logo

నీటి పరీక్షలపై నిర్లక్ష్యమేల?

జిల్లాలోని గుంటూరు, మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్లు, తెనాలి, పొన్నూరు మున్సిపాలిటీల్లోని ఇంజినీరింగు విభాగాలు రోజూ కనీసం 50కి తగ్గకుండా తాగునీటి¨ నాణ్యత పరీక్షలు నిర్వహించాలి.

Updated : 13 Aug 2022 07:15 IST

విధులకు ఇంజినీరింగు అధికారుల డుమ్మా

నగరాలు, పట్టణాల్లో తరచూ తాగునీటి కుళాయిల ద్వారా రంగుమారిన, మురికినీళ్లు వస్తున్నాయని జనం ఆందోళన చెందుతున్నారు. రోజువారీ తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి, జనానికి రక్షిత మంచినీటిని అందేలా చూడాల్సిన బాధ్యత వార్డు సచివాలయాల ఇంజినీరింగు విభాగాలపై ఉంది. అయితే వారిలో ఎక్కువ మంది మంచినీటి నాణ్యత పరీక్షల విధులకు డుమ్మా కొడుతున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాగునీటి పైపులకు ఏర్పడిన లీకులకు సకాలంలో మరమ్మతులు నిర్వహించడంలేదనేది జనం నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. కలుషిత నీటిని తాగిన జనం టైఫాయిడ్‌, డయేరియా తదితర వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఈ భయంతోనే నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో సరఫరా అయ్యే రక్షిత మంచినీటిని ఇళ్లల్లో వాడకానికి వినియోగిస్తూ, తాగడానికి మాత్రం డబ్బా నీటిని  కొంటున్నట్టు పలువురు చెప్పారు.

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే

జిల్లాలోని గుంటూరు, మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్లు, తెనాలి, పొన్నూరు మున్సిపాలిటీల్లోని ఇంజినీరింగు విభాగాలు రోజూ కనీసం 50కి తగ్గకుండా తాగునీటి¨ నాణ్యత పరీక్షలు నిర్వహించాలి. అవి నాణ్యంగా ఉంటే సరే.. ఏవైనా లోపాలుంటే సత్వరమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించాలి. కానీ వారు ఆ పరీక్షల్నే చేయనప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉత్పన్నం కాదు. వారు నీటి పరీక్షలను అటకెక్కించారని వార్డు సచివాలయాల్లోని ఇతర ఉద్యోగులే ఆరోపిస్తుండడం గమనార్హం. అవే సచివాలయాల్లోని శానిటరీ కార్యదర్శులు ఉదయాన్నే గం.4.30కు విధులకు హాజరై పారిశుద్ధ్య పనుల్ని చేయిస్తున్నారు. ఉదాహరణకు తెనాలిలో సుమారు రూ.100 కోట్లతో నెలకొల్పిన పథకం నుంచి సరఫరా అయ్యే తాగునీరు ఎక్కడో చోట రంగుమారుతున్నాయని, మురికినీళ్లు వస్తున్నాయని జనం నుంచి వచ్చే ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఆయా చోట్ల మరమ్మతు పనులు చేస్తున్నారని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయంటూ సిబ్బంది ఒకే తరహా సమాధానాలు చెబుతున్నారు. సకాలంలో తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి, వాటిని తాగొచ్చనే భరోసా జనానికి ఇచ్చే వారే కరవయ్యారు.


తాగునీటి నాణ్యత పరీక్షల్ని ఇలా నిర్వహించాలి..

సిబ్బంది ఇలా..

గుంటూరులో 207, మంగళగిరి, తాడేపల్లి కొర్పొరేషన్లో 35, తెనాలిలో 47, పొన్నూరులో 17 చొప్పున వార్డు సచివాలయాలున్నాయి. ఒక్కో దానిలో వనరుల కల్పనకు గాను ఒక్కో ఇంజినీరింగ్‌ నిపుణుడు ఉన్నారు. వీరికి రోజూ నిర్వహించాల్సిన తాగునీటి పరీక్షలపై శిక్షణ సమయంలోనే చక్కటి తర్ఫీదు ఇస్తున్నారు. నాణ్యమైన నీటిని అందించాల్సిన బాధ్యత వీరిదేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. కానీ దాని అమలు విషయంలో ఇంజినీర్లు ఉదాసీనంగా ఉన్నారు. ఫలితంగానే లెక్కలేనన్ని తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని జనం పేర్కొంటున్నారు.

రోజూ నీటి పరీక్షలు చేయాలని ఆదేశిస్తా
ఇంజినీరింగు అధికారులు రోజూ తాగునీటి నాణ్యత పరీక్షల్ని నిర్వహించి, ప్రజలకు భరోసా కల్పించాలి. వారు అలా చేయడంలేదనే విషయం నాకు తెలియదు. వారంతా రోజూ తాగునీటి నాణ్యత పరీక్షల్ని నిర్వహించాలని మరోసారి ఆదేశాలు జారీ చేస్తా. 

- జి.శ్రీనివాసరావు, ఆర్డీ, గుంటూరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని