logo

కొత్త ఆసుపత్రిలో వైద్య సేవలెప్పుడు?

పల్నాడు రోడ్డులోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలను జూన్‌ ఆఖరుకు ఎన్నెస్పీ కాలనీలోని నూతన భవనంలోకి మారుస్తామని గతంలో పాలకులు, అధికారులు చేసిన ప్రకటనలు ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం ఉన్న

Published : 30 Jun 2022 05:17 IST

ఎన్నెస్పీ కాలనీలోని ఆసుపత్రి నూతన భవనం

న్యూస్‌టుడే, నరసరావుపేట పట్టణం: పల్నాడు రోడ్డులోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలను జూన్‌ ఆఖరుకు ఎన్నెస్పీ కాలనీలోని నూతన భవనంలోకి మారుస్తామని గతంలో పాలకులు, అధికారులు చేసిన ప్రకటనలు ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం ఉన్న ఏరియా వైద్యశాలలో సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన నూతన భవనం మూడేళ్లుగా అందుబాటులోకి తీసుకురాలేదు. కొవిడ్‌ సమయంలో కరోనా బాధితులకు ఇక్కడ సేవలు అందించారు. కరోనా మొదటి, రెండో దశల్లో నూతన ఆసుపత్రి భవనం వినియోగించటం వల్ల మరుగుదొడ్లు, నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతింది. 2021 జూన్‌లో నూతన ఆసుపత్రిని తాత్కాలికంగా మూసేశారు. అప్పటి నుంచి ఆసుపత్రిని వినియోగంలోకి తీసుకురావడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు.
గత నెలలో నూతన ఆసుపత్రిపై వరుస కథనాలు రావడంతో అధికారులు సమావేశం ఏర్పాటు చేసి జూన్‌ ఆఖరుకు కొత్త భవనంలోకి మారుస్తామని చెప్పినా ఫలితం లేదు. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ, సైక్రియాటిస్టు తదితర సేవలు అందించేందుకు వైద్యుల నియామకం జరగలేదు. సిబ్బంది నియామకం చేపట్టలేదు. దీంతో పల్నాడు జిల్లాకు చెందిన రోగులు ఇప్పటికీ గుంటూరు జీజీహెచ్‌కి వెళ్లాల్సి వస్తోంది. ఏరియా ప్రభుత్వ వైద్యశాల నూతన భవనంలోకి మార్పుపై వైద్యవిధాన పరిషత్తు పల్నాడు జిల్లా సమన్వయకర్త రంగారావు మాట్లాడుతూ ఆసుపత్రి శవాగారం నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు కాలేదన్నారు. రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించిన అనంతరం నూతన భవనంలోకి మార్చుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని