logo

సాయం అందుకో.. భవిత దిద్దుకో..

సత్తెనపల్లికి చెందిన ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు షరీఫ్‌ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ)కింద రూ.19 లక్షలు సాయం అందుకుని టిష్యూ కాగితం తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి తాను ఉపాధి పొందడంతోపాటు మరికొందరికి కల్పించారు.

Published : 10 Aug 2022 04:19 IST

‘పీఎంఈజీపీ’కింద రుణం యూనిట్‌కు రూ.50 లక్షలకు పెంపు


టిష్యూ కాగితం తయారీ యూనిట్‌

న్యూస్‌టుడే, ముప్పాళ్ల: సత్తెనపల్లికి చెందిన ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు షరీఫ్‌ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ)కింద రూ.19 లక్షలు సాయం అందుకుని టిష్యూ కాగితం తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి తాను ఉపాధి పొందడంతోపాటు మరికొందరికి కల్పించారు. బ్యాంకు నుంచి అందుకున్న రుణంలో 25 శాతం రాయితీ పొందాడు. ఇదే తరహాలో జిల్లాలో మరికొందరు యువకులు పీఎంఈజీపీ కింద గతంలో సాయం పొంది ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. యువ పారిశ్రామికవేత్తల్ని తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేసింది. వాటిపై అవగాహనతో సాయం పొందడం ద్వారా భవితను దిద్దుకునే అవకాశం యువతకు ఉంది.

యువతకు స్వయం ఉపాధి కల్పన.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని విరివిగా ఏర్పాటు చేసేలా ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంఈజీపీని అమలు చేస్తోంది. గతంలో ఉన్న ప్రధానమంత్రి రోజ్‌గార్‌ యోజన.. గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమాలు రెండింటిని కలిపి పీఎంఈజీపీగా ఇటీవలే మార్చారు. నిరుద్యోగులు, వృత్తి నైపుణ్యమున్న వారికి ఉపాధి కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పీఎంఈజీ కింద దరఖాస్తు చేసుకుంటే యూనిట్‌ విలువను బట్టి రూ.50 లక్షలు వరకు రుణం పొందొచ్చు. 35 శాతం వరకు రాయితీని అందుకోవచ్చు.

దరఖాస్తు ఎలా

18ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్టు వ్యయం రూ.5 లక్షల వరకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. తయారీ రంగంలో రూ.10 లక్షలు, సేవా రంగంలో రూ.5 లక్షలకు పైబడిన వ్యయం కలిగిన ప్రాజెక్టులకు కనీస విద్యార్హత 8వ తరగతిగా నిర్ణయించారు. www.kviconline.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాలేమైనా ఉంటే జిల్లా పరిశ్రమల కార్యాలయానికి వెళ్లి నివృత్తి చేసుకోవచ్చు.

గరిష్ఠంగా 35 శాతం రాయితీ

పీఎంఈజీపీ ద్వారా ఉత్పత్తి పరిశ్రమలకు గరిష్ఠ పరిమితి రూ.25 లక్షలు ఉండేది. ఉత్పత్తేర సంస్థలకు రూ.10 లక్షలు అందజేసేవారు. నూతన మార్గదర్శకాల మేరకు తయారీ రంగ పరిశ్రమల యూనిట్లకు ఇచ్చే సాయాన్ని రూ.50 లక్షలకు, సేవారంగం యూనిట్లకు రూ.20 లక్షలు ఇస్తున్నారు. యూనిట్‌ విలువలో గరిష్ఠంగా 35 శాతం, కనిష్ఠంగా 15 శాతం రాయితీ ప్రకటించారు. జనరల్‌ విభాగంలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారైతే 15 శాతం, గ్రామీణులకు 25 శాతం రాయితీ ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు పట్టణ ప్రాంతాల్లో వారికి 25 శాతం, గ్రామీణ ప్రాంతాల వారికి 35 శాతం రాయితీ అందుతుంది. గతంలో ఉన్న పరిశ్రమలకు తోడు డెయిరీ, ఆక్వాకల్చర్‌ యూనిట్లను ఇందులోకి కొత్తగా చేర్చారు.

* స్వయం సహాయక సంఘాలు, జాతీయ చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్‌, కేంద్ర గ్రామీణ పరిశ్రమల శిక్షణ సంస్థల ద్వారా వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకున్న వారికి యూనిట్ల ఏర్పాటులో ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరగతి పరిశ్రమలశాఖ, ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్‌(కేవీఐసీ) ద్వారా పీఎంఈజీపీ పథకాన్ని అమలు చేస్తున్నారు.

* 2022-23 ఆర్థిక సంవత్సరానికి వివిధ రంగాలకు నిధుల కేటాయింపులో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రుణాలిచ్చేందుకు పల్నాడు జిల్లాలో రూ.1744 కోట్ల నిధుల్ని కేటాయించారు. ప్రధాన బ్యాంకులన్నీ పీఎంఈజీపీ రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని