logo

కలలు పండాలి.. భవిత మెరవాలి

గడిచిన ఏడున్నర దశాబ్దాల్లో విభిన్న రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించాం.. దీంతోనే తృప్తి చెందకుండా రాబోయే 25 ఏళ్లలో సుస్థిర ప్రగతి వేగంగా సాధించాల్సిన అవసరం ఉంది.. నేటి యువతే.. రేపటి దేశ భవిష్యత్తు.. దేశాభివృద్ధి యువశక్తి సమర్థ వినియోగంపైనే ఆధారపడి ఉంది.

Published : 15 Aug 2022 06:39 IST

రాబోయే పాతికేళ్లపైనే కోటి ఆశలు 

అమృతోత్సవ వేళ యువత మనోగతం ఇదీ  

అమరావతి ఫీచర్స్‌, న్యూస్‌టుడే

గడిచిన ఏడున్నర దశాబ్దాల్లో విభిన్న రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించాం.. దీంతోనే తృప్తి చెందకుండా రాబోయే 25 ఏళ్లలో సుస్థిర ప్రగతి వేగంగా సాధించాల్సిన అవసరం ఉంది.. నేటి యువతే.. రేపటి దేశ భవిష్యత్తు.. దేశాభివృద్ధి యువశక్తి సమర్థ వినియోగంపైనే ఆధారపడి ఉంది. అభివృద్ధి చెందిన చాలా దేశాలు సరిపడా యువశక్తి లేక ఆందోళన చెందుతున్నాయి. మన జనాభాలో యువతే ఎక్కువ ఉన్నారు. ఆ యువశక్తి సమర్థంగా వినియోగించడంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే సందర్భంలో తమ కలలు పండాలి.. భవిత మెరవాలని యువత బలంగా కోరుకుంటుంది. రాబోయే పాతికేళ్లపై యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ తమ ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వాలు.. సంస్థలు.. ప్రతిఒక్కరూ ప్రతినబూనాలని యువ తరంగం తన మనసులో భావాన్ని వ్యక్తం చేస్తుంది.


ఉన్నత విద్య మరింత చేరువ కావాలి

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఫార్మా, మెడిసిన్‌ తదితర కోర్సులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లాలో వైద్యవిద్య అందుబాటులో లేదు. పిడుగురాళ్ల వద్ద వైద్య కళాశాల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేస్తే వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు వైద్య విద్య స్థానికంగా అందుబాటులోకి రానుంది. అదేవిధంగా నరసరావుపేటలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణాల్ని త్వరగా పూర్తిచేసి ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించి అన్ని కోర్సులు అందుబాటులో ఉంచాలి. విశ్వవిద్యాలయం, వృతి నైపుణ్య విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.


ఇంటింటా అంతర్జాల సేవలు

ఇప్పటికీ వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో చాలా గ్రామాలకు అంతర్జాల సేవలు అందుబాటులో లేవు. త్వరలో రాబోతున్న 5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మారుమూల గ్రామాలకు చేరువ చేయాలి. వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగాలకు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పించాలి. డిజిటల్‌ గ్రంథాలయాల్ని ప్రతి పంచాయతీలోనూ ఏర్పాటు చేయాలి. ఇంటర్‌ నుంచే డిజిటల్‌, వర్చువల్‌ తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. మేడిన్‌ ఇండియా.. మేకిన్‌ ఇండియాలో ఉమ్మడి జిల్లాలో మెరిసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయాలి.


ఉపాధి కల్పనలో..

ఉపాధి కల్పన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో వేల మంది నిరుద్యోగులుగా నమోదయ్యారు. ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తే ఒక్కో పోస్టుకు సగటున 700 నుంచి 1200 మంది వరకు పోటీపడుతున్నారు. యువత చదువులకు తగ్గ ఉద్యోగ.. ఉపాధి అవకాశాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగుపర్చాలి. ఉన్నత విద్య పూర్తి చేసినవారికి ఉపాధి భరోసా కల్పించేలా నైపుణ్యాల్ని వారిలో పెంపొందించాలి.
రాజధాని ప్రాంతంలో  ఇవి అవసరం

* ఎయిమ్స్‌లో వైద్య విద్యను ప్రారంభించాలి.

* విభజన హామీల్లో భాగంగా రాజధానిలో సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ఒత్తిడి పెంచాలి. మహిళలకు గుంటూరు నగరంలో పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలి. తద్వారా పేద విద్యార్థినుల ఉన్నత విద్యకు దారులు తెరుచుకుంటాయి.            

* జీజీహెచ్‌లో ప్రస్తుతం ఉన్న పడకలను పెంచాలి. గోరంట్ల జ్వరాల ఆస్పత్రిని అభివృద్ధి చేయాలి. పట్టణ ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి.

* నకరికల్లు మండలం నర్సింగపాడులో ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములు ఉన్నాయి. ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకుని ఆహార శుద్ధి పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలి. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలతో ప్రయోజనం ఉంటుందో అధ్యయనం చేయాలి.


చట్టసభల్లో  ప్రాతినిధ్యం పెంచాలి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత ప్రాతినిధ్యం కొంతమేరకు ఫర్వాలేదు. అదే అసెంబ్లీ, పార్లమెంట్‌కు వచ్చేసరికి తక్కువగా ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యువతకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యావంతులైన యువత చట్టసభలకు వెళ్లి ప్రజాసేవ చేసేందుకు ముందుకు కదలాలి.


భద్రత..  రక్షణ..

రోడ్డు ప్రమాదాల యువశక్తిని నీరుగారుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో రోజుకు సగటున ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. ఆ కుటుంబాలే కాదు రోడ్డు ప్రమాదాల మరణాల ప్రభావం దేశ జీడీపీపై ఉంటుంది. అందుకే యువశక్తి నిర్వీర్యం అవ్వకుండా రోడ్డు ప్రమాదాల్ని నిలువరించే చర్యలు చేపట్టాలి. రోడ్లు బాగుండేలా చూడటంతోపాటు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి.


అవినీతి వాసన  వద్దు..

మానవాభివృద్ధిలో ముందజంలో ఉన్న నార్వే, స్వీడన్‌, డెన్మార్క్‌ వంటి దేశాల్ని పరికిస్తే అక్కడ అవినీతి వాసన ఉండదు. మన వద్ద జననం నుంచి మరణ ధ్రువీకరణ పత్రం వరకు ప్రతి సేవకు ఓ రేటు ఉండటం యువత నిట్టూరుస్తున్నారు. నిజాయతీగా ఉండటం కూడా దేశభక్తే అని మహనీయులు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు దాన్ని నిజం చేయాలి. అవినీతిరహితంగా విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్ని మార్చాలి. అవినీతి నిరోధక శాఖ విజిలెన్సుతో పాటు నిఘా బృందాలను మరింత పటిష్ఠం చేసి అవినీతికి పాల్పడేందుకు భయపడే పరిస్థితులు కల్పించాలి.


ప్రతిభకు అవకాశమివ్వండి

- జి.అజిత్‌కుమార్‌, ఎంటెక్‌, నిరుద్యోగి.

ఉన్నత విద్య చదివి ప్రభుత్వ ఉద్యోగాలు పొంది కుటుంబాన్ని మంచిగా చూసుకోవడంతోపాటు ప్రజలకు సేవ చేయవచ్చని చాలామంది ఆశపడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కొన్నేళ్లుగా ఆశించిన మేరకు జరగట్లేదు. ప్రైవేట్‌ రంగంలోనూ ఉపాధి అవకాశాల్ని ప్రభుత్వం కల్పించట్లేదు. పీజీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, బీఈడీ, ఫార్మా కోర్సులు పూర్తి చేసే ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగాలు కల్పించే చర్యలు చేపట్టాలి. ఉద్యోగ.. ఉపాధి అవకాశాల్ని మెరుగుపర్చాలి.  


పరిశోధనలకు ప్రోత్సాహం అవసరం

- ఎల్‌.వెంకటదీప్తి, ఇంజినీరింగ్‌ విద్యార్థిని.

రాష్ట్రాన్ని.. దేశాన్ని అంతర్జాతీయస్థాయిలో మెరిపించే నైపుణ్యాల్ని యువత వద్ద ఉన్నాయి. పరిశోధనా రంగంలో ప్రోత్సాహకాలను యువత కోరుకుంటుంది. ఉన్నత చదువులకు ఉద్యోగాలే కాదు దేశాభివృద్ధికి దోహదం చేసే ఆలోచనలకు అందలం కల్పించాలి. ఆడబిడ్డల చదువును మరింత ప్రోత్సహించాలి. విదేశాల్లో చదివే విద్యను ఇక్కడే అందుబాటులోకి తీసుకురావాలి. యువశక్తి దేశానికి ఉపయోగపడేలా అన్నిరకాల అవకాశాలు కల్పించాలి.  


అవినీతి రహిత సమాజంతోనే మార్పు

- జి.వీరాంజనేయులు, బీటెక్‌, సేవా సంస్థ నిర్వాహకుడు

అవినీతిరహిత సమాజం సాకారమవ్వాలన్నది యువత ఆకాంక్ష. అవినీతిలేని చోట అభివృద్ధికి.. సామాజిక సేవకు అవకాశం ఉంటుంది. కూకటి వేళ్లతో అవినీతి తొలగించాలి. చట్టసభల్లో యువతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. ప్రభుత్వ పాలనకు సంబంధించి అన్ని అంశాల్లో యువ భాగస్వామ్యాన్ని పెంచాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని