logo

చక్కని తిండి... తక్కువ తినండి..!

ప్రతి మనిషి నిత్యం 20 గ్రాముల నూనె వాడాలి. కానీ దీనికి రెట్టింపుస్థాయిలో నూనెల వాడకం జరుగుతుంది. ఇదే అసలు సమస్యగా ఉంది...

Published : 30 Jun 2022 05:17 IST

న్యూస్‌టుడే- అమరావతి ఫీచర్స్‌

‘తక్కువ తినండి... ఎక్కువ పని చేయండి... ఎక్కువ పనిచేసి ఎక్కువకాలం బతకండి’
- చాలా ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలో డైలాగ్‌ ఇది.
అందులోని సందర్భం... భావన వేరే అయినా ఇప్పటి పరిస్థితులకు సానుకూలంగా అన్వయించుకుంటే ఈ డైలాగ్‌ అతికినట్లు సరిపోతుంది. రుచిగా ఉందని నాణ్యతలేని తిండి అతిగా తింటే వచ్చే అనర్థాలు, మితంగా తిని పెద్ద వయసులోనూ ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యంగా ఉండేవారి అనుభవాలను తెలుసుకుందాం.


20 గ్రాములే..

ప్రతి మనిషి నిత్యం 20 గ్రాముల నూనె వాడాలి. కానీ దీనికి రెట్టింపుస్థాయిలో నూనెల వాడకం జరుగుతుంది. ఇదే అసలు సమస్యగా ఉంది.

సీజనల్‌గా లభించే పండ్లను చిన్నారులకు అలవాటు చేయాలి. పండ్లలో పీచు పదార్థం ఉంటుంది. దీంతో బరువు పెరిగే సమస్య ఉండదు. పైగా అనారోగ్య సమస్యల్ని పండ్లు దరిచేరనివ్వవు.


25 దాటొద్దు..

వ్యక్తి బరువు కేజీల్లో.. ఎత్తును మీటర్లలో తీసుకోవాలి. బరువు, ఎత్తుతో భాగిస్తే వచ్చే అంకెలు మన శరీరస్థితిని తెలియజేస్తాయి. 18.5 కంటే తక్కువగా ఉంటే పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు. 25 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయం ఉచ్చులో పడినట్లే. 30 కంటే ఎక్కువ ఉంటే అత్యంత ప్రమాదంలో ఉన్నట్లు.

ఉదహరణకు ఒక వ్యక్తి ఎత్తు 165 సెంటిమీటర్లు.. బరువు 65 కేజీలు అనుకుంటే బీఎంఐ పద్ధతిలో భాగింపు ద్వారా 23.9 వస్తుంది. ఇది సాధారణస్థాయిలో లావు ఉన్నట్లు. అదే 165 సెంటిమీటర్లు పొడవు.. 68 కేజీల బరువు ఉంటే 25.0 వస్తుంది. ఇది ఊబకాయంలో ఉన్నట్లు సూచిస్తుంది.

30%
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సుమారు 20 లక్షల మంది వరకు ఊబకాయంతో బాధపడుతున్నారనేది నిపుణుల భావన. వీరిలో 25 నుంచి 30 శాతం చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.  


గోరు వెచ్చటి నీరు తాగుతా,..
- పి.ప్రసాదరాజు(68), విశ్రాంత ఉద్యోగి, ముత్యాలంపాడు, విజయవాడ

రోజూ ఐదు గంటలకు నిద్రలేస్తా, గోరు వెచ్చటి నీరు అరలీటరు తాగుతా, అనంతరం వాకింగ్‌కు వెళతా. ఇంటికి వచ్చి స్నానాదులు ముగించుకుని 3 రాగి ఇడ్లీ తింటాను. తిరిగి మధ్యాహ్నం వరకు ఏ రకమైన ఆహారం తీసుకోను. వ్యాపార పనులు చూసుకుంటా 12గంటలకు ఎక్కువ ఆకుకూరలతో తక్కువ అన్నం తింటాను. కొద్ది సేపు నడుస్తా. సాయంత్రం 5గంటలకు మొలకెత్తిన  పెసలు, క్యారెట్‌, ఉల్లి, ఎర్రదుంప, నానబెటివ్టన శనగలు వంటివి తింటాను.  రాత్రి 8గంటలకు రెండు గోధుమ రొట్టెలు నూనె లేకుండా తింటా..మితాహారంతో భేషుగ్గా ఉన్నాను.


సమయ పాలన పాటించాలి
- డాక్టర్‌ సిహెచ్‌ మనోజ్‌ కుమార్‌, మణిపాల్‌ ఆసుపత్రి

సమయ పాలన తప్పక పాటించాలి.ఉదయం అల్పాహారం 40శాతం,  మధ్యాహ్నం భోజనం 40శాతం, రాత్రి 20శాతం ఉండే విధంగా చూసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు 50శాతం ఉండాలి. 30శాతం మేర ప్రోటీన్లు  ఉండాలి. 20శాతం మేర నూనె పదార్ధాలు, ఇతరాలు ఉండాలి. అన్నం, ఉప్పు తగ్గించాలి.  రాత్రి నిద్ర కనీసం 8గంటలుండాలి. నిద్రకు ఉపక్రమించేందుకు 2 గంటల ముందు ఆహారం తీసుకోవాలి.  


బరువు అదుపు.. అదే ఆరోగ్యానికి మదుపు

‘గతంలో నా శరీర బరువు 75 కిలోలు ఉండేది. యోగసనాలు, ధ్యానం, ప్రాణాయామానికి రోజులో గంటసేపు కేటాయించడం, మితాహారంతో తొమ్మిది కిలోల బరువు తగ్గాను. ఇప్పుడు శరీరం తేలిగ్గా, ఉత్సాహంగా ఉంటోంది’ అని సత్తెనపల్లికి చెందిన ఆతుకూరు లక్ష్మి(47) చెబుతున్నారు. ఒత్తిడితో కూడిన జీవితంలో ఉన్నా ఎప్పుడూ మితాహారాన్ని, వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఫలితంగా ఆరు పదుల వయసు దాటినా దీర్ఘకాలిక వ్యాధులేవీ దరిచేరకుండా నిత్య యువకుడిలా ఉన్నానని విశ్రాంత ఉద్యోగి వరప్రసాదరావు(65) చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని