logo
Published : 30 Jun 2022 05:17 IST

‘సంపూర్ణ పోషణకు పెట్టుబడి పెట్టలేం’

సీడీపీవో సుజాతాదేవికి వినతిపత్రం అందిస్తున్న జ్యోతిరాణి, అంగన్‌వాడీ కార్యకర్తలు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో జులై 1 నుంచి అమలు చేయాలని చెప్పిన వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలకు తాము పెట్టుబడి పెట్టి అమలు చేయలేమని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి టి.జ్యోతిరాణి అన్నారు. ప్రత్తిపాడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవో వి.సుజాతాదేవిని బుధవారం కలిసి ఆ మేరకు వినతిపత్రం అందించారు. గర్భిణులు, బాలింతలకు రోజుకు ఒకొక్కరికి 125 గ్రాముల బియ్యం, 16 గ్రాముల నూనె, 30 గ్రాముల కందిపప్పు, కూరగాయలు, పోపు సామానుకు రూ.1.40పైసలు, గ్యాస్‌కు 50పైసలు మాత్రమే ఇస్తున్నారని, ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందన్నారు. నెల నెలా జీతాలు రాకపోయినా కేంద్రాల అద్దెలు, విద్యుత్‌ ఛార్జీలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంపూర్ణ పోషణ అమలుకు తగిన వసతులు, వండి పెట్టేందుకు వంటపాత్రలు, కుక్కర్లు, ప్లేట్లు, గ్లాసులు, కుర్చీలు, గ్యాస్‌ సిలిండర్‌ నెలకు ఒకటి సరఫరా చేస్తే ప్రభుత్వం చెప్పినట్లు వేడివేడి వంట చేసి పెట్టడానికి తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని వినతిపత్రంలో వివరించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు కరీమూన్‌, వనజ, నాగరాజకుమారి, మహాలక్ష్మి, శ్రీలక్ష్మి, తదితరులు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని