logo
Published : 30 Jun 2022 05:17 IST

మీరో మాట చెబితే చాలు..!

సిఫార్సు లేఖయినా ఇవ్వండి
ఉద్యోగుల బదిలీల్లో ఇదీ సంగతి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో సిఫార్సు లేఖలు.. నేతల మాటలే ప్రాతిపదికగా మారాయని ఉద్యోగులు  చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఖాళీగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఉద్యోగులు బదిలీపై వెళాల్సి ఉంది. ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తయినవారు తప్పనిసరిగా బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రజాప్రతినిధులు సిఫార్సులతో వారికి నచ్చిన చోటుకు వెళ్లేందుకు ఉద్యోగులు వారికి ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతో ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను మరోచోటకి పంపి అక్కడికి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఎక్కువమంది డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. వీరందరి డిప్యుటేషన్లు రద్దు చేయడంతో ఇద్దరు ఉద్యోగులే మిగిలారు. వీరు ఐదేళ్ల కంటే ఎక్కువకాలం ఇక్కడ పనిచేయడంతో వారికి బదిలీ తప్పనిసరి అయింది. దీంతో ఈ కార్యాలయంలో ఉద్యోగులందరూ ఇతర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది. ఇక్కడికి ఎవరు వస్తారన్న విషయం చర్చనీయాంశమైంది. ఉమ్మడి జిల్లా కేంద్రంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు చేపడుతున్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాలకు వెళ్లేందుకు కొందరు పంచాయతీ కార్యదర్ళులు ఆసక్తి కనబరుస్తున్నారు. నిబంధనల ప్రకారం మేజర్‌ పంచాయతీలకు గ్రేడ్‌-1 కార్యదర్శులను నియమించాలి. ఇందుకు భిన్నంగా మైనర్‌ పంచాయతీలకు బదిలీ చేయాలని కొందరు గ్రేడ్‌-1 కార్యదర్శులు కోరుతున్నట్లు తెలిసింది. అందుకు ప్రజాప్రతినిధుల సిఫార్సులు ఉండటంతో అధికారులు అంగీకరించక తప్పడం లేదన్న వాదన వినిపిస్తుంది. గ్రేడ్‌-4 కార్యదర్శులు మేజర్‌ పంచాయతీలను కోరుకుంటుండటం గమనార్హం. బదిలీల్లో నేతల ప్రమేయం ఎక్కువగా ఉండటంతో అధికార యంత్రాంగం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది.

రెవెన్యూ శాఖలో.. రెవెన్యూ శాఖలో బదిలీలపై ఇప్పటికే జాబితా సిద్ధమైనట్లుగా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామ స్థాయిలో పనిచేసే వీఆర్వో నుంచి మండల స్థాయి తహసీల్దార్ల వరకు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసి వారు అనుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈక్రమంలో ఒకరిపై ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఐదేళ్లు పూర్తికాకపోయినా వారి స్థానాలను కూడా ఇతరులు కోరుకుని సిఫార్సు లేఖలు తెచ్చుకోవడం ఇబ్బందికర పరిణామాలకు దారితీసింది. ఒక మండలంలో పనిచేస్తున్న తహసీల్దారుకు తెలియకుండానే మరొకరు నేతల సిఫార్సులతో రావడానికి ప్రయత్నించడంతో అప్పటి వరకు పని చేస్తున్న తహసీల్దారు ఒకరు అవాక్కయ్యారు. ఏ కారణంతో నన్ను నేతలు వద్దనుకుంటున్నారో చెబితే మరో మండలానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, చివరి క్షణంలో ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని తోటి ఉద్యోగుల వద్ద వాపోయినట్లు సమాచారం. గురువారం సాయంత్రానికి బదిలీల జాబితాలు బయటికి వచ్చేవరకు తమ స్థానం పదిలంగా ఉంటుందో లేదోనన్న సందిగ్ధం ఆయా ఉద్యోగుల్లో ఉత్కంఠకు కారణమవుతోంది.

చివరి వరకు లేఖలు.. గురువారం జాబితాలు విడుదలకు చివరిరోజు అయినప్పటికీ బుధవారం రాత్రి వరకు ఉద్యోగులు నేతల సిఫార్సు లేఖలు తీసుకుని ఉన్నతాధికారులను కలుస్తూనే ఉన్నారు. బదిలీలకు గడువు సమీపించడంతో ఉద్యోగులు పలువురు కలెక్టరేట్‌కు చేరుకుని తమకు ఎక్కడ పోస్టింగ్‌ వస్తుందన్న విషయమై చర్చించుకోవడం కనిపించింది. నేతల లేఖలు తీసుకువస్తే తమను ఎక్కడ మార్పు చేస్తారోనన్న ఆందోళనలో ఐదేళ్లు పూర్తికాని వారు ఉన్నారు. బుధవారం రోజంతా ఉద్యోగులు ఎక్కడ కలిసినా బదిలీలపైనే చర్చ నడిచింది. కార్యాలయాల్లో కూడా ఎవరు ఎక్కడికి వెళ్తున్నారన్న సమాచారంపై ఆరా తీయడం కనిపించింది. మొత్తంమీద గురువారం జాబితాలు విడుదలయ్యే వరకు ఉత్కంఠ తప్పదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని