logo
Published : 30 Jun 2022 05:17 IST

బండికే కాదు.. వెన్నెముకకూ దెబ్బే

పర్చూరు, చీరాల పట్టణం, న్యూస్‌టుడే

పర్చూరు-బాపట్ల రహదారిలో కొమర్నేనివారిపాలెం వద్ద దారుణంగా దెబ్బతిన్న రోడ్డు.. గుంతలలో వాహనదారుల కష్టాలు

పర్చూరు నుంచి బాపట్ల వెళ్లే మార్గం చూస్తే కిలోమీటరు పరిధిలో ఎనిమిది పెద్ద గుంతలు.. 35 చిన్న చిన్న గోతులతో ఉంది. ఈ రహదారిలో ప్రయాణం ఎలా ఉంటుంది.. అదో నరకం.. ఇక నిత్యం అదే మార్గంలో తిరిగేవారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. అదే సరే.. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారిలో చాలామంది ఎదురుగా గుంత వచ్చిన బండిని పోనిస్తారు. ఇలా బండి గుంతలో పడి మళ్లీ పైకి ఎక్కే క్రమంలో బైక్‌కే కాదు.. వెన్నెముకకూ సమస్యలు ఏర్పడతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాలక్రమంలో ఇవి పెద్దవిగా మారే అవకాశం ఉందంటున్నారు.

జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి అడుగడుగునా గుంతలు, కుంగిన రోడ్డులో ప్రయాణం ప్రమాదాల అంచున సాగుతుంది. పర్చూరు నుంచి చెరుకూరు సమీపంలో నల్లమడలాకుల వరకు (ఉమ్మడి జిల్లా ప్రకాశం సరిహద్దు) సింగిల్‌ రోడ్డు ఉంది. రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకుండా ఎప్పటికప్పుడు బిట్లు..బిట్లుగా చేస్తున్నారు. దీనివల్ల ఒక చోట బాగు చేసే సరికి మిగిలిన ప్రాంతం గోతులమయంగా మారుతుంది. రహదారి అంచున కాలువలు ఉండడం తక్కువ కాలంలో నిర్మాణం దెబ్బతినడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. రోడ్డు విస్తరణ చేపట్టాలనే ప్రతిపాదనలు ఆమోదానికి లభించకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంగా బాపట్లను ఏర్పాటు చేసిన తర్వాత రోడ్డు ప్రాధాన్యం మరింత పెరిగింది. అద్దంకి నుంచి బాపట్లకు కొత్తగా బస్‌ సర్వీసులు ఏర్పాటు చేశారు. పర్చూరు-బాపట్ల మధ్య బస్‌ సర్వీసులున్నాయి. నిత్యం ఆటోలలో ప్రయాణికుల రాకపోకలు పర్చూరు-చెరుకూరు మధ్య సాగుతుంటాయి. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఇదే మార్గంలో జరుగుతుంది. 17.5 కి.మి. రోడ్డును పర్చూరు నుంచి నల్లమడలాకుల వరకు 7 మీటర్ల రోడ్డుగా విస్తరించి, 3 మీటర్ల అంచులు వేసేందుకు రూ.20 కోట్లు మంజూరు చేయాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటికి ఆమోదం లభిస్తేనే ప్రయాణికుల కష్టాలు తీరి జిల్లా కేంద్రానికి రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. పాత గుంటూరు జిల్లా పరిధిలో నల్లమడ లాకుల నుంచి బాపట్ల వరకు విస్తరించి అభివృద్ధి చేశారు. పాత ప్రకాశం జిల్లా పరిధిలో మాత్రం సింగిల్‌ రోడ్డును అరకొరగా అభివృద్ధి చేయడం మినహా పూర్తి స్థాయిలో జరగలేదు.

రహదారిలో గ్రామాలు: ఉప్పుటూరు, వీరన్నపాలెం, పోతుకట్ల, కొమర్నేనివారిపాలెం, రమణాయపాలెం, చెరుకూరు, కొత్తపాలెం. అద్దంకి నియోజకవర్గం, పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు, ఇంకొల్లు, యద్దనపూడి తదితర గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు.


దీర్ఘకాలిక సమస్యలు
- డాక్టర్‌ విజయ్‌కుమార్‌, ఎముకల వైద్య నిపుణుడు, చీరాల ప్రాంతీయ ఆసుపత్రి

తరచూ గుంతలు పడిన రహదారుల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం వల్ల వాహనాలు అదుపుతప్పి వాహనచోదకులకు, వెనుక కూర్చున్న వారికి గాయాలవుతుంటాయి. వాహనం వేగంగా వెళ్తున్న సమయంలో గుంత కనపడకపోవటంతో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇటువంటి మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటే వెన్నెముక సమస్యతో పాటు డిస్క్‌లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇవి దీర్ఘకాలిక సమస్యలుగా మారతాయి. వైద్యం చేయించుకున్నా పూర్తిగా నయం కాని పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాలలో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.


వాహనాలకు తరచూ మరమ్మతులు
 - మీరావలి, సీనియర్‌ మెకానిక్‌, చీరాల

గుంతలు పడిన రోడ్లపై ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తుంటే తరచూ మరమ్మతులు చేయించుకోవాల్సిందే. ప్రధానంగా వాహనానికి ఫోర్క్‌ కప్పులు, షాక్‌ అబ్జార్బర్‌ మరమ్మతులకు గురవుతాయి. వీటిని బాగు చేయించుకోవాలంటే బండిని బట్టి సుమారు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతాయి. వాహనచోదకులకు చేతి, భుజాల నొప్పులు వస్తాయి. మహిళలు నడిపే స్కూటీలకు వీటితోపాటు ఇంజిన్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ వాహనానికి గాలి తక్కువగా ఉంటే టైర్లు పగిలిపోయి వాహనం అదుపుతప్పుతుంది. వీటిని వెంటనే మరమ్మతులు చేయించుకోకపోతే ఒకదానికి మరొకటి వాహనానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. 

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని