logo

ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

‘చదువు రాని వాడికి తిండి దండగ’ అని ఓ విద్యార్థిని చీదరించుకున్న ఉదంతంలో బాధ్యులైన ఇద్దరు ఉపాధ్యాయులపై గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజ మంగళవారం సస్పెన్షన్‌ వేటు వేశారు.  గుంటూరు వేణుగోపాల్‌నగర్‌లోని  

Published : 10 Aug 2022 04:19 IST

విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో చర్యలు

ఈనాడు-అమరావతి: ‘చదువు రాని వాడికి తిండి దండగ’ అని ఓ విద్యార్థిని చీదరించుకున్న ఉదంతంలో బాధ్యులైన ఇద్దరు ఉపాధ్యాయులపై గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజ మంగళవారం సస్పెన్షన్‌ వేటు వేశారు.  గుంటూరు వేణుగోపాల్‌నగర్‌లోని  కోనబాల ప్రభాకర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడిని కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఉపాధ్యాయులు కించపరిచేలా మాట్లాడటంతో మనస్తాపం చెంది రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన డీఈఓ తొలుత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు రమాదేవి, హైమారావుపై సస్పెండ్‌ వేటువేసి విచారణకు ఆదేశించారు. హెచ్‌ఎం మంజులత మరో ఉపాధ్యాయురాలు కల్యాణికి షోకాజ్‌ నోటిసులిచ్చారు. డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారి సుధాకర్‌రెడ్డిని ఘటనపై విచారణ చేసి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలన్నారు. మంగళవారం ఉదయాన్నే గుంటూరు ఎంఈఓ ఖుద్దూస్‌ను అసలు ఏం జరిగిందో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని డీఈఓ కోరటంతో ఆయన మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళ్లి విచారించి ప్రాథమిక నివేదిక అందజేశారు. చదువులో వెనకబడుతున్నారని, రెగ్యులారిటీ లేదని టీచర్లు కోపగించుకుని ఉండొచ్చు తప్పిస్తే అన్నం ప్లేటు లాక్కోలేదని, టీసీ తీసుకుని వెళ్లాలని సూచించలేదని సస్పెన్షన్‌కు గురైన ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాథమిక విచారణలో తెలియజేసినట్లు సమాచారం.

సమగ్ర శిక్ష ఏపీసీ బాధ్యతలు డీఈవోకే

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష అడిషినల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ బాధ్యతలు డీఈవో శైలజకు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్‌ఎస్‌ఏ ఏపీసీగా ఉన్న వెంకటప్పయ్యను గతంలోనే పల్నాడు జిల్లా నరసరావుపేట ఉపవిద్యాశాఖాధికారిగా నియమించారు. కానీ ఆయనను గుంటూరు సమగ్ర శిక్ష ఏపీసీగా రిలీవ్‌ చేయలేదు. తాజాగా ఆయనను రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వెంకటప్పయ్య సత్తెనపల్లి ఉపవిద్యాశాఖాధికారిగా, పల్నాడు ఎస్‌ఎస్‌ఏ ఏపీసీగా ఇన్‌ఛార్జి బాధ్యతలతోపాటు డీఈవో ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని