logo

కౌలుకార్డులు మూడోవంతు

ఒకప్పుడు భూమి కలిగి ఉన్నవారిని రైతులుగా భావించేవారు. పంటరుణాలతోపాటు అనేక రకాలైన రాయితీ పథకాలు వీరికే అందించేవారు. అయితే పలు కారణాల వల్ల భూమి కలిగిన రైతులు సాగు నుంచి దూరమవుతున్నారు.

Published : 28 Jun 2022 06:20 IST

ఈనాడు-అమరావతి: ఒకప్పుడు భూమి కలిగి ఉన్నవారిని రైతులుగా భావించేవారు. పంటరుణాలతోపాటు అనేక రకాలైన రాయితీ పథకాలు వీరికే అందించేవారు. అయితే పలు కారణాల వల్ల భూమి కలిగిన రైతులు సాగు నుంచి దూరమవుతున్నారు. చాలాచోట్ల నీటివసతి కలిగి సారవంతమైన భూములు సైతం సాగుకు నోచుకోవడం లేదు. ఈపరిస్థితి అటు పల్నాడు.... ఇటు డెల్టాలోనూ ఉంది. రెండు పంటలు పండించేచోట ఒకటి పండించి సరిపెట్టుకుంటున్నారు. అయితే గత దశాబ్దకాలం నుంచి వ్యవసాయంలోకి ప్రవేశిస్తున్న కౌలుదారుల సంఖ్య పెరుగుతుండటం కొంత సానుకూల పరిణామం. వీరి భాగస్వామ్యం దాదాపు అన్ని పంటలు పండించడంలోనూ ఉంటోంది. 2011 కౌలుకార్డుల మంజూరు తర్వాత వరుసగా కొన్ని సంస్కరణలు చేస్తూ కౌలుదారులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో కార్డులు మంజూరు మాత్రం చాలా తీసికట్టుగా ఉంటోంది. ఫలితంగా ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. వాస్తవంగా భూములు సాగుచేసేవారికే సాయం అందించాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇటీవల పలు విధాన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ-పంట నమోదు మొదలు పంటలబీమా, రాయితీ పథకాలు, పంటరుణాలు, రైతుభరోసా ఇలా అన్నింటిలో వారికి అవకాశాలు కల్పిస్తోంది. వాస్తవసాగులో కౌలుదారుల సంఖ్య 60శాతంపైగా ఉండగా కార్డులు పొందుతున్నవారి సంఖ్య మూడో వంతుకు మించడం లేదు. భూమి సాగుచేస్తున్న వారిని కౌలుదారులుగా గుర్తించాలని ఉన్నతాధికారులు పదేపదే ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఈఏడాది ఖరీఫ్‌ సీజన్‌ మొదలైన నేపథ్యంలో కౌలురైతుల సంక్షేమానికి పెద్దపీట వేసేలా జరిగే కసరత్తులో జాప్యం జరుగుతోంది. రెండు నెలల నుంచి కౌలు రైతుల గుర్తింపు, కార్డులు మంజూరు వంటి ప్రక్రియ మొదలైనప్పుటికీ లక్ష్యం దిశగా సాగడం లేదు. చాలావరకు ఈపాటికే పచ్చిరొట్ట విత్తనాలు రాయితీపై పంపిణీ పూర్తయింది. వరి, అపరాల విత్తనాలు అందించాల్సి ఉంది. పంటరుణాల మంజూరు ప్రక్రియ మొదలైన నేపథ్యంలో కౌలుకార్డులు కీలకమయ్యాయి.


లక్ష్యం బారెడు... ఆచరణ మూరెడు

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈఏడాది 90,459 కార్డులు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 33,299 కార్డులు మాత్రమే మంజూరుచేశారు. చాలాచోట్ల భూయజమానులు అంగీకరించి పత్రాలు ఇవ్వకపోవడం, ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కౌలుదారులకు ఇవ్వడానికి యజమానులు ఇష్టపడకపోవడం, ఇప్పటికే పంటరుణాలు భూయజమానులు తీసుకుని ఉండటం వల్ల కౌలుదారులకు కార్డులు ఇవ్వడానికి వారు ఒప్పుకోవడం లేదు. కృష్ణా పశ్చిమడెల్టాలో మాత్రం కౌలుదారులు భూములు తీసుకోవడానికి ముందుకురాకుండా కార్డులు తీసుకోవడానికి అంగీకరించే రైతుల భూములు కౌలుకు తీసుకుంటామని చెబుతుండటంతో అక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 11నెలల కాలవ్యవధితో పంటసాగు ధ్రువీకరణ పత్రాలు(సీసీఆర్‌సీ) మంజూరుచేస్తున్నా యజమానులు అంగీకరించడం లేదు. పంటరుణాలు, రైతుభరోసా, బీమా వంటివి నేరుగా కౌలుదారుల ఖాతాలకు జమచేస్తే తమకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.  రైతుభరోసా సాయం అందాలంటే జూన్‌ 30లోపు కౌలుకార్డు పొంది ఉండాలి. ఈలెక్కన మరో రెండు రోజుల్లో గడువు ముగుస్తున్నందున మెజారిటీ కౌలుదారులకు లబ్ధి అందేలా చూడాల్సి ఉంది. ఇందుకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడంతోపాటు అప్రమత్తం చేయాల్సిన తరుణమిదే. కౌలురైతులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి గుంటూరు పేరుపొందింది. మిర్చి, ప్రత్తి, వరి, కూరగాయల పంటల్లో ఎక్కువమంది కౌలుదారులు నిమగ్నమై ఉన్నారు. ఏడాది పొడవునా పూలు, ఆకుకూరలు పండించే సాగుదారుల్లో సింహభాగం వీరే ఉన్నారు. ఎకరం ఏడాది రూ.లక్షపైగా కౌలు ధర పలికే భూములు కూడా ఉన్నాయి. ఇందులో ఏడాది పొడవునా ఆకుకూరలు పండించి విజయవాడ, గుంటూరు నగరాలు, సమీప మున్సిపల్‌ పట్టణాల్లో రోజువారీగా విక్రయిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని