logo

అర కోటి వెచ్చించినా..!

గుంటూరు మిర్చియార్డులో రూ.50 లక్షల వ్యయంతో నాణ్యత ప్రయోగశాల ఏర్పాటు చేసి రెండేళ్లవుతోంది. మొదట్లో కొన్ని పరికరాలు అమర్చడంలో జాప్యం వల్ల వినియోగంలోకి రాలేదు. ఇప్పుడు అన్నీ సిద్ధం చేసి ఉంచినా రైతులు, వ్యాపారులు నాణ్యత

Published : 30 Jun 2022 05:17 IST

ప్రయోగశాల వైపు తొంగి చూడని  రైతులు, వ్యాపారులు
మిర్చియార్డు, న్యూస్‌టుడే

గుంటూరు మిర్చియార్డులో రూ.50 లక్షల వ్యయంతో నాణ్యత ప్రయోగశాల ఏర్పాటు చేసి రెండేళ్లవుతోంది. మొదట్లో కొన్ని పరికరాలు అమర్చడంలో జాప్యం వల్ల వినియోగంలోకి రాలేదు. ఇప్పుడు అన్నీ సిద్ధం చేసి ఉంచినా రైతులు, వ్యాపారులు నాణ్యత పరీక్షల కోసం అటువైపు తొంగి చూడటం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి నాణ్యత లేదని రైతులు నష్టపోయే అవకాశం ఉండకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. నాణ్యత సాకు చూపి వ్యాపారులు ధరలో కోత పెట్టడం యార్డులో సర్వసాధారణం. రైతులు ఎంతో కొంతకు మిర్చిని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు దాపురించకుండా ఉండేందుకు మిర్చియార్డులో నాణ్యత ప్రయోగశాల ఏర్పాటుకు లక్షలాది రూపాయలు వెచ్చించినా ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు.

మిర్చియార్డులో ఏర్పాటు చేసిన ప్రయోగశాల

ఆసియా ఖండంలోనే పేరెన్నికగన్న మిర్చియార్డుకు ఒక్క గుంటూరు జిల్లా నుంచే గాకుండా కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్‌ జిల్లాల నుంచి కూడా రైతులు మిర్చిని తరలించి విక్రయాలు జరుపుతుంటారు. విదేశాలకు ఎగుమతి చేసేటంత నాణ్యత లేదంటూ మిర్చి ధరను తగ్గించి క్రయవిక్రయాలు సాగిస్తుంటారు. దూరాభారం నుంచి వచ్చిన రైతులు మళ్లీ సరకును వెనక్కి తీసుకెళ్లలేక ఎంతో కొంత ధరకు విక్రయించుకుంటూ కొంతమేర నష్టపోవాల్సి వస్తుంది. ఆ విధంగా జరగకుండా ఉండేందుకు పరిపాలనా భవనంలో మిర్చి నాణ్యత ప్రయోగశాలను సిద్ధం చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసినా ఆశించిన ప్రయోజనం చేకూరకపోవడంతో సొమ్మంతా బూడిదలో పోసిన పన్నీరైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నాణ్యత ఇలా..

ఎగుమతులు ప్రధానంగా మిర్చి ఘాటు, రంగుపై ఆధారపడి ఉంటాయి. మిర్చి నాణ్యత ఏమేరకు ఉందో ఈ రెండింటి ఆధారంగానే తెలుసుకుంటారు. విదేశాలకు మిర్చిని ఎగుమతి చేసే వ్యాపారులు స్పైసెస్‌ బోర్డులో మిర్చి నాణ్యత చేయించి ధ్రువపత్రం తీసుకుని ఆ తర్వాత ఎగుమతి చేస్తున్నారు. సరిగ్గా ఈ తరహా ప్రయోగశాలనే ఇప్పుడు యార్డులో ఏర్పాటు చేస్తున్నారు. రూ.50 లక్షలు వెచ్చించి హై ప్రొఫైల్‌ లిక్విడ్‌ క్రోమెటోగ్రఫీ (హెచ్‌.పి.ఎల్‌.సి) పరికరాన్ని ప్రయోగశాలలో అమర్చారు. మిర్చి ఘాటును స్కోపెల్‌ హీట్ యూనిట్్స (ఎస్‌.హెచ్‌.యు)ల్లో, మిర్చి రంగును ఆస్టా యూనిట్్స (ఎ.యు)ల్లో లెక్కిస్తారు.

మొదట్లో అన్ని పరికరాలు రాకపోవడం వల్ల మిర్చి రంగు ఎంత మేరకు ఉందో తెలుసుకునే పరీక్షలను మాత్రమే చేశారు. కొన్ని పరికరాలతో పాటు స్టాండర్డ్‌ కెమికల్‌ లేకపోవడంతో మిర్చి ఘాటు పరీక్షలు అప్పట్లో చేయలేదు. ఇప్పుడు అన్నీ వచ్చినా అటు రైతులు, ఇటు వ్యాపారులు వినియోగించుకోవడం లేదు. వ్యాపారులకు మిర్చిని ఎగుమతి చేసేందుకు నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన ధ్రువపత్రం అవసరం.   ఆ తరహా ధ్రువీకరణపత్రం స్పైసెస్‌ బోర్డులోనే ఇస్తున్నారు. మిర్చియార్డులో ఇచ్చే పత్రం వల్ల వారికి అంతగా ఉపయోగం ఉండదు. దీంతో ఎగుమతి వ్యాపారులు ఇక్కడ పరీక్షలు చేయించడం లేదు. నాణ్యత నిర్ధారణ పరీక్షలకు నగదు తీసుకుంటున్నారని రైతులు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఘాటు నిర్ధారించే పరీక్షలకు రూ.1400, రంగు తెలుసుకునే పరీక్షలకు రూ.400 వంతున వసూలు చేస్తున్నారు. డబ్బు వెచ్చించి ఎక్కడ పరీక్షలు చేయిస్తామని రైతులు రావడం లేదని యార్డు అధికారులు పేర్కొంటున్నారు. నాణ్యత పరీక్షలు చేస్తారని రైతులకు తెలియకపోవడం, అవగాహన లేకపోవడంతో రావడంలేదని ఇంకొందరు చెబుతున్నారు.


అవగాహన కల్పించేందుకు చర్యలు
- వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి

మిర్చి ఘాటు, రంగు పరీక్షల నిమిత్తం ఇక్కడ ప్రయోగశాల ఏర్పాటు చేశాం. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. పరీక్షలు చేయించడం వల్ల డిమాండ్‌ చేసి మంచి ధరకు రైతులు అమ్ముకొనే అవకాశం ఉంటుంది. ఆ దిశగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. దీనిని రైతులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని