logo

చీరాలలో వీరుల విజయస్తూపం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా చీరాల పట్టణంలో కూరగాయల మార్కెట్‌ వద్ద విజయస్తూపం ఏర్పాటు చేశారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళిగా, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో

Published : 15 Aug 2022 06:39 IST

విజయస్తూపం ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ వకుల్‌జిందాల్‌, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తదితరులు

చీరాల పట్టణం, న్యూస్‌టుడే: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా చీరాల పట్టణంలో కూరగాయల మార్కెట్‌ వద్ద విజయస్తూపం ఏర్పాటు చేశారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళిగా, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో చీరాల - పేరాల ఉద్యమవీరుల స్మరణగా స్వతంత్ర భారతావని అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులు, సంస్థల గౌరవార్థం వీఆర్‌ఎస్‌, వైఆర్‌ఎన్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌, యలమంచిలి గ్రూఫ్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో దీనిని నెలకొల్పారు. క్రీస్తుపూర్వం 280లో సారనాథ్‌లో అశోకుడు నెలకొల్పిన విజయస్తూపం దీనికి స్ఫూర్తి. కమలం నుంచి ఆవిర్భవించినట్లున్న ఈ స్తూపం ఎత్తు 12 మీటర్లు (40అడుగులు). భూమిపై 9 అడుగుల నుంచి ప్రారంభమైంది. ప్రారంభంలో 3 అడుగుల వ్యాసార్థం కలిగి చిరవకు 1.5 అడుగుల వ్యాసార్థంతో పూర్తయింది. స్తూపం పైభాగంలో నలువైపులా గుర్రం (విధేయత, వేగం, శక్తి), సింహం (శౌర్యం), ఏనుగు (బలం), ఎద్దు (కృషి, దృఢత్వం) ప్రతీకలుగా చెక్కించారు. పీఠంపై ఉన్న నాలుగు సింహాలు బుద్ధుడికి ప్రతిరూపాలుగా ఏర్పాటు చేసినట్లు రూపకర్తలు తెలిపారు. స్తూపం కింద భాగంలో భరతమాతకు నమస్కరిస్తూ జైహింద్‌ (భారతదేశానికి విజయం), సత్యమేవ జయతే, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుందనే నినాదాలు లిఖించారు.

సమరయోధుల స్ఫూర్తితో ఎదగాలి

తొలుత సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణతో విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయస్తూపాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఉత్సవాలు జరుపుకోవడం సంతోషదాయకమన్నారు.  ఎస్పీ వకుల్‌జిందాల్‌ మాట్లాడుతూ సమరయోధులను స్మరించుకుంటూ ప్రతి ఇంటా జెండా ఎగురవేయాలని సూచించారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో చీరాల నుంచి పాల్గొని అమరులైన యోధులను గుర్తుచేసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైకాపా చీరాల నియోజకవర్గ బాధ్యుడు కరణం వెంకటేష్‌, ఆర్డీవో పి.సరోజని, చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, యలమంచిలి గ్రూఫ్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఛైర్మన్‌ యలమంచిలి రామకృష్ణ, కమిషనర్‌ సీహెచ్‌ మల్లేశ్వరరావు, పలు పాఠశాలలు, కళాశాలల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

విజయస్తూపం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని