logo

‘ఎంపీ మాధవ్‌పై చర్యలెందుకు తీసుకోరు?’

మహిళలను అగౌరవపరుస్తూ సభ్యసమాజం తలదించుకునేలా చేసి రాష్ట్రం పరువు తీసిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు ఎందుకు తీసుకోరని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు ప్రశ్నించారు.

Published : 10 Aug 2022 04:19 IST

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న కోటేశ్వరరావు తదితరులు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: మహిళలను అగౌరవపరుస్తూ సభ్యసమాజం తలదించుకునేలా చేసి రాష్ట్రం పరువు తీసిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు ఎందుకు తీసుకోరని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు ప్రశ్నించారు. ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోనందుకు నిరసనగా లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ ‘మంత్రులు, ఎంపీలు అర్ధనగ్న, అసభ్య ప్రవర్తనతో వైకాపా రాసలీలల పార్టీగా మారింది. చట్టసభల్లో సమస్యలపై మాట్లాడమంటే గంట, అరగంట అంటూ వీడియోకాల్స్‌తో కాలక్షేపం చేయడం సిగ్గుచేటు. అటువంటి వారికి మంత్రి పదవులు కట్టబెట్టిన ఘనత జగన్‌కే దక్కింది. మహిళలను కించపరిచేలా వ్యవహరించిన ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోకుండా వైకాపా నేతలు వెనకేసుకు రావడం ఎంత వరకు సమంజసం? తక్షణమే మాధవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి’.. అని డిమాండ్‌ చేశారు. తెదేపా విభిన్నప్రతిభావంతుల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ మాట్లాడుతూ మాధవ్‌ చేసిన పనితో తెలుగు రాష్ట్రాల ఎంపీల పరువు, ప్రతిష్ఠ గంగలో కలసి పోయిందన్నారు. సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మాధవ్‌తో తక్షణమే రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ధూళిపాళ్ల కార్తీక్‌, జ్యోతిబాబు, శ్రీనివాసచౌదరి, విజయ్‌కుమార్‌, సాయి, మాధవి, అనిత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని