logo

పూర్తయితే పట్టణ రోగులకు వైద్య భరోసా

నూతన వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌ల భవన నిర్మాణానికి నిధులున్ననూ, సకాలంలో వాటిని నిర్మించనందున అవి రోగులకు అక్కరకు రాకుండాపోతున్నాయి. ఫలితంగా వైద్యులు అరకొర వసతులున్న అద్దె భవనాల్లోనే వైద్యసేవలు అందించాల్సి వస్తోంది.

Published : 30 Jun 2022 05:17 IST

పర్యవేక్షణ కరవై, ముందుకు సాగని నూతన ‘అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌’ల నిర్మాణం
తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే

తెనాలి - గుంటూరు రోడ్డు మార్గంలో యూహెచ్‌సీ భవన నిర్మాణం కోసం చేసిన సెంట్రింగ్‌ ఏర్పాట్లు

నూతన వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌ల భవన నిర్మాణానికి నిధులున్ననూ, సకాలంలో వాటిని నిర్మించనందున అవి రోగులకు అక్కరకు రాకుండాపోతున్నాయి. ఫలితంగా వైద్యులు అరకొర వసతులున్న అద్దె భవనాల్లోనే వైద్యసేవలు అందించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఒక్కో యూహెచ్‌సీకి ఇచ్చిన నిధులు చాలకుంటే యూఎల్‌బీ (అర్బన్‌ లోకల్‌ బాడీల)ల నుంచి సమకూర్చుకొని, సత్వరమే వాటిని పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వాటి అమలును పట్టించుకున్న కమిషనర్లే లేకపోయారు. ఉదాహరణకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్లకు ఒక యూహెచ్‌సీ మంజూరైంది. గుత్తేదారు చేయించిన రూ.80 లక్షల పనులకుగాను రూ.60 లక్షలు మంజూరయ్యాయి. అదనంగా చేయించిన పనుల బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. దీనికి భిన్నంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని యూహెచ్‌సీల పనులు దక్కించుకున్న కొందరు గుత్తేదార్లు సకాలంలో వాటిని పూర్తి చేయట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే వాటి పునాదుల నిర్మాణం కోసం తవ్వించిన గుంతల్లో మట్టిని పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. కమిషనర్లు, ఇంజినీర్లు ఆ నిర్మాణ పనుల్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంటే ప్రజాధనం దోపిడీకి తావుండదని ఇంజినీరింగు నిపుణులు పేర్కొంటున్నారు.


నిబంధనల మేరకు నిర్మాణ పనులు జరిపించాలి
- కె.శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ ఇంజినీరు, ప్రజారోగ్యశాఖ, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు

అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.80 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. వాటితో భవనం నిర్మించి, దర్వాజాలు, కిటికీలు తదితరాలను పెట్టించారు. ఇలా నిబంధనల మేరకు నిర్మాణ పనులు జరిగేలా చూడడం కమిషనర్లు, ఇంజినీర్ల విధి. సకాలంలో వాటి నిర్మాణ పనులు పూర్తయ్యేలా వారు పర్యవేక్షించాలి. ఇలా పర్యవేక్షణ కొనసాగిన చోట అవి పూర్తయి ప్రారంభోత్సవం కూడా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని