logo

తిండి దండగన్న గురువులు!

‘చదువు రాని వాడికి తిండి ఎందుకంటూ’ గురువులు ఛీదరించుకోగా  మనస్తాపం చెందిన ఆ విద్యార్థి చివరకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.

Published : 09 Aug 2022 06:36 IST

మనస్తాపంతో బాలుడి బలవన్మరణం!

నెహ్రూనగర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే : ‘చదువు రాని వాడికి తిండి ఎందుకంటూ’ గురువులు ఛీదరించుకోగా  మనస్తాపం చెందిన ఆ విద్యార్థి చివరకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. గుంటూరు రైలుపేటకు చెందిన అంజమ్మ భర్త ఎనిమిదేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె రెక్కలు ముక్కలు చేసుకుని ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. చిన్న కుమారుడు ఆకాశ్‌ (18) ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. చదువులో వెనకబడి ఉండటంతో వారం కిందట ఓ ఉపాధ్యాయిని మందలించారు. మధ్యాహ్నం భోజనం చేయడానికి తోటి విద్యార్థులతో కలిసి వెళ్లగా.. ఆకాశ్‌ చేతిలో పళ్లెం లాక్కొని చదువురాని వాడికి అన్నం ఎందుకని తిట్టినట్లు అతడు ఇంటికి వచ్చి తల్లి వద్ద బాధపడ్డాడు. తల్లి నచ్చజెప్పి మళ్లీ బడికి పంపింది. మార్కులు సరిగా రాకపోవడంతో కొద్దిరోజుల కిందట ఓ ఉపాధ్యాయుడు టీసీ తీసుకుపోయి ప్రైవేటుగా పదో తరగతి రాసుకోమని తిట్టారని అతడు మళ్లీ తల్లికి చెప్పి ఏడ్చాడు. కొద్దిరోజులకు పరిస్థితి సర్దుకుంటుందని ఆమె నచ్చజెప్పింది. రెండురోజులుగా ఆకాశ్‌ బడికి వెళ్లడం మానేశాడు. తల్లి పనికి వెళ్తే ఆమె వెంటే ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం అన్న వెంకటేష్‌ తల్లికి ఫోన్‌ చేసి తమ్ముడితో ఇంటి తాళం చెవి పంపించమన్నాడు. ఆకాశ్‌ తాళాలు తీసుకొని ఇంటికి వెళ్లాడు. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టిన వెంకటేష్‌.. కూరగాయల కోసమని బయటకు వెళ్లాడు. అప్పటికే తీవ్ర మనస్తాపంతో ఉన్న ఆకాశ్‌.. తల్లి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరిగివచ్చిన వెంకటేష్‌ అది చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే తల్లికి చెప్పగా.. గుండెలు బాదుకుంటూ వచ్చిన ఆమె ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లింది. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో తల్లి, సోదరుడు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని