logo

తీరం... ప్రగతి తరంగం

కలరా విజృంభిస్తే, ఆ ఊళ్లో పదుల సంఖ్యలో జనాలు చనిపోయేవారు.. పరిశుభ్రతపై అవగాహన లేమితో అంటువ్యాధుల వ్యాపించి తీరని నష్టం జరిగేది. గ్రామాల్లో ఒకరో, ఇద్దరో విద్యావంతులు ఉండేవారు.. స్వాతంత్య్రానికి పూర్వం

Updated : 10 Aug 2022 06:33 IST

75 ఏళ్ల ప్రస్థానంలో అభివృద్ధి మలుపులెన్నో
విద్య, వైద్యం, వ్యక్తిగత పరిశుభ్రతలో ప్రత్యేక స్థానం
చెరుకుపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే

కలరా విజృంభిస్తే, ఆ ఊళ్లో పదుల సంఖ్యలో జనాలు చనిపోయేవారు.. పరిశుభ్రతపై అవగాహన లేమితో అంటువ్యాధుల వ్యాపించి తీరని నష్టం జరిగేది. గ్రామాల్లో ఒకరో, ఇద్దరో విద్యావంతులు ఉండేవారు.. స్వాతంత్య్రానికి పూర్వం కీలకమైన రంగాల్లో ఇదీ పరిస్థితి. కానీ పరాయి పాలన నుంచి దేశంలో స్వయం పాలన మొదలైన తరువాత ఎన్నో మార్పులు వచ్చాయి. ఆది నుంచి ఎంతో చైతన్యవంతమైన తీర ప్రాంతంలో ప్రగతి కెరటాలు ఉవ్వెత్తున లేచాయి. విద్య, వైద్య రంగాల్లో ముందడుగు వేయడంతో పాటు స్వచ్ఛత విషయంలో అందరికన్నా మిన్నగా నిలిచింది. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల ప్రస్థానంలో తీరాన వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి గురించి తెలుసుకుందామా..


అక్షరం నేర్చిన పల్లె

గాంధీజీ ప్రారంభించిన కావూరులోని జాతీయ పాఠశాల

ఏ ప్రాంతలోనైనా ప్రజలు జ్ఞానవంతులైతేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉమ్మడి గుంటూరు జిల్లాలో బోర్డు పాఠశాలలు, ఆశ్రమం పాఠశాలలు వెలిశాయి. ఎంతోమంది ఉద్ధండులు ప్రజలకు అక్షరాలు నేర్పించారు. గొల్లపూడి సీతారాం, పాటిబండ్ల సీˆతారామయ్య వంటి ఎందరో వీధి అరుగులపై ప్రజలకు అక్షరాలు నేర్పి జ్ఞానాన్ని అందించారు. స్వాతంత్య్రం అనంతరం ఎన్నో సంస్కరణలు తీసుకురావడంతో విద్యాభివృద్ధి చోటుచేసుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అక్షరాస్యత శాతం 65 శాతం దాటింది.


విద్యకు కేంద్రం

స్వాతంత్య్రం పూర్వం నుంచే జిల్లాలో ఆశ్రమ పాఠశాలలు నడిచేవి. 1930 దశకంలో బాపూజీ గుంటూరు, బాపట్ల, చీరాల ప్రాంతంలో పర్యటించి జాతీయ పాఠశాలలకు అంకురార్పరణ చేశారు. ఆయన పిలుపుతో ఎయిడెడ్‌ పాఠశాలలు తెరుచుకున్నాయి. 1985 ముందు బోర్డు, సమితి బడులు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు పెద్దఎత్తున నడిచాయి. 1985 తరువాత మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఊరువాడా వెలిశాయి. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు అనుమతులు ఇవ్వడంతో ఇవికూడా వేల సంఖ్యలో మొదలయ్యాయి. నేడు అనేక ఇంజినీరింగ్‌ కళాశాలలు, వ్యవసాయ, సాంకేతిక కళాశాలలతో జిల్లా విద్యకు కేంద్రంగా మారింది. బాపట్ల జిల్లాలో విద్యాలయాల సంఖ్య ఏటేటా పెరుగుతూ వేల సంఖ్యకు చేరింది.

* 1932లో కావూరులో తిలక్‌ జాతీయ పాఠశాల, బాపట్ల, రేపల్లెలో పాత పట్టణంలోని బోర్డు స్కూల్‌ అందుబాటులోకి వచ్చిన మొదటి బడులు. 1956 నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.


ఆరోగ్యమే మహాభాగ్యం

గతంలో వ్యక్తిగత శుభ్రతపై అవగాహన లేమి, వైద్య సదుపాయాలు అంతంత మాత్రం కావడంతో కలరా, మసూచి, అతిసార వంటి రోగాలు విజృంభించేవి. స్వాతంత్య్రం అనంతరం పాలకులు వైద్యశాలలు ఏర్పాటు చేసి వైద్య సేవలను విస్త్రృతం చేశారు. 1935 నాటికే బ్రిటిష్‌ ప్రభుత్వం జ్వరాల ఆసుపత్రిని ఇప్పుడున్న గుంటూరు కలెక్టరేట్ వద్ద నిర్వహిం చేవారు. అప్పట్లో ఇది బ్రిటిషు వారికి మాత్రమే సేవలం దించింది. బాపట్ల, రేపల్లెల్లో 1935లో ఏర్పా టైనా 1947 తరువాత ఇవి ప్రజలకు సేవలం దించడం మొదలు పెట్టాయి. 1965 నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1980 నుంచి సబ్ సెంటర్లు ఏర్పడ్డాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్యశాలల ఏర్పాటు భారీగానే జరగడంతో అంటు వ్యాధుల వ్యాప్తి 16 శాతానికి తగ్గింది.


మరుగుదొడ్డే మహామంత్రం

వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంలో బాపూజీని ఆదర్శంగా తీసుకున్న జిల్లా వాసులు స్వాతంత్య్రం పూర్వం నుంచే మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కలిగి ఉన్నారు. నేడు స్వచ్ఛభారత్‌ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం బహిరంగ మలవిసర్జన రహిత పల్లెలుగా తీర్చిదిద్దింది. నాడు పల్లెల్లో రోగాలకు మరుగుదొడ్ల వాడకం లేకపోవడం, ఎక్కడపడితే అక్కడ బహిరంగ మల విసర్జన చేయడంతో అంటు రోగాలు, వ్యాధులు ప్రబలాయి. కాలంతోపాటు మార్పులతో ప్రజలను పాలకులు చైతన్యపరుస్తూ స్వచ్ఛతను సాధించారు. * 2018-19లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1040 గ్రామాలకు గాను 998 గ్రామాల్లో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని రికార్డు సృష్టించాయి. చెరుకుపల్లి పంచాయతీకి ఉత్తమ పంచాయతీగా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం ప్రసంసా పత్రం అందించింది. ఇలాంటి గ్రామాలు ఎన్నో నేడు ఉన్నాయి. నేడు ప్రతిఒక్కరూ మరుగుదొడ్డి విని యోగించడం ద్వారా పల్లెల్లో అంటువ్యాధులు తగ్గాయని సర్వేలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని