logo

రొయ్య రైతుకు నిజంగా పరీక్షే

తీర ప్రాంతంతో కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఆక్వా రంగం ఎంతో కీలకమైంది. ఈ రంగం నుంచి ఏటా రూ.1500 కోట్ల విలువైన రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే రొయ్య పిల్లకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయో తెలుసుకునే అవకాశం లేక జిల్లా రైతులు ఎంతగానో నష్టపోతున్నారు. 

Published : 10 Aug 2022 04:24 IST
అలంకారప్రాయంగా ఆక్వా వ్యాధుల నిర్ధారణ ప్రయోగశాల
సీడ్‌ నాణ్యత నిర్ధారణ కాకపోవడంతో తీరని నష్టం
బాపట్ల, న్యూస్‌టుడే

తీర ప్రాంతంతో కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఆక్వా రంగం ఎంతో కీలకమైంది. ఈ రంగం నుంచి ఏటా రూ.1500 కోట్ల విలువైన రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే రొయ్య పిల్లకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయో తెలుసుకునే అవకాశం లేక జిల్లా రైతులు ఎంతగానో నష్టపోతున్నారు.  రొయ్యల్లో వ్యాధుల నిర్ధారణకు సరైన ప్రయోగశాలలు లేకపోవడమే ఇందుకు కారణం. బాపట్లలో ప్రభుత్వం ప్రారంభించిన ఏకైక ప్రయోగశాలలోనూ నిధుల కొరతతో పరికరాలు అమర్చలేదు. మరో రెండుచోట్ల భవనాలు నిర్మించినా ప్రారంభానికి నోచుకోలేదు. ప్రైవేటు ప్రయోగశాలలపై ఆక్వా రైతులు ఆధారపడాల్సి వస్తుంది.

హేచరీ నుంచి రొయ్య పిల్లలు కొనుగోలు చేసే ముందు రైతులు పిల్లల నమూనా తీసుకుని ప్రయోగశాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తారు. ఓ నమూనాకు పీసీఆర్‌, ఈహెచ్‌పీ సహా అన్ని పరీక్షలు చేయడానికి ప్రైవేటు ప్రయోగశాలల్లో రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల పరీక్షలు సరిగా చేయడం లేదు. రొయ్య పిల్లలు నాణ్యంగా లేకపోతే చెరువులో వేసిన తర్వాత త్వరగా ఎదగవు. లక్ష పిల్లలు పోస్తే అరవై వేలు కూడా బతకడం లేదు. వ్యాధుల బారినపడి చనిపోయి దిగుబడులు దారుణంగా పడిపోతాయి. వైట్గట్ సమస్య వస్తే తగ్గడానికి మందులు లేవు. రన్నింగ్‌ మోర్టాలిటీ సమస్య వచ్చి రోజుల వ్యవధిలో చనిపోతున్నాయి. సాగు కాలంలోనూ వారం, పది రోజులకొకసారి రైతులు నీటి, లోడ్స్‌ ఇతర పరీక్షలు చేయిస్తున్నారు. ఈహెచ్‌పీ సమస్య వస్తే మేత తింటున్నా ఎదుగుదల ఉండదు. 90 రోజులకు వంద నుంచి నూట ఇరవై కౌంట్ మధ్యే ఉండిపోతాయి. దీని వల్ల రైతులు ఎకరాకు రూ.లక్షల్లో నష్టపోతున్నారు.

బాపట్ల ఏఎంసీ ఆవరణలో నిర్మించిన ప్రయోగశాల

భారంగా మారిన సాగు: రైతులు హేచరీల నుంచి వనామీ రొయ్య పిల్లలు కొనుగోలు చేసి ఎకరా చెరువులో లక్ష నుంచి లక్షన్నర పిల్లల వరకు పోస్తున్నారు. ఈ రకం రొయ్య పిల్ల ధర 33 పైసల నుంచి 37 పైసల వరకు ఉంటుంది. మోనో టైగర్‌, అక్వా లామా రకం పిల్లలు అయితే ఎకరా చెరువులో 30 నుంచి 40 వేల పిల్లలు పోస్తున్నారు. పిల్ల ధర రూ.1.10గా ఉంది. పిల్లల కొనుగోలుకే ఎకరాకు రూ.33 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతుంది. ఎలాంటి రోగాలు లేని నాణ్యమైన పిల్లలు పోస్తేనే దిగుబడులు బాగా వస్తాయి. ప్రస్తుతం ఎకరా చెరువులో రొయ్యల సాగుకు ఖర్చులన్నీ కలిపి రూ.నాలుగు నుంచి రూ.ఐదు లక్షల వరకు అవుతుంది. రాయితీపై విద్యుత్తు అందకపోవడంతో యూనిట్ ధర రూ.ఆరు వరకు పడుతుంది. దాణా, మందుల ధరలు భారీగా పెరగడంతో సాగు భారంగా మారింది.


ప్రైవేటుగా పరీక్షలు చేయించుకోవాల్సిందే..

స్థానికంగా మంచి ప్రయోగశాలలు లేవని బాపట్ల నుంచి నమూనాలను పరీక్షల నిమిత్తం కాకినాడ, భీమవరం ప్రయోగశాలలకు పంపుతున్నారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రూ.50 లక్షలతో అగ్రీ పరీక్షల ప్రయోగశాల భవనాన్ని నిర్మించింది. ఇందులోనే ఆక్వా ప్రయోగశాల ఏర్పాటు చేశారు. బాపట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏడాది క్రితం ప్రయోగశాల ప్రారంభించారు. మట్టి, నీరు పరీక్షలు చేయటానికి మాత్రమే పరికరాలు ఉన్నాయి. ఆక్వాకు సంబంధించి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసే పరికరాలు లేవు. నిధుల కొరతతో బిల్లులు రావడం లేదని గుత్తేదారు పరికరాల సరఫరా నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో ఆక్వా రైతులు రొయ్యలకు పరీక్షలు చేయించుకునే అవకాశం లేకుండా పోయింది. రేపల్లె, చీరాలలో ప్రయోగశాలలు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పూర్తిగా ప్రైవేటు ప్రయోగశాలలపై ఆధారపడాల్సి వస్తుంది. రైతు జేబుకు చిల్లుపడుతుంది.


త్వరలో పరికరాలు తెప్పిస్తాం 

- సురేష్‌, మత్స్యశాఖ జేడీ

బాపట్ల ఏఎంసీ ఆవరణలోని ఆక్వా ప్రయోగశాలలో రొయ్యల్లో వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయడానికి అవసరమైన పరికరాలు త్వరలో తెప్పించి అమరుస్తాం. ప్రస్తుతం మట్టి, నీటి పరీక్షల వరకు చేస్తున్నారు. ఈ ప్రయోగశాల ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో సేవలు అందేలా  చర్యలు తీసుకుంటాం.

జిల్లాలో తీర ప్రాంతం: 74 కి.మీ.
తీర మండలాలు: 8
రొయ్యల సాగు విస్తీర్ణం: 21,900 ఎకరాలు
హేచరీలు: 15
ప్రాసెసింగ్‌ ప్లాంట్లు: 5

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని