logo
Published : 03 Jul 2022 06:40 IST

నాట్కో క్యాన్సర్‌ కేంద్రం రోగులకు వరం..

అందుబాటులోకి అత్యాధునిక యంత్రాలు

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.8.52 కోట్లు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే

క్యాన్సర్‌ చికిత్స అంటే మాటలు కాదు. వ్యాధి నిర్ధారణకు చేపట్టే పరీక్షల నుంచి చికిత్స కోసం వాడే మందుల వరకు అంతా రూ.లక్షలతోనే వ్యవహారం. ఆర్థికంగా స్థాయి ఉన్నవారు కూడా కొన్నిసార్లు భరించలేని పరిస్థితి. ఇక పేదలు, మధ్య తరగతి ప్రజల సంగతి వేరే చెప్పాల్సిన పనే లేదు. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా క్యాన్సర్‌ బాధితులకు ఉచితంగా సేవలు అందించేందుకు సర్వజనాసుపత్రిలో ‘నన్నపనేని లోకాదిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌’ను రూ.45 కోట్ల వ్యయంతో నాట్కో ట్రస్టు నిర్మించి ప్రభుత్వానికి అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లతో ఆధునిక పరికరాలను సమకూర్చింది. ఈ కేంద్రాన్ని 2020, జులై 1న ప్రారంభించారు. అది ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

నాట్కో ట్రస్టు సాయం

నాట్కో క్యాన్సర్‌ కేంద్రానికి వచ్చే రోగులకు అవసరమైన కొన్ని ఔషధాలను ఉచితంగా అందజేస్తున్నారు. నాట్కో ట్రస్టు ద్వారా గత రెండేళ్లలో సుమారు రూ.2 కోట్ల విలువైన మందులను సూపరింటెండెంట్‌కు అందజేశారు. ఆ భవన నిర్వహణకు ప్రతి నెలా రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా రూ.కోటి వ్యయంతో మామోగ్రామ్‌ పరికరాన్ని కొనుగోలు చేస్తున్నారు.

సీటీ సిమ్యులేటర్‌

శరీరంలోని అన్ని భాగాలను ఐదారు నిమిషాల్లోనే స్కాన్‌ చేస్తుంది. క్యాన్సర్‌ కణితులను గుర్తిస్తుంది. క్యాన్సర్‌ గడ్డ పరిమాణం ఎంత? ఏ మేరకు రేడియోథెరపీ ఇవ్వాలి? తదితర పరీక్షలన్నీ సీటీ సిమ్యులేటర్‌ యంత్రంపై నిర్ధారిస్తారు. అనంతరం రేడియోథెరపీ చికిత్స చేస్తారు.

నమూనా కేంద్రం

నాట్కో క్యాన్సర్‌ కేంద్రాన్ని ఓ నమూనా ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ సంకల్పం. దీని నమూనాను, ఇక్కడ రోగులకు అందుతున్న సేవలను రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వాసుపత్రుల్లోనూ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం క్యాన్సర్‌ రోగులకు ఇది రిఫరల్‌ ఆసుపత్రిగా మారింది.

బ్రాకీ థెరపీ

గర్భాశయ ముఖద్వార(సర్వైకల్‌) క్యాన్సర్‌ రోగులకు ఈ పరికరంతో ఎంతో ప్రయోజనం కలుగుతోంది. గతంలో వీరికి చికిత్స అందించేందుకు 18 గంటల సమయం పట్టేది. అప్పటి వరకు రోగి ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చేది. ఈ ఆధునిక పరికరం అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం 15 నిమిషాల్లోనే చికిత్స పూర్తవుతుంది. కణితి మళ్లీ పెరగకుండా గురి చూసి చికిత్స అందిస్తారు.

లీనియర్‌ యాక్సిలేటర్‌ యంత్రం

క్యాన్సర్‌ రోగులకు రేడియేషన్‌ థెరపీ ఇచ్చేందుకు అత్యంత ఆధునిక యంత్రం లీనియర్‌ యాక్సిలేటర్‌ పరికరం అందుబాటులో ఉంది. ఈ నూతన పరికరంతో క్యాన్సర్‌ కణితి ఎక్కడుందో, రేడియేషన్‌ ఎక్కడివ్వాలో సరిగ్గా దాన్ని కేంద్రంగా తీసుకుని.. చుట్టూ అన్ని వైపుల నుంచీ రేడియేషన్‌ ఇస్తూ పోతారు. దీనివల్ల సాధారణ కణజాలం ప్రభావితం కాదు. ఇటువంటి పరికరం రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాసుపత్రిలోనూ ఇప్పటి వరకు అందుబాటులో లేదు. రేడియేషన్‌ ఇచ్చే సమయంలో బాధా ఉండదు. కానీ క్యాన్సర్‌ కణజాలం మాత్రం రేడియేషన్‌ ప్రభావానికి గురై క్రమేపీ నశించిపోతుంటుంది.

సమర్థ చికిత్సలతో

సర్వజనాసుపత్రి నాట్కో క్యాన్సర్‌ కేంద్రానికి వస్తే క్యాన్సర్‌ను జయించవచ్చనే నమ్మకం బాధితుల్లో కలుగుతోంది. అందువల్లే కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఫలితం కనిపించక ప్రాణాపాయస్థితిలో వస్తున్నవారూ అధికంగానే ఉంటున్నారు. రోగుల వివరాలను ఆరోగ్యశ్రీ పథకంలో నమోదు చేసి చికిత్స అందించినందున జీజీహెచ్‌కి రూ.8.52 కోట్ల ప్రోత్సాహక నగదు అందింది.

జట్టుగా.. కలిసికట్టుగా వ్యూహం

క్యాన్సర్‌ చికిత్స అన్నది చాలా సందర్భాల్లో ఎవరో ఒక వైద్యుడితో అయిపోయేది కాదు. భిన్న విభాగాలకు చెందిన వైద్యులు ఒక జట్టుగా ఏర్పడి, ఇవ్వాల్సిన చికిత్స గురించి సమగ్రంగా చర్చించి, వాళ్ల అభిప్రాయాలను తీసుకుని ఆ ప్రకారం చికిత్స చేయడం వల్లే జీజీహెచ్‌లో రోగులకు పూర్తి ప్రయోజనం దక్కుతుంది. ఇక్కడికి వచ్చే రోగులను ఆహ్లాదకరమైన వాతావరణంలో చికిత్స అందించేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. క్యాన్సర్‌ ఆనవాళ్లను తొలి దశలోనే పట్టుకునే యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల్లో క్యాన్సర్‌ వ్యాధి పట్ల, దీని లక్షణాలను ముందే గుర్తించడం పట్ల అవగాహన పెంచుతున్నారు. క్యాన్సర్‌ను నిర్మూలించే కీమోథెరపీ, రేడియోథరపీ, శస్త్రచికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్‌ చికిత్సకు ఆంకాలజిస్ట్‌లే కాదు, అనుభవజ్ఞులైన పెథాలజిస్ట్‌లు, రేడియాలజిస్ట్‌లు, ఫిజిస్ట్‌ ఇలా అందరూ ఉన్నందున రోగులకు మెరుగైన చికిత్స సాధ్యమవుతోంది. నూతనంగా శస్త్రచికిత్స మందిరాన్ని నిర్మించినందున ఈ కేంద్రంలోనే శస్త్రచికిత్సలను ప్రారంభించారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా అత్యాధునిక వైద్య సేవలను అందిపుచ్చుకుంటూ ఉచితంగా నాణ్యమైన సేవలు అందిస్తోంది.

రోగులు ఏం చేయాలి

సర్వజనాసుపత్రికి చికిత్సకు వచ్చేవారు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నాట్కో క్యాన్సర్‌ కేంద్రంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అక్కడి నుంచి వైద్యుల వద్దకు పంపుతారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే తప్పకుండా తీసుకురావాలి.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని