logo

గస్తీకి సుస్తీ

జిల్లాల విభజన జరిగి గుంటూరు జిల్లాకు నూతన ఎస్పీ నియమితులైన తర్వాత గత నెలలో నేరాల అదుపునకు రాత్రి గస్తీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. సబ్‌ డివిజన్లలో డీఎస్పీల మొదలు సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము

Published : 28 Jun 2022 06:20 IST

అటకెక్కిన రాత్రి తనిఖీలు


తెనాలి నెహ్రూ రోడ్డులో రాత్రి సమయంలో ఆగిపోయిన వాహనాలు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాల విభజన జరిగి గుంటూరు జిల్లాకు నూతన ఎస్పీ నియమితులైన తర్వాత గత నెలలో నేరాల అదుపునకు రాత్రి గస్తీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. సబ్‌ డివిజన్లలో డీఎస్పీల మొదలు సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రోడ్ల మీద ఉండి తనిఖీలు చేశారు. ప్రధాన కూడలి ప్రాంతాలతో పాటు శివార్లలోనూ ఈ కార్యక్రమం జిల్లా అంతటా కొనసాగింది. దీంతో కొంతమేర రాత్రి నేరాలు అదుపులోకి వచ్చాయి. ఇదంతా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఈ నెలలో పరిస్థితి ఏమిటంటే రాత్రి కాదు కదా, పగలు విజువల్‌ పోలీసింగ్‌కు కూడా దిక్కులేని స్థితి కళ్ల ముందు ఉంది.

* జిల్లా పరిధిలో ముఖ్యమంత్రి నివాసం, సచివాలయం వంటి ముఖ్య కేంద్రాలు ఉండటం ఆయా చోట్ల ముఖ్యుల రాకపోకలు కొనసాగటం, ఆయా సందర్భాల్లో బందోబస్తు అవసరాలు పెరిగాయి. మరోవైపు  ప్రతిపక్ష పార్టీలు, వివిధ సంఘాల ఆందోళనలు వంటివి కూడా పలుమార్లు జరిగాయి. ఇటువంటి ప్రతి సందర్భంలోనూ సబ్‌ డివిజన్ల నుంచి ఆయా ప్రాంతాలకు పోలీసులను పంపడం రివాజుగా మారింది. ఈ నెల వరకు చూసుకుంటే దాదాపు 15 రోజులకు పైగా సిబ్బంది తమ స్టేషన్ల పరనిధిలో కాకుండా ఇతర చోట్ల బందోబస్తులకు వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు కలక్టరేట్ వద్ద ఆందోళనల సందర్భంగా ఇతర డివిజన్ల నుంచి పోలీసులను పంపించారు. క్షేత్ర స్థాయిలో పోలీసులు లేకపోవడంతో గతంలో మాదిరి తిరిగి అన్ని చోట్ల అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయి. బహిరంగ మద్యపానం తిరిగి తీవ్రస్థాయికి చేరింది. తుదకు ట్రాఫిక్‌ రద్దీని పర్యవేక్షించే వారు లేకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతూ ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి.

* ఉదాహరణకు తెనాలి సబ్‌ డివిజన్‌ను తీసుకుంటే పోలీస్‌ కంట్రోల్‌ రూంతో సహా మొత్తం 9 పోలీస్‌ స్టేషన్లను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ మొత్తానికి 15 ఏళ్ల క్రితం మంజూరైన సిబ్బంది 330 మంది కాగా.. క్రమానుగతంగా పోలీసులు విధులు, అవసరాలు పెరిగినా సిబ్బంది కేటాయింపులు పెరగలేదు. ఈ విషయం అటు ఉంచితే మొత్తం 330 మంది సిబ్బందిలో గత కొన్నేళ్ల నుంచి 163 మంది ఇతర ప్రాంతాల్లో అంటే ఎస్పీ కార్యాలయం, ఎస్‌బీ, తదితర చోట్ల విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు 167 మంది. వీరిలో కనీసం పది మంది వివిధ ఆరోగ్య, ఇతర కారణాలతో సెలవుల్లో ఉంటారు. అంతిమంగా కనిపించేది 157 మంది. వీరే 24 గంటలూ విధులు నిర్వహించాల్సిన క్రమంలో అప్పటికప్పుడు అందుబాటులో ఉండే వారు వీరిలో సగం మంది. ఈ కాస్త సిబ్బందిలోనూ ప్రతిసారి 60 నుంచి 70 మందిని ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు. అంటే పోలీస్‌ స్టేషన్లలో ఒకరిద్దరు తప్ప ఇంకెవరు ఆయా చోట్ల ఉండరన్న మాట. అంతేకాక కొన్నిసార్లు తమ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఇతర ప్రాంతాలకు విధుల నిర్వహణకు వెళ్లిన వారిని, కనీసం ఆ పని అయిన తర్వాత ఇంటికి కూడా పంపకుండా అటు నుంచి అటే మరో డ్యూటీకి వెళ్లమంటున్నారు. ఈ తీరుతో పోలీస్‌ యంత్రాంగం కూడా తీవ్ర ఆవేదన చెందుతోంది. దీనికితోడు నిరంతర పర్యవేక్షణ కొరవడటంతో కేసుల దర్యాప్తు మందగించింది.

ప్రత్యేక కేటాయింపులు అవసరం: ముఖ్యమంత్రి నివాసం, సచివాలయం, ఇతర ప్రధాన కేంద్రాలు ఇతర జిల్లాల్లో ఉండవు. అందువల్ల భద్రత పరంగా గుంటూరు జిల్లాకు పని అధికంగా ఉంటుంది, ఆ మేర సిబ్బంది కేటాయింపులు జరగాలి. కానీ ఆ విధంగా లేకపోవటంతో ఉన్న సిబ్బందితోనే అందరూ తంటాలు పడుతున్నారు. పోలీస్‌ ఉన్నతాధికారులు వాస్తవాలను స్వయంగా సమీక్షించి, పరిశీలించి సమస్య శాశ్వత పరిష్కారానికి చొరవ చూపాలి. బందోబస్తు విధులకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే ప్రతి నెలలో ఇలానే 20 రోజులు పోలీసులు తమ, తమ స్టేషన్ల పని కాకుండా ఇతర విధులు నిర్వహించాల్సి వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని