CM Jagan: ఆ పోరాటం ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్ర.. తిరుగులేని స్ఫూర్తి: సీఎం జగన్‌

జాతీయ జెండా మనందరి స్వాతంత్ర్యానికి, ఆత్మగౌరవానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.

Updated : 15 Aug 2022 21:39 IST

విజయవాడ: జాతీయ జెండా మనందరి స్వాతంత్ర్యానికి, ఆత్మగౌరవానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అతివాదం, మితవాదం, విప్లవ వాదం.. ఇలా మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటేనని.. అదే స్వాతంత్ర్యమని చెప్పారు. అహింసే ఆయుధంగా.. సత్యమే సాధనంగా సాగిన ఆ శాంతియుత పోరాటం భారత దేశానికే కాకుండా ప్రపంచ మానవాళకి మహోన్నత చరిత్రగా.. తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుందని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

‘‘పింగళి వెంకయ్య రూపొందించిన జెండా కోట్లాది మంది భారతీయుల గుండె. ఈ ఏడాది భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను జరుపుకొంటున్న సమయం. మన స్వాతంత్ర్య పోరాటం మహోన్నతమైనది. ఈ 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించింది. స్వాతంత్ర్యం నాటికి 18 శాతం వ్యవసాయ భూమికి నీరందిస్తే.. ప్రస్తుతం అది 49 శాతానికి చేరింది. ప్రపంచ ఫార్మా రంగంలో ఇవాళ దేశం మూడో స్థానంలో ఉంది. దేశం దిగుమతుల నుంచి ఎగుమతులకు వేగంగా అడుగులు వేసింది. ప్రపంచంతో పోటీపడి గణనీయంగా అభివృద్ధి సాధిస్తున్నాం. ఆహారధాన్యాల లోటును అధిగమించి ముందడుగు వేశాం. 150 దేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేయగలుగుతున్నాం.

ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అంతా మనవారే

మంత్రిమండలి నుంచి గ్రామస్థాయి వరకూ సామాజిక న్యాయం తీసుకొచ్చాం. పాలనలో సౌలభ్యం కోసం 26 జిల్లాలు చేశాం. కొద్దిమందికే ప్రయోజనం కల్పించేలా కాకుండా.. వ్యవస్థనే మార్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చాక అంతా మనవారే. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలు అందిస్తున్నాం. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాం. మహిళలకు సామాజిక, రాజకీయ నియామకాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. 21 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. విద్యారంగంపై రూ.53వేల కోట్లు ఖర్చు చేశాం. 4 ఓడరేవులు, 9 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేస్తున్నాం. తెల్లవారకముందే ఎలాంటి లంచం లేకుండా లబ్ధిదారులకు పింఛన్‌ అందిస్తున్నాం. ఇప్పుడు కరెంట్‌ లేని ఇళ్లు ఒక్క శాతంలోపే ఉన్నాయి. మన సమాజంలోనే సామాజిక స్వతంత్ర పోరాటాలు చాలా ఉన్నాయి. ఆ పోరాటాలు, తిరుగుబాట్లు మాట్లాడకపోయినా దాగని సత్యాలు. ఇవన్నీ నిండు మనసుతో దిద్దుకోవాల్సిన దిద్దుబాట్లు. ఇలాంటి సమాధానాల అన్వేషణే మా ప్రభుత్వం మూడేళ్ల పాలన’’ అని జగన్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని