logo

సామాజిక సేవకులు!

వారంతా గుంటూరు వైద్య కళాశాలలో సహోధ్యాయులు.. విద్యార్థులుగా ఊపిరి సలపనంత పని. ఖాళీ దొరికేది వారాంతాల్లోనే.. ఆ సమయాన్నే సామాజిక సేవకు వినియోగిస్తోంది విద్యార్థుల బృందం. సమాజ సేవలోనూ రాణిస్తున్నారు. తమ ఆలోచనలకు అనుగుణంగా

Published : 15 Aug 2022 06:39 IST

ఆదర్శంగా వైద్య విద్యార్థులు


వైద్య శిబిరంలో స్పర్శ బృంద సభ్యులు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వారంతా గుంటూరు వైద్య కళాశాలలో సహోధ్యాయులు.. విద్యార్థులుగా ఊపిరి సలపనంత పని. ఖాళీ దొరికేది వారాంతాల్లోనే.. ఆ సమయాన్నే సామాజిక సేవకు వినియోగిస్తోంది విద్యార్థుల బృందం. సమాజ సేవలోనూ రాణిస్తున్నారు. తమ ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ‘స్పర్శ’ పేరుతో బృందాలుగా ఏర్పడి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ బాధితులకు అండగా నిలిచారు. విద్య, వైద్యం అందించే ప్రధాన లక్ష్యంతో వారు పని చేస్తున్నారు. ఇటీవలే ప్లాస్టిక్‌ వాడకంతో కలిగే దుష్ప్రభావాలపై ఎన్టీఆర్‌ స్టేడియంలో ఫ్లాష్‌మాబ్‌ నిర్వహించారు. ఆదర్శంగా నిలుస్తున్న ‘స్పర్శ’ బృందంపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

300 మంది సభ్యులు

2018, మే 28న స్పర్శ సంస్థ ప్రారంభమైంది. అప్పుడు ఈ సేవా బృందంలో ఆరుగురు సభ్యులుండేవారు. వీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూసి స్ఫూర్తి పొందినవారు సభ్యులుగా చేరేందుకు మరికొంతమంది ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం 300 మంది క్రియాశీలకంగా ఉన్నారు. అంతా యువతే. వాట్సాప్‌ వేదికగా ఒకరికొకరు సమన్వయం చేసుకుంటారు.

ప్రభుత్వ పాఠశాలల బాట

గుంటూరు నగరంలోని ఎంపిక చేసుకున్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడ విద్యార్థులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేగాకుండా చదువు పట్ల ఆసక్తి పెరిగేవిధంగా కథలు చెప్పేవారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, ఇతర సామగ్రిని సమకూర్చేవారు. విద్యార్థినులకు కౌమార దశలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థినులు సవివరంగా తెలియజేస్తున్నారు. బడి మానేసిన విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేరేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. చదువుకుంటే కలిగే లాభాలను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించేవారు. అనాథ, వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికి అవసరమైన ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందేవిధంగా చూస్తున్నారు. శివారు కాలనీల్లో నివసిస్తున్న మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు.

సరదాలు వదిలి...

స్పర్శ సభ్యులంతా సామాజిక సేవ మా బాధ్యత అని భావించే మంచి మనసున్నవారు. వైద్య విద్యార్థులకు రోజంతా తీరిక లేకుండా హడావుడి. జీవితంలో సెలవు దొరికేది ఏ వారాంతమో, ఆ కొద్ది సమయాన్నీ సేవకే కేటాయిస్తున్నారు. సమాజానికి ఎంతో కొంత చేయాలనే తపనకు తోడు సహోధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమవుతోంది అంటాడు వంశీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని