logo
Published : 03 Jul 2022 06:34 IST

ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వం ఏదీ?

ఐలు సెమినార్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది యలమంచలి శివ సంతోష్‌కుమార్‌


మాట్లాడుతున్న సుప్రీంకోర్టు న్యాయవాది శివసంతోష్‌కుమార్‌, చిత్రంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, సుధాకర్‌బాబు, శ్రీనివాసరావు

ఈనాడు-అమరావతి: దేశంలో ఇప్పటికీ ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనకబాటుతనమే కనిపిస్తోంది. ప్రజలందరికీ ఆర్ధిక సమానత్వం ఎక్కడ ఉంది? ఈ రంగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని సుప్రీంకోర్టు న్యాయవాది యలమంచలి శివసంతోష్‌కుమార్‌ అన్నారు. కేవలం రాజకీయ రంగంలో మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయటం వల్ల కొంతైనా రాజకీయ న్యాయం జరుగుతోందని చెప్పారు. 72 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ పేదలు పేదలుగానే ఉండిపోయారని కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే దేశ సంపద కేంద్రీకృతమై ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఉంటే అందరికి ఆర్థిక సమానత్వం ఎప్పటికి సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గుంటూరులోని ఏపీ కాటన్స్‌ అసోసియేషన్‌ హాల్లో శనివారం రాత్రి భారత రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న ప్రతి ఒక్కరికి ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం లక్ష్యాలు ఏమేరకు నెరవేరాయి అనే  అంశంపై అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) గుంటూరు యూనిట్‌ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. కేంద్ర, రాష్ట్రాలు సమష్టిగా పనిచేసి దేశంలో ఆర్థిక, సామాజిక న్యాయ ఫలాలు అనేవి ప్రతి ఒక్కరికి అందించటానికి కృషి జరగాలని ఆకాంక్షించారు. అట్టడుగున ఉన్న వారికి ఆర్థిక ఫలాలు అందినప్పుడే ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినట్లుగా భావించాలన్నారు. కుల,మత, ప్రాంతాలకతీతంగా విలువలతో కూడిన విద్యను అందించటం ద్వారానే ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. దేశంలో అనేక చట్టాలు, నిబంధనలు ఉన్నాయి. కానీ ఆచరణలో వాటి అమలు సరిగా లేక నీరుగారిపోతున్నాయని  ఆవేదన చెందారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజకీయ రంగం వ్యాపారమయంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధిక, సామాజికరంగాల్లో న్యాయం కోసం ప్రజలు నిలదీయాలని అప్పుడే మార్పు సాధ్యపడుతుందన్నారు. సమావేశంలో ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  ప్రముఖ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, మరో న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, జేకేసీ న్యాయకళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ సుధాకర్‌బాబు, గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాలడుగు వెంకటేశ్వర్లు, గుంటూరు యూనిట్‌ ఐలు అధ్యఋక్షుడు సయ్యద్‌బాబు తదితరులు హాజరై మాట్లాడారు. పలువురు న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని