logo

చూస్తే నిగనిగ.. తింటే ఆరోగ్యానికి పొగ

నగరంలో బిర్యానీ పాయింట్లు, చికెన్‌ పకోడి దుకాణాలు రోజురోజుకు   పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆహార పదార్ధాలను నిగనిగలాడేలా చేసి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రంగులు కలిపిన పదార్థాలను తింటే ఊపిరితిత్తుల

Published : 10 Aug 2022 04:19 IST
మిఠాయిలు, చికెన్‌లలో పరిమితికి మించి రంగుల వినియోగం
పట్నంబజారు,  వైద్యం(గుంటూరు)

గరంలో బిర్యానీ పాయింట్లు, చికెన్‌ పకోడి దుకాణాలు రోజురోజుకు   పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆహార పదార్ధాలను నిగనిగలాడేలా చేసి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రంగులు కలిపిన పదార్థాలను తింటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఉదరకోశ సంబంధిత వ్యాధులు ప్రబలుతాయని వైద్యులు చెబుతున్నారు. అయినా ధనార్జనే ధ్యేయంగా రంగుల దందా కొనసాగుతూనే ఉంది.  

నగరంలోని వివిధ కూడళ్లు, ప్రాంతాల్లో వందకు పైగానే చికెన్‌ పకోడి విక్రయ దుకాణాలు ఉన్నాయి. వీటిల్లో కొందరు రంగులు కలిపిన చికెన్‌ పకోడి, చికెన్‌ పీస్‌లు, లెగ్‌ పీస్‌లు విక్రయిస్తున్నారు. కరోనా ప్రభావంతో ఆర్డర్‌ పెట్టి ఆహారాన్ని ఇంటికే తెప్పించుకునే విధానానికి నగరవాసులు అలవాటు పడ్డారు. ఇదే అదనుగా కొందరు రెస్టారెంట్లు, హోటల్స్‌ నిర్వాహకులు చికెన్‌, మటన్‌లపై   ఇష్టానుసారంగా రంగులు కలుపుతున్నారు. ఇటీవల బృందావన్‌ గార్డెన్స్‌ల్లోని ఒక రెస్టారెంట్‌పై ఆహార తనిఖీ అధికారులు దాడులు నిర్వహించి 120 రంగు డబ్బాలను స్వాధీన చేసుకున్నారంటే రంగులు ఏ స్థాయిలో వాడుతున్నారో అర్థమవుతోంది.

తనిఖీ చేస్తున్న ఆహార భద్రత నియంత్రశాఖ అధికారులు (పాతచిత్రం)

అన్నింటా...

చిన్న చిన్న షాపుల్లో తయారు చేసే కూల్‌డ్రింక్స్‌ల్లో కొందరు వ్యాపారులు రంగులు కలుపుతున్నారు. ఈ తరహా రంగులతో తయారైన కూల్‌డ్రింక్స్‌ను చిన్నారులు తాగి రోగాల బారిన పడుతున్నారు.

* కొన్ని కిరాణా షాపుల్లో బెల్లం, కందిపప్పు, పసుపు, కారాల్లో సైతం రంగులు కలుపుతున్నారు. బెల్లంలో బ్రౌన్‌ కలర్‌, కందిపప్పులో పసుపు రంగు, కారంలో ఎరుపురంగు కలుపుతున్నారు.

* న్యూడిల్స్‌ పాయింట్ల నిర్వాహకులు కొందరు వెజ్‌ మంచూరియాలో ఎరుపురంగు కలిపి విక్రయిస్తున్నారు.

* క్యాబేజీ కూరతోపాటు సాంబారులో కర్రీ పాయింట్ల నిర్వాహకులు రంగులు కలిపి ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారు.

* మిఠాయిల తయారీలోనూ ఇదే పరిస్థితి.

పరిధి ఎక్కువ... అధికారులు తక్కువ..

జిల్లాల పునర్‌ విభజన జరిగాక 18 మండలాలకు కలిపి ఆహార భద్రత నియంత్రణ శాఖకు ఒక అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌, ఇద్దరు ఫుడ్‌ సేఫ్టీ అధికారుల్ని కేటాయించారు. ప్రస్తుతం ఒక అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌, ఒక ఫుడ్‌ సేఫ్టీ అధికారి మాత్రమే ఉన్నారు. పరిధి ఎక్కువ.. సిబ్బంది తక్కువ కారణంగా అధికారులు పనిభారం ఎక్కువై అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేయలేక పోతున్నామని చెబుతున్నారు. అధికారులు ఎటూ తనిఖీలకు రావడం లేదని ఇష్టానుసారం రంగులు కలుపుతున్నారు. దీంతో పాటు అక్కడక్కడ చూసీ చూడనట్లు వదిలేస్తున్న ఘటనలు ఉన్నాయి.

తనిఖీలు నిర్వహిస్తున్నాం - రవీంద్రరెడ్డి, ఆహార తనిఖీ అధికారి

నగరంలో బ్యాకరీలు, బిర్యానీ పాయింట్లపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. రంగులు కలిపిన ఆహార పదార్థాలు విక్రయించినట్లు రుజువైతే 6 నెలలు జైలు, రూ.5 లక్షలు జరిమానా విధిస్తామని దుకాణదారులకు స్పష్టం చేశాం. మిఠాయిల తయారీదారులు సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ను వాడుకోవచ్చు.


క్యాన్సర్ల ముప్పు  

-నాగూర్‌బాష, సహాయ ఆచార్యులు, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం, సర్వజనాసుపత్రి

రంగులు కలిపిన ఆహార పదార్థాలు తింటే క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో గుర్తించారు. దీంతోపాటు జీర్ణ సమస్యలు విపరీతంగా వేధిస్తుంటాయి. కొందరికి తేన్పులు విపరీతంగా వస్తుంటాయి. మరికొందరికి మలద్వారం నుంచి అపానవాయువులూ ఎక్కువే. పొట్ట ఉబ్బరం వంటి సమస్యలుంటాయి. కొందరైతే పొట్ట పట్టుకుని నిరంతరం వైద్యుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఈ సమస్యలు దరిజేరకుండా చూసుకోవాలంటే రంగులు కలిపిన ఆహార పదార్థాలను తినకుండా ఉండాలి.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని