logo
Published : 03 Jul 2022 06:26 IST

స్ఫూర్తి కెరటాలు..ఈ గురుశిష్యులు!

‘పవర్‌ లిఫ్టింగ్‌’లో కళ్లు చెదిరే ప్రదర్శనలు చేస్తున్న వైనం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : తమ, తమ విభాగాల్లో బరువులు ఎత్తడంలో పోటీపడుతూ కళ్లు చెదిరే ప్రదర్శనల ద్వారా రాష్ట్ర, జాతీయ పోటీల్లో పతకాల పంట పండిస్తూ నారీ శక్తిని చాటుతున్నారు గురుశిష్యులైన కొల్లిపర నాగశిరీష, నాగం జ్ఞానదివ్య. తెనాలి మండలం కఠెవరంలోని మాతృశ్రీ స్పోర్ట్స్‌ అకాడమీలో సాధన చేస్తూ ముందంజ వేస్తున్న వీరి స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని తెలుసుకుందాం.

అంతర్జాతీయ పోటీలకు.. జ్ఞానదివ్య

సాధన చేస్తున్న జ్ఞానదివ్య 

తెనాలి మండలం కఠెవరం గ్రామానికి చెందిన నాగం జ్ఞానదివ్య ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేశారు. ఫిట్నెస్‌ కోసం తమ గ్రామంలోనే అందుబాటులో ఉన్న అకాడమీకి 2021లో వచ్చారు. ఈ క్రమంలో ఈమెలోని సత్తాను గమనించిన గురువు నాగశిరీష ఈమెను ‘పవర్‌ లిఫ్టింగ్‌’ వైపు మరలేలా చేశారు. నిరంతర సాధనతో తర్ఫీదు కొనసాగించిన  దివ్య తొలి ఏడాదే రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు. 

* ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో మూడు విభిన్న విభాగాల్లో మూడు బంగారు, మేలో అనకాపల్లిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోటీల్లో వెండి, జూన్‌ 9న మంగళగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. తద్వారా ‘ఓవరాల్‌ స్ట్రాంగ్‌ ఉమన్‌’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 

* ఈనెల 8 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు హాజరవనున్నారు.

* కేరళలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో మూడు బంగారు పతకాలు గెలుచుకున్న నేపథ్యంలో ఆగస్టు 26 నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఈమెను ఎంపిక చేస్తూ తాజాగా ‘పవర్‌ లిఫ్టింగ్‌ ఇండియా అసోసియేషన్‌’ ధ్రువపత్రం పంపింది. 

లక్ష్యం: అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించి, తెనాలి ఖ్యాతిని నలు దిశలా చాటుతానని చెప్తున్నారు జ్ఞానదివ్య. 

జాతీయ స్థాయిలో జయకేతనం ఎగురవేస్తున్న నాగశిరీష 

నాగశిరీష

గుంటూరుకు చెందిన కొల్లిపర నాగశిరీష చదువుతో పాటు క్రీడలపై ఆసక్తితో ఎన్టీఆర్‌ స్టేడియంలో సాధన చేస్తూ 2004లో పరుగు పోటీల్లో రెండు విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు అందుకున్నారు. ఆపై క్రీడల కోటాలో ఉద్యోగం, ఫిట్నెస్‌ కోసం పవర్‌లిఫ్టింగ్‌ వైపు వచ్చారు. తొలుత గుంటూరు, మంగళగిరి, ఆపై కఠెవరంలో గురువులు శ్రీనివాసరావు, సంథాని, కోటేశ్వరరావు, సుభాన్‌వలి, వెంకట్రామిరెడ్డి వద్ద సాధన చేశారు. 

* తొలుత రాష్ట్ర స్థాయిలో విజయాలు సాధించి, తర్వాత 2005, 2006, 2007 సంవత్సరాల్లో జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాలు, 2007లోనే ‘స్ట్రాంగ్‌ ఉమన్‌’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 

* 2008లో పోటీ పరీక్షల అనంతరం క్రీడల కోటాలో పోలీసు విభాగంలో ఎస్సైగా ఉద్యోగం వచ్చినా, వెళ్లకుండా క్రీడలపై ఆసక్తితో 2008 డీఎస్సీ ద్వారా వ్యాయామ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. 2009లో ఉద్యోగంలో చేరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించి, 2019 నుంచి తెనాలి మండలం నందివెలుగు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. 2010లో పోలీసు కానిస్టేబుల్‌ మస్తాన్‌వలితో ఈమెకు వివాహమైంది. తెనాలిలో స్థిరపడిన ఈమెకు భర్త ప్రోత్సాహం జత కావడంతో తిరిగి తాను నేరుగా పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు. 

* 2018లో పాండిచ్చేరిలో జరిగిన ‘సౌత్‌ ఇండియా స్పోర్ట్స్‌ మీట్’లో పవర్‌లిఫ్టింగ్‌లో సీˆనియర్‌ విభాగంలో బంగారు పతకం గెలుచుకున్నారు. 

* అనంతరం వరసగా రాయ్‌పూర్, బీహార్‌లలో 2018, 2019 సంవత్సరాల్లో జరిగిన ‘ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ ఎంప్లాయీస్‌ స్పోర్ట్స్‌ మీట్’లో పవర్‌లిఫ్టింగ్‌లో వెండి, బంగారు పతకాలు సాధించారు. అవే పోటీలు ఇటీవలె (జూన్‌ 22) న్యూదిల్లీలో జరగ్గా.. తొలిసారిగా వెయిట్లిఫ్టింగ్‌లో సత్తా చాటి, జాతీయ స్థాయి పోటీని ఎదుర్కొని కాంస్య పతకం గెలుచుకున్నారు. 

లక్ష్యం: అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు గెలుచుకోవడంతో పాటు మరింత మంది విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే.  

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని