబంధించి ఇప్పటికీ జిల్లాలో కొన్నిచోట్ల టెండర్లు పూర్తి కాలేదంటే అతిశయోక్తికాదు.

ది లక్షల జనాభా కలిగి రాష్ట్రంలోనే మూడో పెద్దనగరంగా పేరు గడించిన గుంటూరు నగరపాలకలోనే కొన్ని పనులకు ఇప్పటికీ టెండర్లు పిలవలేదు. గతేడాది భారీ వర్షాలు కురిసి చుట్టుగుంట వద్ద పీకలవాగులో ప్రమాదవశాత్తు ఐదేళ్ల బాలుడు పడి గల్లంతయ్యాడు. ఆ బాలుడి మృతదేహాన్ని తీయటానికి ఏకంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. నగరంలో మురుగునీటి డ్రెయిన్లలో ఎంత నీటి కదలికలు(ఫ్లో) ఉంటాయో అర్థమౌతోంది. గతేడాది మురుగునీటి కాల్వల్లో పూడికతీతలు తీయని కారణంగానే చాలాచోట్ల డ్రెయిన్లు పారుదల కాక వర్షాలు పడే సమయంలో పలు పల్లపు ప్రాంతాలు  జలమయంగా మారాయి. కళ్ల ముందే ఘటనలు ఉన్నా గుంటూరు నగరపాలక ఇంజినీరింగ్‌ విభాగానికి ఏమాత్రం జ్ఞానోదయం కాలేదనడానికి ఇప్పటికీ పూడికలు తీయని చుట్టుగుంట-నల్లపాడు ప్రధాన డ్రెయిన్‌, గణేష్‌నగర్‌-నందివెలుగు రోడ్‌ డ్రెయిన్లే ఇందుకు నిదర్శనం. ఈ రెండు మురుగునీటి కాల్వల్లో చెత్తా చెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. కమిషనర్‌, ఇంజినీరింగ్‌, ప్రజారోగ్య విభాగం యంత్రాంగం నిత్యం కాల్వల పరిశుభ్రత ఎలా ఉందని పరిశీలిస్తుంది. వారికి ఈ కాల్వలు కనిపించలేదా? కనిపించినా టెండర్లు పిలవలేదు కదా అని చూసీచూడనట్లు వదిలేశారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలోనే మే మొదటి వారం కల్లా మాన్‌సూన్‌ యాక్షన్‌ పనులు గుర్తించి నెలాఖరి లోపు టెండర్లు ఖరారు చేసి జూన్‌ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇప్పటికీ నగరంలో 10 ప్రధాన డ్రెయిన్ల పనులు మొదలు పెట్టలేదు. ఆ పనుల నిర్వహణకు గుత్తేదారులు ముందుకు రావటం లేదు. నగరంలో కొందరు గుత్తేదారు రహదారులు, డ్రెయిన్లు వంటి పనులు పూర్తి చేసి మూడు నెలలు పూర్తయింది. వాటికి సంబంధించిన ఎంబుక్‌ రికార్డులు నమోదు చేసినా బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేయటం వల్లే డ్రెయిన్ల పూడిక తీత పనులకు టెండర్లు వేయటం లేదని గుత్తేదారు ఒకరు తెలిపారు.గతంలో శారదకాలనీ, పాతగుంటూరు తదితర ప్రాంతాలు మునకకు గురయ్యాయి. వర్షం వస్తున్నా, మబ్బు పట్టినా యంత్రాంగానికి వణుకు పుడుతోంది.

* తాడేపల్లి-మంగళగిరి నగరపాలక పరిధిలోనూ పూడిక తీత పనులు నిర్వహించలేదు. అయితే కార్పొరేషన్‌ పరిధిలో వర్షం వస్తే నగరం మునకకు గురయ్యే పరిస్థితి లేదని, ఎంత వర్షం వచ్చినా రెండు, మూడు గంటల్లో నీళ్లు అన్ని కాల్వల ద్వారా బయటకు వెళ్లిపోతాయని అధికారులు అంటున్నారు. అయితే కొంతమేరకు పూడికలు తీయాల్సి ఉందని, వాటిని తీయిస్తామని అధికారులు చెప్పారు.

* తెనాలి పట్టణంలోనూ ఈ పనులు పూర్తికాలేదు. ప్రస్తుతం కొన్ని డ్రెయిన్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంకా చేపట్టాల్సిన పనుల విలువ రూ.20 లక్షలకు పైగానే ఉంటుందని మున్సిపల్‌ వర్గాలు తెలిపాయి.

* పొన్నూరు పట్టణంలో నిధుల లేమితో ప్రధాన డ్రెయిన్లు అన్నింటిలో పూడికలు తీయలేదు. పరిమితంగానే పనులు చేశారు. నిడుబ్రోలు తదితర ప్రాంతాల్లో వర్షం వస్తే కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల కాల్వలు ప్రవహించక చివరకు పట్టణంలోని పల్లపు ప్రాంతాలకు చేరతాయేమోనని ఇంజినీరింగ్‌ వర్గాలే ఆందోళన చెందుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని