logo

మద్యానికి దూరం.. స్పూర్తి పథం

పల్నాడు జిల్లా నూజండ్ల మండలంలోని పలు గ్రామాలు దశాబ్దాలుగా మధ్య నిషేధం అమలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. గ్రామాల్లోని పెద్దల కట్టుబాటును నేటికీ గౌరవిస్తున్నాయి.

Updated : 13 Aug 2022 07:09 IST

దశాబ్దాలుగా నిషేధం అమలు చేస్తున్న గ్రామాలు

న్యూస్‌టుడే, నూజండ్ల

పల్నాడు జిల్లా నూజండ్ల మండలంలోని పలు గ్రామాలు దశాబ్దాలుగా మధ్య నిషేధం అమలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. గ్రామాల్లోని పెద్దల కట్టుబాటును నేటికీ గౌరవిస్తున్నాయి. మద్యపానానికి దూరంగా ఉంటూ గాంధీజీ మాటలు ఆచరిస్తూ ప్రత్యేకత సంతరించుకున్న ఆయా గ్రామాల గురించి స్వాతంత్య్ర అమృత్‌మహోత్సవం సందర్భంగా తెలుసుకుందాం.


ఆదర్శం గాంధీనగరం


చైతన్యవంతులైన గాంధీనగరం మహిళలు

పేరులోనే కాదు ఆదర్శంలోనూ గాంధీజీ కలలకు ప్రతిరూపంగా నిలుస్తోంది. గాంధీనగరం. గ్రామం మొత్తం జనాభా 2091, కుటుంబాలు 509. ఇక్కడ 2002 సంవత్సరం నుంచి మద్య నిషేధం అమలులో ఉంది. అందులో మహిళలు, గ్రామపెద్దలు ప్రధానపాత్ర పోషిస్తున్నారు. మద్యం తాగిన పెద్దలను చూసి పిల్లలు పాడైపోతున్నారని ఉపాధ్యాయులు హెచ్చరించడంతో గ్రామంలోని మహిళలంతా ఏకమయ్యారు. వీధికెక్కి బెల్టుషాపులను మూయించారు. గ్రామంలోకి మద్యం రావడానికి వీలులేదని భీష్మించారు. వీధుల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. 2002 నుంచి నేటికీ నిషేధం కొనసాగుతోంది. గ్రామంలో కట్టుబాటు తప్పితే రూ.10వేలు జరిమానా విధిస్తారు. అదే నేటికి అమలు చేస్తున్నారు.


జంగాలపల్లెలో 1997 నుంచి అమలు


మద్య నిషేధం అమలవుతున్న జంగాలపల్లె

మండలంలోని జంగాలపల్లెలో ప్రస్తుతం 410 కుటుంబాలు, జనాభా 1606 మంది నివసిస్తున్నారు. గ్రామంలో గతంలో మద్యపానం విరివిగా లభ్యమయ్యేది. దీంతో అల్లర్లు, గొడవలు, విచ్చలవిడితనం అధికంగా ఉండేది. వీటిని సహించలేక దశాబ్దాల క్రితం అన్నివర్గాల పెద్దలు కమిటీగా ఏర్పడి మద్య నిషేధం ప్రకటించారు. 1997 నుంచి గ్రామంలో మద్య నిషేధం అమలవుతోంది. ఏ వర్గంలో వారు తప్పుచేసినా కమిటీ వేసే శిక్షకు బద్దులై ఉండాలన్న నియమానికి అందరూ కట్టుబడి ఉన్నారు. సమష్టి నిర్ణయాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. సీసీరోడ్లు, పచ్చదనంతో గ్రామం అలరారుతోంది.  


ముప్పరాజుపాలెంలో..


గ్రామంలో పచ్చదనంతో ఇళ్లు

ముప్పరాజుపాలెం దశాబ్దన్నర కాలంగా మద్య నిషేధం అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం గ్రామ జనాభా 1594 ఉండగా, 402 కుటుంబాలు నివసిస్తున్నాయి. గతంలో గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేయడంతో పెద్దలు, పిల్లలు మద్యానికి బానిసలై నీతితప్పి ప్రవర్తించడం ఎక్కువైంది. దీంతో గ్రామ పెద్దలు ఆలోచించి కమిటీగా ఏర్పడి మద్యం నిషేధించారు. 2007 నుంచి గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినా, కొన్నా కమిటీ చర్యలకు కట్టుబడి ఉండాలి అని తీర్మానం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టుబాట్లు అమలవుతున్నాయి.  


కట్టుబాట్లు అమలు

గతంలో రామాలయం వద్ద రాసుకున్న ఒప్పంద పత్రాల ప్రకారం నేటికి గ్రామస్థులందరూ కంకణబద్దులై ఉన్నారు. కట్టుబాట్లు దాటనివ్వకుండా నేటికి నిషేధం అమలు చేస్తున్నాం. మద్యం నిషేధంతో గ్రామం ప్రశాంతంగా ఉంది. యువత ఉన్నతంగా చదివి ఉపాధి అవకాశాలకు అందిపుచ్చుకుంటోంది. గ్రామంలో మహిళలు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారి పోరాటం ఫలితంగా మద్య నిషేధం అమలవుతోంది.

- బొబ్బాల అంకిరెడ్డి, సర్పంచి, గాంధీనగరం


భవిష్యత్తు కోసం ముందడుగు

గ్రామంలో మద్యం అమ్మినా, కొన్నా కమిటీ కట్టుబాటు చర్యలు ఉంటాయి. గతాన్ని గుర్తు చేసుకుంటూ మంచి భవిష్యత్తు కోసం ముందడుగు వేస్తున్నాం. మద్య నిషేధం అమలుతోనే యువత ఉన్నతంగా చదివి మంచి ఉపాధి అవకాశాలను అందుకుంటోంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండటంతో ఉన్నతమైన జీవితాలను గడుపుతున్నారు. పెద్దల స్ఫూర్తిని కొనసాగిస్తాం.

- నిడమానూరి మాధవి, సర్పంచి, ముప్పరాజుపాలెం

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts