logo

జ్వరాలతో గైర్హాజరు

పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం బాగా తగ్గుముఖం పడుతోంది. దీనికి పిల్లల్లో నెలకొన్న అనారోగ్య కారణాలేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏ రోజుకారోజు విద్యార్థుల అటెండెన్స్‌ను ఈ-హాజరు రూపంలో తెలుసుకుంటోంది.

Published : 10 Aug 2022 04:19 IST

పాఠశాలల్లో తగ్గుతున్న పిల్లల హాజరు

ఈనాడు-అమరావతి: పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం బాగా తగ్గుముఖం పడుతోంది. దీనికి పిల్లల్లో నెలకొన్న అనారోగ్య కారణాలేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏ రోజుకారోజు విద్యార్థుల అటెండెన్స్‌ను ఈ-హాజరు రూపంలో తెలుసుకుంటోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల్లోపే ప్రధానోపాధ్యాయులు నేరుగా స్కూళ్ల వారీగా విద్యార్థుల హాజరు వివరాలను యాప్‌లో అప్లోడ్‌ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వాటిని పరిశీలించగా వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు ప్రారంభమైన తర్వాత హాజరుతో పోలిస్తే ప్రస్తుతం కొంచెం తగ్గినట్లు వెల్లడైంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులు సోమవారం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో మాట్లాడగా కొందరేమో సీజనల్‌ వ్యాధుల బారిన పడ్డారని, మరికొందరు వ్యవసాయ పనులు కావటం వల్లే కుటుంబీకులతో కలిసి పొలం పనులకు వెళుతున్నారని తెలియజేశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కలిపి 3600 వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఉన్నాయి. ప్రైవేటు, ఎయిడెడ్‌లో మరో వెయ్యి దాకా స్కూళ్లు ఉన్నాయి. వాటన్నింటిలో కలిపి 1-10 చదివే విద్యార్థులు సుమారు 5 లక్షల మంది ఉన్నారు. వీరిలో సగటున 10 నుంచి 13 శాతం మంది విద్యార్థులు స్కూళ్లకు గైర్హాజరవుతున్నారని ఉపాధ్యాయవర్గాల సమాచారం.

ఈ-హాజరుకు సిగ్నళ్ల సమస్యలు

పిల్లలు, ఉపాధ్యాయుల హాజరును ఆన్‌లైన్లో నమోదు చేయాలన్న ఆదేశాల్లో భాగంగా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లల్లో సిగ్నల్స్‌ వంటి సాంకేతిక సమస్యలతో హాజరు నమోదుకు అవరోధం ఏర్పడుతోంది. ఒకరు హాజరు నమోదు చేసుకున్న తిరిగి రెండో వ్యక్తికి హాజరు వేయటానికి కొద్ది నిమిషాల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు ఈ-హాజరును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఫిజికల్‌గా చూస్తే కొంచెం పిల్లలు ఎక్కువగానే ఉంటారు. ఈ ఫిజికల్‌ డేటా మొత్తాన్ని సాయంత్రంలోపు అప్‌డేట్‌ చేయటంతో సాయంత్రానికి కొంత గైర్హాజరీ శాతం తగ్గుతోందని, సాయంత్రం దాకా ఉన్న డేటాను పరిగనలోకి తీసుకుని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే బాగుంటుందని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని