logo

నగదుతోనే సరిపుచ్చారు!

అమ్మఒడి పథకం కింద అవసరమైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామంటూ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వేలాదిమందికి మొండిచేయి చూపింది. అమ్మఒడి పథకం కింద నగదు కావాలా.. ల్యాప్‌టాప్‌ కావాలా అంటూ గతేడాది ఏప్రిల్‌లో...

Published : 30 Jun 2022 05:17 IST

న్యూస్‌టుడే, సత్తెనపల్లి: అమ్మఒడి పథకం కింద అవసరమైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామంటూ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వేలాదిమందికి మొండిచేయి చూపింది. అమ్మఒడి పథకం కింద నగదు కావాలా.. ల్యాప్‌టాప్‌ కావాలా అంటూ గతేడాది ఏప్రిల్‌లో విద్యాశాఖ హడావుడి చేసింది. ఒక నమూనాలో విద్యార్థుల నుంచి ఐచ్ఛికాల్ని కోరింది. 8 నుంచి ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులకు వాటిని ఇస్తామని చెప్పింది. ఒకేసారి రూ.25వేల నుంచి రూ.30 వేలు విలువ చేసే పరికరం అందుతుందని పది, ఇంటర్‌ చదివే విద్యార్థులు ల్యాప్‌టాప్‌ కావాలంటూ అంగీకారం తెలిపారు. తీరా నగదుతోనే సరిపెట్టారు.

ఉమ్మడి జిల్లాలో 2020-21 విద్యా సంవత్సరానికి అమ్మఒడి పథకం కింద ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ చదివే 4,25,525 మంది విద్యార్థులకు రూ.14 వేలు చొప్పున నగదు అందజేశారు. 2021-22 విద్యా సంవత్సరానికి నగదుకు బదులు ల్యాప్‌టాప్‌ ఇచ్చేలా ఐచ్ఛికాలు తీసుకున్నారు. 8 నుంచి ఇంటర్‌ విద్యార్థులు ఉమ్మడి జిల్లాలో 1,97,800 మంది ఉండగా వీరిలో 7,273 మంది అభిప్రాయ సేకరణకు ముందే అనర్హులయ్యారు. మిగిలిన వారి నుంచి ఆప్షన్లు తీసుకోగా 82,297 మంది ల్యాప్‌టాప్‌ కావాలంటూ ఆప్షన్‌ ఇచ్చారు. వారి వివరాల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. గత విద్యా సంవత్సరంలో అమ్మఒడి సాయం అందలేదు. 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అందజేసిన అమ్మఒడి సాయంలో ల్యాప్‌టాప్‌ ఉంటుందని అర్హులందరూ భావించారు. ఆ ఆప్షన్‌ ఇచ్చినా రూ.13 వేలు సాయంతో సరిపెట్టడంపై విద్యార్థులు నిరాశ చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని