logo

రాయితీ పరికరాలకు దరఖాస్తు చేసుకోండి

పల్నాడు జిల్లాలో మెట్ట ప్రాంతం ఎక్కువగా ఉండటంతో బిందు, తుంపర సేద్యంలో పంటలు, పండ్ల తోటల సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తుంటారు. గత మూడేళ్లుగా సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహాకాలు నిలిచిపోయాయి.

Updated : 28 Jun 2022 06:39 IST

బిందు, తుంపర సేద్యానికి ప్రోత్సాహం

న్యూస్‌టుడే, ముప్పాళ్ల: పల్నాడు జిల్లాలో మెట్ట ప్రాంతం ఎక్కువగా ఉండటంతో బిందు, తుంపర సేద్యంలో పంటలు, పండ్ల తోటల సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తుంటారు. గత మూడేళ్లుగా సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహాకాలు నిలిచిపోయాయి. ప్రస్తుత ఖరీఫ్‌ నుంచి రాయితీలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుభరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు చేయించుకున్న రైతులకే ప్రోత్సాహాకాల్ని వర్తింపజేయనున్నారు.

* పల్నాడు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 6,800 హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం లక్ష్యంగా ఉంది. కొన్ని రోజులుగా ఆర్‌బీకేల్లో రైతుల వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1027 మంది రైతులు 1057 హెక్టార్లలో సాగుకు ప్రోత్సాహాకాలు అందించాలని వివరాలు నమోదు చేయించుకున్నారు. ఇంకా చాలామంది అన్నదాతలు నమోదుకు దూరంగా ఉన్నారు. వారంతా చైతన్యంతో ముందుకు రావాల్సిన తరుణమిదే.‌

* బిందు సేద్యానికి ఐదెకరాల్లోపు రైతులకు 90శాతం రాయితీతో పరికరాల్ని అందించనున్నారు. 5 నుంచి 12.5 ఎకరాలకు 50 శాతం రాయితీ వర్తిస్తుంది.

* తుంపర సేద్యానికి అన్నివర్గాల రైతులకు 50శాతం రాయితీతో పోర్టబుల్‌ స్ల్పింకర్లు అందించేలా నిర్ణయించారు.

* ఆర్‌బీకేల్లో ఏపీఎంఐపీ యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. గతంలో రాయితీకి డీడీలు తీసి ప్రోత్సాహకం అందని వారికి ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకం లేదా 1బీ అడంగల్‌, ఆధార్‌, చరవాణి వివరాలతో రైతులు ఆర్‌బీకేల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్షేత్ర పరిశీలన చేసి అర్హులకు అవసరమైన పరికరాల్ని పంపిణీ చేయనున్నారు.బిందు, తుంపర సేద్యంలో సాగుకు ముందుకొచ్చే అన్నదాతలు రాయితీ కోసం రైతుభరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు చేయించుకోవాలని ఏపీఎంఐపీ పల్నాడు జిల్లా డీఎంఐవో ఆంజనేయులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని