logo
Published : 03 Jul 2022 06:26 IST

విద్యార్థులే ఉద్యోగులు!

గుంటూరులో ఎల్లెడలా విస్తరిస్తున్న సేవా రంగం

న్యూస్‌టుడే-పట్టాభిపురం: కరోనా  దెబ్బకు మధ్యతరగతి, పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి  రెండేళ్లల్లో  అట్టడుగుస్ధాయికి చేరింది. ఈ పరిస్ధితుల్లో  పలువురు విద్యార్థులు చదువుకుంటూనే ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగం చేసుకునేందుకు గుంటూరులో ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరి సహాయం లేకుండా తమ చదువులకు అవసరమైన ఫీజులను తామే కట్టుకుంటున్నారు. ఆహారాన్ని ఇంటికి చేర్చే.. స్విగ్గి, జొమాటో,  అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, జియోమార్ట్‌, బిగ్‌బాస్కెట్‌తో సహా పదుల సంఖ్యలో ఈకామర్స్‌ సంస్థల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా అనేక కొత్త సంస్థలు కూడా వస్తూనే ఉన్నాయి. కొందరు ప్రైవేటు కళాశాలల్లో వార్డెన్లుగా, జూనియర్‌ లెక్చరర్లుగా, హోమ్‌ ట్యూషన్లు చెబుతూ  డబ్బు సంపాదిస్తున్నారు. కొవిడ్‌ తర్వాత ఈకామర్స్‌ సంస్థలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. గుంటూరు నగరంలోనే వేలాదిగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోమ్‌ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. అందుకే ఈకామర్స్‌ సంస్థల సేవలకు బాగా గిరాకీ పెరిగింది. ఆహారం, ప్రయాణం, వైద్యం, ఇంటికి అవసరమయ్యే నిత్యవసరాలు ఇలా.. అన్నీ ఇంటికే తెప్పించుకుంటున్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌  కళాశాలల్లో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు  పార్ట్‌టైం కొలువులు చేసుకుంటూ తమ కాళ్ల పై తాము నిలబడుతున్నారు. ఫుల్‌టైం ఉద్యోగాలు చేసేవాళ్లు సాయంత్రం నుంచి ఇళ్లకు వెళ్లిపోతుంటారు. ఆ సమయంలో విద్యార్థులు రంగంలోకి దిగి రాత్రి వరకూ విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలోనే హోటళ్ల నుంచి ఆహారం తెప్పించుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటోంది. ప్రస్తుతం చదువులు పూర్తిచేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న యువత కూడా వీటిలో చేరుతున్నారు. సరైన ఉద్యోగం వచ్చేలోగా ఖాళీగా ఉండకుండా ఎంతోకొంత ఆదాయం సంపాదించుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నానని అశోక్‌నగర్‌కు చెందిన పవన్‌ తెలియజేశారు. ప్రైవేటు కొలువులు చేస్తున్న వాళ్లు, దుకాణాల్లో పనిచేస్తున్న వాళ్లు.. కూడా చాలామంది ఈ సంస్థల్లో సాయంత్రం నుంచి సేవలు అందిస్తున్నారు. ఎప్పుడు ఖాళీ ఉంటే.. అప్పుడు తమ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌ చేస్తే.. చాలు. ఉపాధి వెతుక్కుంటూ వస్తోందని, ఓపిక ఉన్నంత వరకూ పనిచేసుకోవచ్చని త్రినాధ్‌ వివరించారు. స్టడీ అవర్స్‌లో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు గంటల వంతున పని చేస్తున్నట్లు కల్యాణ్‌ వెల్లడించారు.

పోటా పోటీతో పెరిగిన సేవల విస్తరణ..

విద్యార్థులే ఒకరి ద్వారా మరొకరు రిఫరెన్స్‌లు ఇచ్చుకుంటూ సంబంధిత సంస్థల్లో చేరుతున్నారు. ద్విచక్రవాహనం ఉంటే మాతో కలిసి పనిచేసుకోవచ్చంటూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు కమీషన్లు పెంచుతూ, మరోవైపు సేవలను విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని సంస్థలు చిన్న బిస్కెట్‌ ప్యాకెట్‌ నుంచి ఏది కావాలన్నా ఇంటికే తెచ్చి ఇస్తున్నాయి. ఉదయం కళాశాలకు వెళుతూ.. సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఓ నాలుగైదు గంటలు పనిచేసి.. నెలకు కనీసం ఓ రూ.10-15వేలు సంపాదించుకుంటున్న విద్యార్థులూ ఉన్నారు.  

ఎంత సమయం పనిచేస్తే అంత ఆదాయం... ఒక విద్యార్థి రోజుకు కేవలం మూడు గంటలే పనిచేసి తర్వాత తన చదువుపై ధ్యాస పెడుతుంటాడు. మరొకరు పది గంటలు పనిచేస్తుంటారు. ఎవరు ఎంత సమయం పనిచేశారనే దాని ఆధారంగానే ఆదాయం కూడా వస్తోంది. ఒక్కో డెలివరీకి రూ.30 నుంచి రూ.50 వరకూ కమీషన్‌ ఇస్తారు. కొవిడ్‌ తర్వాత డెలివరీ బాయ్‌లకు టిప్‌లు కూడా ఇవ్వొచ్చంటూ చాలా సంస్థలు అధికారికంగా తమ యాప్‌లలో ఆప్షన్‌ పెట్టాయి.  ఒక్కో విద్యార్థి నెలకు కనీసం రూ.10 వేల నుంచి రూ.15,000 వరకూ ఈ పార్ట్‌టైం కొలువల ద్వారానే సంపాదిస్తున్నారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని