logo

సాగర్‌ వైపు కృష్ణమ్మ పరుగులు

శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో దిగువనున్న నాగార్జునసాగర్‌ వైపు కృష్ణమ్మ వేగంగా పరుగులు తీస్తోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 580 అడుగులకు చేరువయ్యింది.

Published : 10 Aug 2022 04:19 IST

580 అడుగులకు చేరువలో నీటిమట్టం

నీటి కళతో జలాశయం

మాచర్ల, న్యూస్‌టుడే: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో దిగువనున్న నాగార్జునసాగర్‌ వైపు కృష్ణమ్మ వేగంగా పరుగులు తీస్తోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 580 అడుగులకు చేరువయ్యింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 578 అడుగుల నీటిమట్టం దాటింది. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి మొత్తం 2.46 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు క్రస్ట్‌గేట్లు, ఏపీ, తెలంగాణ విద్యుదుత్పాదన కేంద్రాల నుంచి ఇన్‌ఫ్లోగా 1.91 లక్షల క్యూసెక్కులు విడుదలవుతోంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.04 టీఎంసీలుకాగా ప్రస్తుతం 276.09 టీఎంసీలకు చేరుకుంది. సాగర్‌ నీటిమట్టం 585 అడుగులు దాటిన తరువాత ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని అంచనా వేస్తూ క్రస్ట్‌గేట్లు ఎత్తేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి మరో 10 అడుగులు మాత్రమే ఉండటంతో జలశోభ సంతరించుకుంది. భారీగా వీస్తున్న గాలులకు జలాశయంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. లాంచీ స్టేషన్‌లో లాంచీలు గట్టుకు చేరాయి. ప్రాజెక్టు వద్ద శోభను తిలకించేందుకు పర్యాటకులు బారులుదీరుతున్నారు. మంగళవారం మొహర్రం సందర్భంగా సెలవురోజు కావడంతో పర్యాటకులు తరలివచ్చారు. వాతావరణం చల్లగా ఉండటం, సన్నటి చిరుజల్లులు పడుతుండటంతో పర్యాటకులను మంత్రముగ్దుల్ని చేసింది.

పులిచింతలలో వరద నీరు విడుదల

అచ్చంపేట, న్యూస్‌టుడే: పులిచింతల ప్రాజెక్టులో మంగళవారం రాత్రి 7 గంటలకు వరద నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు 13, 14, 18వ నంబరు రేడియల్‌ గేట్లను 1.5 మీటర్ల ఎత్తులో తెరిచి 41,418 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి 10,000, లీకేజి ద్వారా మరో 400 కలిపి మొత్తం 51,818 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రకాశం బ్యారేజీకి వెళ్తోందని ఏఈఈ రాజశేఖర్‌ తెలిపారు. ఎగువ నాగార్జునసాగర్‌, టైల్‌పాండ్‌ ద్వారా 30,210 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టులో 40.02 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని