logo

ఆ దంపతులు చైతన్య దీప్తులు

సాధారణంగా దంపతుల్లో ఏక మనస్తత్వంతో ఉండటం చాలా అరుదు. పేరులో సారూప్యం ఉండటమే కాదు, మనసా, వాచా, కర్మణా ఇద్దరూ ఒకేలా ఉంటూ స్వాతంత్య్ర సమరంలో దేశం కోసం అంకితభావంతో కృషి చేశారు ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ దంపతులు. తమ కష్టాన్ని పక్కన పెట్టి స్వాతంత్య్ర సమరయోధులకు ఆశ్రయం

Updated : 12 Aug 2022 04:41 IST

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే

జైలుశిక్ష అనుభవిస్తున్న లక్ష్మీనారాయణ

సాధారణంగా దంపతుల్లో ఏక మనస్తత్వంతో ఉండటం చాలా అరుదు. పేరులో సారూప్యం ఉండటమే కాదు, మనసా, వాచా, కర్మణా ఇద్దరూ ఒకేలా ఉంటూ స్వాతంత్య్ర సమరంలో దేశం కోసం అంకితభావంతో కృషి చేశారు ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ దంపతులు. తమ కష్టాన్ని పక్కన పెట్టి స్వాతంత్య్ర సమరయోధులకు ఆశ్రయం కల్పించడంతో పాటు గాంధీ నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా ఆనాడే స్త్రీ విద్య కోసం శ్రీశారదానికేతనం పేరున గుంటూరు బ్రాడీపేట 2/14లో ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ విద్యాలయం కొనసాగుతోంది.

ఉన్నవ లక్ష్మీనారాయణ  1900లో గుంటూరులో యంగ్‌మెన్స్‌ లిటరరీ అసోసియేషన్‌ స్థాపనతో సేవా కార్యక్రమ పరంపర ప్రారంభమైంది. 1902లో వితంతు శరణాలయాన్ని స్థాపించారు. వీరేశలింగం పంతులు అధ్యక్షతన తొలి వితంతు వివాహం జరిపించారు.  

రష్యాలో 1917లో జరిగిన బోల్షవిక్‌ విప్లవంతో స్ఫూర్తి పొంది మాలపల్లి నవల రాశారు. కూలీల పక్షాల నిలవడమే కాకుండా నిమ్నవర్గాల అభ్యున్నతికి కృషి చేశారు.

స్త్రీలకు విద్యా బోధన

వయోజనులైన స్త్రీలకు తీరిక వేళల్లో విద్యాబోధన చేయడమే కాక వితంతువుల కోసం ఒక శరణాలయాన్ని ఉన్నవ లక్ష్మీబాయమ్మ నడిపారు.   వితంతు పునర్వివివాహాలు జరిపించారు. బాలగంగాధర తిలక్‌ వీరికి ఆనాటి రాజకీయ గురువు. వయోజనులైన స్త్రీలకు తీరిక సమయాల్లో విద్యాబోధన, చేతి పనులు నేర్పేందుకు . 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తి సత్యాగ్రహాల్లో పాల్గొని 1941, ఫిబ్రవరి 2న అరెస్టయి రాయవేలూరులో మూడు నెలల జైలు శిక్ష అనుభవించారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ తన 70వ ఏట 1952లో కన్నుమూశారు.


జాతీయోద్యమాలకు ప్రేరణ గుంటూరే!

ఈనాడు-గుంటూరు

నవోదయ ట్రైనింగ్‌ సెంటర్‌గా దేశభక్త భవనం

ప్రాచీన కాలంలో మానవ నాగరికత వర్థిల్లిన ప్రాంతాల్లో గుంటూరు ఒకటి. సహాయ నిరాకరణ, ఉప్పుచట్టాలు, శాసనోల్లంఘన ఉద్యమాలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. స్వాతంత్య్ర సంగ్రామంలో గుంటూరుకు చెందిన కొండా వెంకటప్పయ్య పంతులు, పర్వతనేని వీరయ్య చౌదరి, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి అనేక మంది ప్రముఖులు క్రియాశీలకంగా వ్యవహరించారు.

అందుకే గుంటూరు రైల్వే లైను .. ఈ ఉద్యమాలతో ఎప్పుడైనా తిరుగుబాటు వస్తుందని బ్రిటీష్‌ వాళ్లు గ్రహించి అప్పటికప్పుడు గుంటూరు-దాచేపల్లి మధ్య రైల్వే లైను నిర్మించారు. తిరుగుబాటు వస్తే  వారిని అణిచి వేయటానికి సైనికులను రప్పించటానికి ఈ రైల్వే లైన్‌ను నిర్మించారు. 1909లో తెనాలి బాంబు కేసు, కోటప్ప కొండ కేసులు, గుంటూరు గాంధీపార్కులో జరిపిన కాల్పుల్లో ముగ్గురు నేలకొరగటం వంటి వాటితో ఈ ప్రాంతంలో మరింత చైతన్యం వచ్చింది. తెలుగువాళ్లను పరిపాలించిన పది రాజవంశీయుల్లో ముఖ్యులైన శాతవాహనులు, చోళులు, పల్లవులు తదితరులు గుంటూరు, చేబ్రోలు, భట్టిప్రోలు ప్రాంతాలను రాజధానులుగా చేసుకుని పరిపాలన సాగించారు. ఇలా గుంటూరు మానవనాగరికత వర్థిల్లిన ప్రాంతాల్లో ఒకటిగా పేరుగడించింది. .   గుంటూరు బ్రాడీపేటలో కొండా వెంకటప్పయ్య పంతులు కుమార్తె పార్వతమ్మకి చెందిన ఇంట్లోనే గాంధీమహాత్ముడు కొన్ని రోజుల పాటు ఉండి సముద్రం నుంచి ఉప్పు నీళ్లు తీసుకొచ్చి ఉప్పు తయారీకి శ్రీకారం చుట్టారు.  అందుకు గుర్తుగా ఆ భవనానికి దేశభక్త అను పేరుపెట్టారు. పార్వతమ్మ ఆ భవనాన్ని కేంద్రప్రభుత్వానికి దఖలు పరచటంతో దాన్ని మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వినియోగించుకుంటోంది. దేశంలో నవోదయ విద్యాసమితిలో పనిచేసే ఉపాధ్యాయులకు తొలుత ఈ భవనం నుంచే శిక్షణకు శ్రీకారం చుట్టారు.. కొవిడ్‌ నేపథ్యంలో మూడేళ్లుగా ఇక్కడ శిక్షణలు నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని