logo
Published : 03 Jul 2022 06:26 IST

ఉపాధి కూలీలపై పరికరాల భారం

నాలుగేళ్లుగా పంపిణీ లేని వైనం


పనులు చేస్తున్న కూలీలు

ఈనాడు, నరసరావుపేట, బాపట్ల: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు నాలుగేళ్లుగా పరికరాలు ఇవ్వడం లేదు. దీంతో వారే సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి కొనుగోలుకు కూలీలు ఒక్కొక్కరు రూ.500కుపైగా వెచ్చిస్తున్నారు. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది. ఎండ నుంచి రక్షణకు నీడ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆచరణలో అమలు కావడం లేదు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. నిబంధనల ప్రకారం కూలీల వేతనాలకు 60 శాతం, సామగ్రి విభాగం కింద 40శాతం నిధులు వెచ్చించాల్సి ఉంది. పరిపాలనా ఖర్చుల కింద ఆరు శాతం మించకుండా చూసుకోవాలి. సామగ్రి విభాగం, పరిపాలనకు వెచ్చించే నిధులు కింద పరికరాలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే నాలుగేళ్లకుపైగా గ్రామీణాభివృద్ధి శాఖ పరికరాల కొనుగోలుకు అనుమతి ఇవ్వకపోవడంతో సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో గతంలో ఏడాదికి రూ.కోటి వెచ్చించి కూలీలందరికీ పరికరాలు పంపిణీ చేసేవారు. పార, గడ్డ పలుగు, బొచ్చెలు, నీడ కోసం టెంట్లు, ప్రాథమిక చికిత్సకు కిట్లు సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పనిచేసే ప్రదేశంలో ప్రమాదవశాత్తూ గడ్డపలుగు తగిలి గాయపడితే ప్రాథమిక చికిత్సకు కనీస సామగ్రి అందుబాటులో లేదు.

మారుతున్న  ప్రాధాన్యాలు

కూలీలకు పని కల్పించడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రారంభంలో కూలీల సంక్షేమం కోసం అనేక సౌకర్యాలు కల్పించారు. పథకం అమలులో రాష్ట్రప్రభుత్వాల ప్రాధాన్యతలు ఏటికేడు మారడంతో కూలీలకు సౌకర్యాల కల్పనలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సామగ్రి విభాగం కింద సమకూరుతున్న నిధులను సీసీరోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం, గ్రామ సచివాలయాలు, గ్రామ ఆరోగ్యకేంద్రాలు, అంగన్‌వాడీ భవనాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు. కూలీలు పనిచేయడం వల్ల సమకూరిన సామగ్రి విభాగం కింద వచ్చే నిధుల కంటే ఎక్కువగా పనులు చేపడుతుండటంతో ఎప్పటికప్పుడు సామగ్రి విభాగం నిధుల లోటు కొనసాగుతోంది. గతంలో రాష్ట్రస్థాయిలో పరికరాలు కొనుగోలు చేసి జిల్లాలకు సరఫరా చేసేవారు. ఇప్పుడు కూలీల సౌకర్యాల కోసం నిధులు వెచ్చించాలంటే గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తప్పనిసరి. దీంతో జిల్లాల్లో పథక సంచాలకులు పరికరాలు సమకూర్చే వెసులుబాటు లేకుండా పోయింది.  

వెసులుబాటు ఉన్నా అమలుకాని వైనం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46వేల కూలీల బృందాలు ఉన్నాయి. ఒక్కొక్క బృందంలో 20 నుంచి 25 మంది ఉంటారు. ఒక్కొక్క బృందానికి ఐదు గడ్డ పలుగులు ఇచ్చేవారు. సంఘానికి రూ.450 విలువైన పరదా పట్టలు వేసవిలో సరఫరా చేసేవారు. 9.27 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఒక్కొక్క మండలానికి పని కల్పించే కూలీల సంఖ్యను బట్టి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు పరికరాలకు వెచ్చించేవారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో పెద్దఎత్తున కూలీలకు పని కల్పించినందున సామగ్రి విభాగం, పరిపాలనా విభాగం కింద నిధులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూలీలకు అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలు కల్పించే వెసులుబాటు ఉంది. అయితే ఇందుకు సంబంధించి నిధులు వెచ్చించడానికి పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారుల నుంచి అనుమతి లేదు. మరోవైపు ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌లో కూలీల సౌకర్యాలకు ఆప్షన్‌ లేకపోవడంతో నిధులు ఉన్నా ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకానికి వెచ్చిస్తున్న నిధుల్లో ఒక శాతం కూలీల సౌకర్యాల కోసం గతంలో వెచ్చించే వారు. దీనిని అమలు చేసి సౌకర్యాలు కల్పించాలని కూలీలు కోరుతున్నారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని