logo

Andhra News : మార్కెట్‌ నాడిపట్టి.. లాభాలు కొల్లగొట్టి!

ప్రతికూల వాతావరణాన్ని జయించి, అరటిలో అద్భుత దిగుబడులు సాధిస్తున్నారు జిల్లా రైతులు. ముఖ్యంగా కొల్లిపర మండల పుడమిపుత్రులు పంట నాటే సమయం, దిగుబడులు, మార్కెట్‌ అంశాలపై పట్టు సాధించారు. తమ అపార అనుభవాన్ని రంగరించి

Updated : 15 Jul 2022 08:29 IST

కొల్లిపర అరటి రైతుల ఆదర్శ ప్రయోగం

కొల్లిపర, న్యూస్‌టుడే

గెలలు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు

ప్రతికూల వాతావరణాన్ని జయించి, అరటిలో అద్భుత దిగుబడులు సాధిస్తున్నారు జిల్లా రైతులు. ముఖ్యంగా కొల్లిపర మండల పుడమిపుత్రులు పంట నాటే సమయం, దిగుబడులు, మార్కెట్‌ అంశాలపై పట్టు సాధించారు. తమ అపార అనుభవాన్ని రంగరించి ప్రధాన మార్కెట్లలో ఎక్కడా పంట లభ్యంకాని ఈ కాలంలో దిగుబడులు వచ్చేలా ప్రణాళిక రచించుకొని, ప్రస్తుతం భారీ లాభాలు చవిచూస్తున్నారు.  స్థానిక మార్కెట్‌లో ప్రస్తుతం ఒక్కో అరటి గెలను కాయలను బట్టి రూ.600 నుంచి రూ.1009 వరకు విక్రయిస్తున్నారు. మార్చి మాసాంతానికి 1788 హెక్టార్లలో ఇక్కడ అరటి పంట సాగులో ఉంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో 544 హెక్టార్లలోని పంట నుంచి దిగుబడులు వస్తున్నాయి. తెనాలి క్లస్టర్‌ పరిధిలో 345 హెక్టార్లలో ఈ పంట సాగులో ఉంది.  
అరటి జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలతో ముగుస్తుంది. ఆ సమయంలో పలు ప్రాంతాల్లో పంట దిగుబడులు అధికం. గతంలో సాగు తెచ్చిన నష్టాలు ఇక్కడి రైతులకు అనుభవాలు నేర్పించాయి. దీంతో వీరు మొక్క నాటే సమయం, దిగుబడుల కాలాన్ని చక్కగా అంచనా వేస్తున్నారు. దిగుబడులు జూన్‌, జులై, అగస్టు మాసాల్లో వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అత్యధిక ధరలు పలికే కర్పూర, అమృతపాణి తదితర రకాలకు ప్రాధాన్యమిస్తున్నారు.

ప్రతికూల వాతావరణాన్ని జయించారు..అరటి సాగులో యాజమాన్య పద్ధతులు కీలకం. అకాల వర్షం, ఈదురు గాలుల నుంచి పంటలను కాపాడుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో గాలుల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు రూ.లక్షలు వెచ్చించి వెదురు బొంగులు పాతి, మొక్కలు నేలకొరగకుండా ఆసరా పెట్టారు. బిందు సేద్యంతో వ్యవసాయ ఖర్చులు తగ్గించుకున్నారు. ఫలితంగా ఎరువుల వినియోగం, కలుపు వ్యయం గణనీయంగా తగ్గాయి. ఎకరాకు 850 నుంచి వెయ్యి మొక్కలు నాటారు.  
మార్కెట్‌ అనుకూలం.. కర్నూలు జిల్లా మహానంది, కోనసీమ జిల్లాలోని రావులపాలెం, మహారాష్ట్రలోని నాందేడ్‌, చెన్నై మార్కెట్‌లు అరటి వ్యాపారానికి ప్రసిద్ధి. ఈ ప్రాంతాల్లో పంట దిగుబడులపై ప్రతికూల వాతావరణం తీవ్ర ప్రభావం చూపింది. దిగుబడులు గణనీయంగా తగ్గాయి. జులై, అగస్టు మాసాలు పంట దిగుబడి కాలం కానందున అరటిగెలలు తక్కువ సంఖ్యలో మార్కెట్లకు వస్తాయి. ఇది స్థానిక మార్కెట్‌కు కలసివచ్చింది.


తొలిసారిగా..
-  దొప్పలపూడి రామయ్య, అన్నవరం

గడచిన కొన్నేళ్లుగా అరటిసాగు చేస్తున్నాం. పంట కాలంలో మార్పు అనివార్యమనుకున్నాం. పండగ వేళల్లో అరటికి మంచి డిమాండే వస్తున్న విషయాన్ని గుర్తించాం. సాగు చేపట్టే కాలంలో మార్పులు తీసుకొచ్చాం. ఇప్పుడు మార్కెట్‌లో గెలలకు మంచి ధర పలుకుతోంది. గెల రూ.1009 ధరకు విక్రయించాను.  


లాభాలపంట
- బొల్లు రామయ్య, పిడపర్తి

మూడెకరాల్లో అరటి సాగు చేపట్టా. పెట్టుబడులకు వెరవ లేదు. తుపాను, ఈదురుగాలుల నుంచి పంటను కాపాడుకునేందుకు వెదురు బొంగులు ఏర్పాటుచేశా. సంతలో గెల రూ.900 ధర పలికింది. ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం వస్తుందని ఆశిస్తున్నా.  


టిష్యూ కల్చర్‌కు ప్రోత్సాహం
- కె.విజయమోహన్‌, ఉద్యానశాఖ అధికారి

అరటి సాగులో టిష్యూ కల్చర్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. హెక్టారుకు రూ.30,739 రాయితీగా అందిస్తోంది. టిష్యూ కల్చర్‌ సాగుతో లాభాలు అధికం. ఒకేసారి పంట దిగుబడి వస్తుంది. నాణ్యమైన ఉత్పత్తులకు దోహదపడుతుంది. తెనాలి క్లస్టర్‌ పరిధిలోని బొమ్మువానిపాలెంలో 5 ఎకరాల విస్తీర్ణంలో టిష్యూ కల్చర్‌ సాగును కొనసాగిస్తున్నాం. రైతులు మంచి దిగుబడులు సాధించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని