logo

బంధాలను తెంచిన లారీ

మొదటి కాన్పులో అమ్మాయి పుడితే అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. రెండోసారి గర్భిణి కావడంతో ఆనందపడ్డారు. అది ఎంతో కాలం నిలవలేదు. మరో శిశువుకు జన్మ ఇవ్వాల్సిన అమ్మతో సహా 11 నెలల కుమార్తెను రోడ్డు ప్రమాదం కబళించింది.

Published : 13 Aug 2022 06:19 IST

ప్రమాదంలో తల్లీకుమార్తె మృత్యువాత


ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స

వినుకొండగ్రామీణ, న్యూస్‌టుడే: మొదటి కాన్పులో అమ్మాయి పుడితే అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. రెండోసారి గర్భిణి కావడంతో ఆనందపడ్డారు. అది ఎంతో కాలం నిలవలేదు. మరో శిశువుకు జన్మ ఇవ్వాల్సిన అమ్మతో సహా 11 నెలల కుమార్తెను రోడ్డు ప్రమాదం కబళించింది. ఘటనలో తల్లీకుమార్తె మృతిచెందగా తండ్రి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంతో ఆ కుటుంబం కకావికలమైంది. ఈ విషాదగాథ పెదకంచర్ల గ్రామానికి చెందిన గుడిపాటి కోటేశ్వరరావు కుటుంబంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వినుకొండ మండలం పెదకంచర్ల గ్రామానికి చెందిన గుడిపాటి కోటేశ్వరరావు తన భార్య అనూష(22) గర్భిణి కావడంతతో వైద్య పరీక్షల కోసం వినుకొండకు శుక్రవారం ద్విచక్ర వాహనంపై 11 నెలల కుమార్తె వైష్ణవితో కలిసి ముగ్గురు బయలుదేరారు. వినుకొండ-అద్దంకి మార్గంలో గోనుగుంట్లవారిపాలెం కాలనీ వద్దకు వచ్చేసరికి అద్దంకి నుంచి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు కిందపడగా అనూషపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కోటేశ్వరరావు, వైష్ణవిలకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా కుమార్తె మృతి చెందింది. ఈ ఘటన చూపరులను సైతం కంటతడి పెట్టించింది. మృతదేహం వద్దకు వచ్చిన బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు.


గర్భిణి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

కుటుంబంలో విషాదం
పెదకంచర్ల గ్రామానికి చెందిన ఎర్రబ్బాయి (చిన్నా), అంజమ్మ దంపతులకు కోటేశ్వరరావు ఒక్కడే కుమారుడు. ఎలాంటి ఆస్తులు లేవు. బతుకుదెరువుకు ప్రతిరోజూ తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులకు వెళ్లేవాడు. రెండేళ్ల క్రితం శావల్యాపురం మండలం కొత్తలూరుకు చెందిన అనూషతో అతనికి వివాహమైంది. తొలి కాన్పులో అమ్మాయిపుడితే అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇటీవల గ్రామస్థులు కోటేశ్వరరావు ఇబ్బందులు గుర్తించి రెండున్నర ఏళ్లు రేషన్‌ దుకాణం నడుపుకోడానికి అవకాశం కల్పించారు. కుమారుడు రేషన్‌ దుకాణం నడుపుతుండటంతో ఎర్రబ్బాయి ఆటో నడుపుతున్నాడు. తల్లి మాత్రం కూలీ పనులకు వెళ్లేది. అందరూ పనులు చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. అలాంటి పేద కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని