logo

నాణ్యమైన విద్య అందిస్తాం

నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాను విద్యాపరంగా రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) రామారావు తెలిపారు. ఉపాధ్యాయుల సహకారంతో జిల్లాను మొదటి ఐదు స్థానాల్లో నిలిచేలా పాటుపడతానన్నారు.

Published : 03 Jul 2022 06:26 IST

‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో డీఈవో రామారావు

వేమూరు, న్యూస్‌టుడే: నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాను విద్యాపరంగా రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) రామారావు తెలిపారు. ఉపాధ్యాయుల సహకారంతో జిల్లాను మొదటి ఐదు స్థానాల్లో నిలిచేలా పాటుపడతానన్నారు. ఈనెల 5న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయా పాఠశాలల్లో తగిన వసతులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా రెండో విడతలో వందల పాఠశాలల రూపురేఖలు మారనున్నాయన్నారు. ఇప్పటికే పాఠశాలలకు 80 శాతం పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశామని, పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందిస్తామని చెప్పారు. బడులు తెరుస్తున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో మాట్లాడారు.

ప్రశ్న: రెండో విడత ‘నాడు-నేడు’ పనులు ఎంత వరకు మొదలయ్యాయి?  

జవాబు: జిల్లాలో రెండో విడత నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేయడానికి 469 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందుకు సంబంధించి రూ.108 కోట్ల నిధులు మంజూరు కాగా, ఇప్పటికే రూ. 13 కోట్ల నిధులు ఆయా విద్యా కమిటీ ఖాతాల్లో జమయ్యాయి. వాటిలో రూ.3.5 కోట్ల నిధులు ఖర్చయ్యాయి. ప్రస్తుతం 222 పాఠశాలల్లో పనులు మొదలయ్యాయి. మిగతాచోట్ల ఓ వారంలో పనులను ప్రారంభించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. అభివృద్ధి పనులకు సంబంధించి నిత్యం వివరాలు నాడు-నేడు యాప్‌లో పొందుపరచాలని కోరాం.

ప్రశ్న: ఇప్పటికే చేపట్టిన మొదట విడత పనుల మాటేమిటీ?

జవాబు: మొదటి విడత నాడు-నేడు పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మతులు అవసరమైతే చేయడానికి ప్రభుత్వం ఒక్కొక్క పాఠశాలకు రూ. 10 వేల చొప్పున నిధులను మంజూరు చేసింది. అక్కడ విద్యాకమిటీ వాటిని వినియోగించి విద్యర్థులకు ఇబ్బంది లేకుండా వసతులను కల్పించాలి.

ప్రశ్న: ఈ ఏడాదైనా సకాలంలో పాఠ్యపుస్తకాలు అందిస్తారా?

జవాబు: ప్రస్తుతం జిల్లాకు 80 శాతం పుస్తకాలు వచ్చాయి. వాటిని పాఠశాలలకు పంపిణీ కూడా చేపట్టాం. ఎనిమిదో తరగతి సిలబస్‌ మారడం వల్ల అవి కాస్త ఆలస్యమయ్యాయి. మూడు, నాలుగు రోజుల్లో అవి కూడా వస్తాయని సమాచారం ఉంది. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.

ప్రశ్న: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షణ నిర్వహణ ఎలా?

జవాబు: జిల్లాలో 2,434 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాలేదు. వీరందరికి ఈనెల 6 నుంచి పరీక్షలు నిర్వహించడానికి 24 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశాం. పరీక్షలో తప్పిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా పరీక్షా ఫలితాలు వెలువడిన తరవాత రోజు నుంచి వారికి ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. నూరు శాతం ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం.

ప్రశ్న: ఉపాధ్యాయుల కొరత ఎలా అధిగమిస్తారు?

జవాబు: ప్రస్తుతం విద్యాశాఖలో ఉపాధ్యాయులకు సంబంధించి హేతుబద్దీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఇది పూర్తయితే టీచర్ల కొరతపై స్పష్టత వస్తుంది. కొన్నిచోట్ల 3, 4, 5 తరగతుల విద్యార్థులను దగ్గరలోనున్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తాం. దాన్ని బట్టి చూసుకుంటే ఉపాధ్యాయుల కొరత ఉండకపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని