logo

నాడు-నేడు..ఏనాడో

పాఠశాలల్లో నాడు-నేడు రెండోవిడత పనుల నిర్వహణకు సిమెంటు లభ్యతే పెద్ద అవరోధంగా మారింది. కొన్ని పాఠశాలల్లో అయితే సిమెంట్‌తో సంబంధం లేని ఎలక్ట్రికల్‌ పనులు, మోటార్లు ఏర్పాటు వంటివి తొలుత చేయిస్తున్నారు. ఇప్పటికే చాలా

Published : 28 Jun 2022 06:20 IST
సిమెంట్‌.. స్టీల్‌ లేక.. పనులు సాగక..!
ఈనాడు-గుంటూరు
గుంటూరు కోనబాల ప్రభాకర్‌ నగరపాలక ఉన్నత పాఠశాలలో గదులు కూల్చేసి మెరక చేశారిలా

పాఠశాలల్లో నాడు-నేడు రెండోవిడత పనుల నిర్వహణకు సిమెంటు లభ్యతే పెద్ద అవరోధంగా మారింది. కొన్ని పాఠశాలల్లో అయితే సిమెంట్‌తో సంబంధం లేని ఎలక్ట్రికల్‌ పనులు, మోటార్లు ఏర్పాటు వంటివి తొలుత చేయిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల తరగతి గదులను కూల్చేశారు. వేసవి సెలవుల అనంతరం జులై 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆ వ్యవధి మరో వారం మాత్రమే ఉంది. రెండోవిడత కింద ఎంపికైన పాఠశాలల్లో 90 శాతం దాకా సిమెంటు లేక తరగతి గదుల నిర్మాణం దిశగా పనులు ప్రారంభించనే లేదు.

న్న తరగతి గదులను కూల్చేసి సకాలంలో కొత్తవి నిర్మించుకోలేక ప్రధానోపాధ్యాయులు సతమతమవుతున్నారు. మొత్తంగా సిమెంటుతో పాటు స్టీల్‌ అందుబాటులో లేవు. గతంలో ప్రభుత్వమే సిమెంటు, స్టీల్‌ సరఫరా చేసేది. దీంతో మొదటిదశలో చేపట్టిన పనులకు పెద్దగా ఇబ్బందులు రాలేదు. అదే అనుభవంతో రెండో విడత పనులకు శ్రీకారం చుట్టాలని గతేడాది డిసెంబరులోనే ఆదేశించింది. పనులు జాప్యమయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండో విడత కింద 1379 పాఠశాలలు ఎంపికయ్యాయి. వాటిల్లో అదనపు తరగతి గదులు, ఇప్పటికే ఉన్నవి మరమ్మతులకు గురైతే వాటి పునరుద్ధరణకు సంబంధించి మొత్తం 1984 గదుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రెండో విడత పనులకు రూ.469.93 కోట్లతో అంచనాలు రూపొందించారు. నిర్దేశిత మొత్తానికి తొలుత పనుల ప్రారంభానికి పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఖాతాలకు రివాల్వింగ్‌ఫండ్‌ కింద రూ.60.12 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తంలో ఇప్పటి వరకు కేవలం రూ.7.52 కోట్లే ఖర్చయింది. పనుల నిర్వహణకు నిధులు ఉన్నా ఆయా మెటీరియల్‌ కొరత కారణంగా పనులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.

మార్కెట్లో కొనుగోలు చేసుకోవాలని ఆదేశం

బహిరంగ మార్కెట్లో షాపుల నుంచి ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీనే కొనుగోలు చేసుకుని సమకూర్చుకోవాలని ఆదేశాలు వచ్చాయి. సిమెంట్‌  ధరలు ప్రస్తుతం మార్కెట్లో చుక్కలనంటాయి. ప్రభుత్వం సూచించిన తక్కువ ధరలకు సరఫరా చేయలేమని ప్రభుత్వ ఏజెన్సీలు చేతులెత్తేయటంతో ప్రధానోపాధ్యాయులే షాపుల చుట్టూ తిరిగి వాటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు, తెనాలి, నరసరావుపేట తదితర ప్రధాన పట్టణాల్లో నిల్వలు బాగానే ఉన్నాయి. మిగిలిన చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లోని వ్యాపారులు తొలుత ఎంత మొత్తంలోకావాలో ఇండెంట్‌ పెట్టండి. ఆతర్వాత 10-15 రోజుల్లో డెలివరీ ఇస్తామని చెబుతున్నారని కొందరు హెచ్‌ఎంలు గుర్తు చేశారు.


* బహిరంగ విపణిలో స్టీల్‌ ధరలకు అమాంతంగా రెక్కలొచ్చాయి. స్టీల్‌ ఆన్‌ కాల్‌ పేరుతో ఆన్‌లైన్‌లో పాఠశాలకు అవసరమైన ఇనుము బుక్‌ చేసుకుంటే ఆ మొత్తాన్ని పాఠశాలకు పంపిణీ చేయటం లేదు. గతంలో సరఫరా చేసేవారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు తాము సరఫరా చేయలేమని స్టీల్‌ వ్యాపారులు చేతులేత్తేశారు. ప్రత్యామ్నాయంగా బహిరంగ మార్కెట్లో ప్రధానోపాధ్యాయుల్ని కొనుగోలు చేసి సమకూర్చుకోవాలని ఇటీవల సూచించారు.

-సత్తెనపల్లి డివిజన్‌కు చెందిన ప్రధానోపాధ్యాడు


* సిమెంట్‌ బుకింగ్‌కు సమగ్రశిక్ష అధికారులు సూచించిన లాగిన్‌లో సాంకేతిక లోపాలు ఉన్నాయి. కనీసం ఆర్డర్‌ కూడా అది స్వీకరించటం లేదు. ఈవిషయాన్ని సంబంధిత మండల ఈఏలకు తెలియజేసినా ఆ సాంకేతిక సమస్యలను పరిష్కరించలేదు. ఇలా సిమెంట్‌ బుకింగ్‌ చేసుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. చాలా పాఠశాలల్లో ఇటుక, మట్టి, కంకరు  వంటివి అందుబాటులో ఉన్నా కీలకమైన సిమెంట్‌, స్టీల్‌ లేక పనులు మొదలు పెట్టలేదు.

-గుంటూరు డివిజన్‌కు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని