logo

జీతాల కోసం ఎదురుచూపులు

ప్రభుత్వ ఉద్యోగులకు జీతం నెలలో ఒకటో తేదీన పడతాయో? లేదో? గానీ బిల్లులు మాత్రం ఠంచన్‌గా చెల్లించాల్సిదే. కిరాణా దుకాణాల్లో పచారీ సరకుల మొదలు ఇంటి అద్దె, పాలు, విద్యుత్తు బిల్లులు, పిల్లలకు పాఠశాలలు, కళాశాల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

Updated : 10 Aug 2022 06:33 IST

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులకు జీతం నెలలో ఒకటో తేదీన పడతాయో? లేదో? గానీ బిల్లులు మాత్రం ఠంచన్‌గా చెల్లించాల్సిదే. కిరాణా దుకాణాల్లో పచారీ సరకుల మొదలు ఇంటి అద్దె, పాలు, విద్యుత్తు బిల్లులు, పిల్లలకు పాఠశాలలు, కళాశాల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి జీతం పడిందా? లేదా? అనేది చూడరు. మా బిల్లులు చెల్లించాలని వచ్చిన వారికి సమాధానం చెప్పలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. అదే నెలలో 5వ తేదీ లోపు వేతనాలు పడితే ఎలాగోలా సర్ది చెప్పుకుని వాయిదా వేస్తారు. 5వ తేదీ తర్వాత బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తుంటే ఎక్కడో చోట అప్పు చేసి తీర్చుతున్నారు. అయితే ఇది ఓ నెల, రెండు నెలలైతే సరిపెట్టుకోవచ్చు. ప్రతి నెలా ఇలాంటి వాతావరణం ఎదురవుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉద్యోగులది. సంక్షేమ శాఖల పరిధిలోని సహకార ఆర్థిక సంస్థల ఉద్యోగులు నాలుగు నెలలుగా జీతాల కోసం చూస్తున్న ఎదురు చూపులు ఎప్పటికి ఫలిస్తాయో తెలియని అగమ్యగోచర పరిస్థితిలో ఉన్నారు.

ఖాతాల మార్పుతో సమస్యలు: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టిన తర్వాత మార్చి నెలాఖరుకు ఆయా శాఖల వద్ద ఉన్న నిధులను వెనక్కి పంపాలని ఆదేశించింది. దీంతో పీడీ ఖాతాల్లో ఉన్న నిధులను ఆయా శాఖల ప్రధాన కార్యాలయాల్లోని ఖాతాలకు జమ చేశారు. ఏప్రిల్‌ నెలలో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయడంతో జిల్లాల ప్రభుత్వ శాఖలు, సంక్షేమ కార్పొరేషన్ల అధికారులకు పీడీ ఖాతాలను నూతనంగా ఇస్తామని, ఆ తర్వాత వాటి నుంచి ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని ఉన్నతాధికారులు చెప్పారు. అప్పటి నుంచి వీరికి నూతనంగా పీడీ ఖాతాలను దశల వారీగా తెరుస్తున్నారు తప్పితే నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. ఫలితంగా ఉద్యోగులకు ఏప్రిల్‌ నుంచి జులై నెల వరకు వేతనాలు అందని పరిస్థితి. ఒక నెల జీతం రాకుంటేనే కుటుంబాన్ని నెట్టుకురావడం ఎంతో కష్టంగా ఉంటుంది. అలాంటిది వరుసగా నాలుగు నెలలు జీతాలు విడుదలవకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో సరకులను దుకాణాల వాళ్లు అరువు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులు పిల్లల చదువుల కోసం జిల్లా కేంద్రానికి కుటుంబాలను తీసుకురావడంతో ఇక్కడ అప్పు పుట్టే పరిస్థితి కనిపించడం లేదు. గ్రామాల్లో అయితే తెలిసిన వారు, సంబంధాలను దృష్టిలో ఉంచుకుని అరువుకు సరకులు ఇస్తుంటారు. నగరంలో ప్రతి వస్తువునూ డబ్బు పెట్టి కొనుగోలు చేయాల్సిందే. దీంతో ఉద్యోగులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదేవిధమైన పరిస్థితి ఉండటంతో ఎవరినీ ఏమీ అడగలేని పరిస్థితి. ఆయా సంక్షేమ సహకార ఆర్థిక సంస్థల ఉన్నతాధికారుల దృష్టికి జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు సిబ్బంది ఇబ్బందులను తీసుకెళ్లి జీతాలు విడుదల చేయాలని పలుమార్లు కోరారు. అప్పటికీ నెలాఖరులో నిధులు విడుదల చేస్తామని చెపుతున్న అధికారులు నెల పూర్తయిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు.

దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నాం

జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేషన్‌ ఉద్యోగి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. ‘నాలుగు నెలలుగా జీతాలు విడుదలవకపోవడంతో కుటుంబాలను నిర్వహించడం చాలా ఇబ్బందిగా ఉంది. దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. గుండె జబ్బుతో పాటు అనారోగ్య సమస్యలు తిరగబెట్టడంతో ఆస్పత్రుల్లో వైద్యం కోసం వడ్డీకి డబ్బులు తీసుకుని చికిత్స చేయించుకున్నా. ఓ వైపు జీతాలు రాకపోవడం, ఇంకో వైపు ఇంటి నిర్వహణకు అప్పులు చేయడంతో మానసికంగా ఇబ్బంది పడడంతో తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికైనా జీతాలు విడుదల చేసి ఉద్యోగులను ఆదుకోవాలి’.. అని కోరారు.

* మరో కార్పొరేషన్‌ ఉద్యోగి తండ్రి ఇటీవలినే మరణించారు. తండ్రికి శాస్త్రీయంగా చేయాల్సిన కార్యక్రమాలతో పాటు ఇతరత్రా ఖర్చులు పెరిగిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అందినకాడికి అప్పులు చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. మరో వైపు నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంటి నిర్వహణ కూడా కష్టంగా మారింది. అప్పులు ఇచ్చిన వారికి వచ్చే నెలలో తీరుస్తానంటూ దాట వేస్తున్నారు. ప్రభుత్వం జీతాలు ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో నిస్సహాయంగా ఎదురు చూస్తున్నారు.

* సంక్షేమ కార్పొరేషన్ల జిల్లా అధికారులకూ వేతనాలు అందని పరిస్థితి. అధికారులు జిల్లాలో శాఖా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లాకు వచ్చినపుడు అతిథి మర్యాదలు, ప్రొటోకాల్‌ చూడాల్సి ఉంటుంది. వీటికి కూడా నిధులు అందుబాటులో లేక సొంతంగా భరిస్తున్నారు. పైకి చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ప్రభుత్వం పెండింగ్‌ జీతాలను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. వారి విజ్ఞప్తులు ఎప్పటికి ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి చేరతాయో చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని