logo

ఒకే మాట... బాపూ బాట

మహాత్మాగాంధీ అడుగు జాడల్లో పయనిస్తున్నాయి ఆ పల్లెలు. కట్టుబాట్లను క్రమం తప్పకుండా అనుసరిస్తున్నారు. సారా మహమ్మారితో పేదల కుటుంబాల్లో తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించేందుకు మహిళలంతా ఏకతాటిపై నిలిచారు. మహాత్మాగాంధీ

Published : 15 Aug 2022 06:41 IST

పుష్కరకాలంగా మద్యానికి దూరం

గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పయనం

అద్దంకి, న్యూస్‌టుడే 

ఉప్పలపాడు గ్రామ ముఖచిత్రం

హాత్మాగాంధీ అడుగు జాడల్లో పయనిస్తున్నాయి ఆ పల్లెలు. కట్టుబాట్లను క్రమం తప్పకుండా అనుసరిస్తున్నారు. సారా మహమ్మారితో పేదల కుటుంబాల్లో తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించేందుకు మహిళలంతా ఏకతాటిపై నిలిచారు. మహాత్మాగాంధీ చూపిన మార్గాన్ని అనుసరించారు. కుటుంబాలను గుల్ల చేస్తున్న మద్యం దుకాణాల్లో సీసాలను ధ్వంసం చేశారు. ఫలితంగా పుష్కరకాలంగా అద్దంకి మండలంలోని గోపాలపురం, ఉప్పలపాడులో మద్యం అమ్మకాలు నిలిచాయి. ఎవరైనా మద్యం తాగే అలవాటుంటే బయటకు వెళ్లి తాగి రావటం తప్ప, గ్రామంలో అమ్మటానికి, తాగేందుకు వీలు లేదు. 2010లో లోక్‌సత్తా నాయకులు జయప్రకాష్‌ నారాయణ్‌ పిలుపు మేరకు జరిగిన ఉద్యమంలో రెండు గ్రామాల మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అప్పట్లో గోపాలపురం ఎస్సీ/ఎస్టీ కాలనీని జయప్రకాష్‌ నారాయణ్‌ సందర్శించి మహిళలను అభినందించారు.

ఆ ముగ్గురి మృతితో..
మండలంలోని ఉప్పలపాడులో తాగుడుకు బానిసలైన ముగ్గురు యుక్త వయసులోనే అశువులు బాశారు. ఇంట్లో ధాన్యం బస్తాలను కూడా మద్యం దుకాణానికి అప్పగిస్తూ మద్యం తాగి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేశారు. గ్రామంలో గొలుసు మద్యం దుకాణాల కారణంగా ఎంతోమంది యువకులు మద్యానికి ఆకర్షితులై బానిసలయ్యారు. ఒకే గ్రామంలో ముగ్గురు యువకుల మృతితో మహిళలు రగిలిపోయారు. గ్రామస్థురాలు యు.అంజమ్మ ఆధ్వర్యంలో మహిళలంతా  అద్దంకి ఎక్సైజ్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో చివరకు వారే రంగంలోకి దిగారు. గొలుసు దుకాణంలో మద్యం సీసాలను పగులగొట్టారు. మద్యం అమ్మకాలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించడంతో మిగిలిన గ్రామస్థులు వారికి సంఘీభావం ప్రకటించారు. ఫలితంగా 2010 నుంచి ఇప్పటి వరకు గ్రామంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచాయి.


జాలర్ల కుటుంబాల్లో చిచ్చు

గోపాలపురం గ్రామ ముఖచిత్రం

గోపాలపురం గ్రామానికి చెందిన 180 మంది జాలర్లు భవనాశి చెరువు ఆధారంగా చేపల వేటతో జీవనం సాగిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేపలవేట కొనసాగించిన జాలర్లు తాము పట్టిన చేపల్ని వ్యాపారికి విక్రయించి వారిచ్చే డబ్బులతో గ్రామంలోని గొలుసు దుకాణంలో మద్యం తాగుడుకు బానిసలయ్యారు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసలైన యువకుడి చర్యల కారణంగా ఆయన భార్య ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలోని ఎస్సీ/ఎస్టీ మహిళల్లో చైతన్యం పెరిగింది. జి.హనుమాయమ్మ అనే మహిళ ఆధ్వర్యంలో సారా వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం పలికారు. మద్యం గొలుసు దుకాణంపై దాడి చేసి సీసాలు పగుల గొట్టి ధ్వంసం చేశారు. దీనికి లోక్‌సత్తా, కమ్యూనిస్టు నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఫలితంగా నాటి నుంచి నేటి వరకు గ్రామంలో మద్యం విక్రయాలు పూర్తిగా నిలిచాయి.మరికొన్ని గ్రామాల్లో.. అద్దంకి మండలం చక్రాయపాలెం, సంతమాగులూరు మండలం సజ్జాపురం ఎస్సీ కాలనీలోనూ మద్యనిషేధం అమలులో వుంది. ఎవరైనా మద్యం తాగాలనుకునే వారు బయటకు వెళ్లి కార్యక్రమాలు ముగించడమే తప్ప గ్రామంలో మద్యం తాగుడుకు పూర్తిగా చెక్‌ పెట్టేశారు.

 


ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో చీరాల వాసి

శ్రీనివాసరావు (పాతచిత్రం)

చీరాల, న్యూస్‌టుడేఫ పల్లపోతు శ్రీనివాసరావు... స్వాతంత్య్ర ఉద్యమంలో చీరాల ప్రాంతంలో కీలకపాత్ర వహించటమే కాదు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో చేరి దేశాన్ని దాస్యశృంఖలాల నుంచి విముక్తి చేసేందుకు పోరాడిన ధీరుడు. శ్రీనివాసరావు చదువుకొనే రోజుల్లో స్వాతంత్య్ర పోరాటం ఉద్ధృతంగా సాగుతోంది. తానూ ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. 1942 ఆగస్టులో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. చీరాల ప్రాంతంలో ఇది ఉద్ధృతంగా సాగింది. ఇందులో శ్రీనివాసరావు ప్రముఖపాత్ర పోషించారు. ఈ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 12న పట్టణంలో భారీ ప్రదర్శన చేపట్టారు. పాఠశాలలు, దుకాణాలు మూతపడ్డాయి. ప్రజలు భారతమాతాకి జై, మహాత్మా గాంధీకి జై అనే నినాదాలతో రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఆగ్రహంతో ఉన్న ఉద్యమకారులు రైల్వేస్టేషన్‌కు నిప్పుపెట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీÈఛార్జీ చేసి, పరిస్థితిని అదుపుచేశారు. బ్రిటీష్‌ ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్నవారిపై వారెంట్లు జారీ చేసింది. దీంతో శ్రీనివాసరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. నెలరోజుల తరువాత ఆయనను పోలీసులు నెల్లూరులో అరెస్టు చేసి జైలుకు పంపారు. అక్కడి నుంచి తప్పించుకున్న శ్రీనివాసరావు పేరు మార్చుకొని రాయల్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్సులో చేరారు. అక్కడ శిక్షణ పూర్తిచేసుకొని బర్మా వెళుతుండగా తప్పించుకొని, జపాను సహాయంతో సుభాష్‌చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో చేరారు. 1945లో ఈ దళం బ్రిటీష్‌ సైన్యానికి చిక్కింది. ఇందులో శ్రీనివాసరావు ఉన్నారు. వీరిని దిల్లీ తీసుకొచ్చి, కేసులు పెట్టి జైలుకు పంపారు. వీరి తరఫున జవహర్‌లాల్‌ నెహ్రూ, భూలాబాయ్‌దేశాయి, మౌలాంకర్‌లు న్యాయవాదులుగా ఉండి అందరినీ విడిపించారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌ నాయకుడిగా చీరాలలో ఉండి, తరువాత గుంటూరులో స్థిరపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని