logo

రెప్పపాటులో ప్రమాదం... అంతులేని విషాదం

వేగం నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. చేతికొచ్చిన తమ పిల్లలు బాగా స్థిరపడతారని ఆశించిన కన్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. అరుణాచలంలో దైవ దర్శనం కోసం నలుగురు విజయవాడలో కారు అద్దెకు తీసుకుని బయలుదేరారు.

Published : 16 Aug 2022 07:11 IST

న్యూస్‌టుడే, ప్రత్తిపాడు: వేగం నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. చేతికొచ్చిన తమ పిల్లలు బాగా స్థిరపడతారని ఆశించిన కన్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. అరుణాచలంలో దైవ దర్శనం కోసం నలుగురు విజయవాడలో కారు అద్దెకు తీసుకుని బయలుదేరారు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సమీపంలో రోడ్డు పక్కన ఆగివున్న లారీ వారి పాలిట మృత్యు శకమైంది. వెనుక నుంచి అతి వేగంతో ఢీకొట్టడంతో వారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. మృతుడు గౌతమ్‌రెడ్డి తండ్రి చుక్కా పోలారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్తిపాడు సీఐ సుబ్బారావు చెప్పారు.

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే : విజయవాడ పాతబస్తీ చేపల మార్కెట్‌ బూరాడ వారి వీధికి చెందిన చుక్కా గౌతమ్‌రెడ్డి దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చుక్కా పోలిరెడ్డి వనజలకు కుమారుడు గౌతమ్‌రెడ్డి, కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహమైంది. కుమారుడు విశాఖపట్నంలో ఆర్కిటెక్చర్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. తండ్రి పోలిరెడ్డి అద్దె ఇంట్లో నివాసం ఉంటూ పాతబస్తీ చేపల మార్కెట్‌ ప్రాంతంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వనజ కూడా భర్తకు సహాయంగా దుకాణంలో పనిచేస్తారు. చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలియగానే తల్లిదండ్రులు ఇద్దరు హుటాహుటిన ప్రత్తిపాడు బయలుదేరి వెళ్లారు.
పుట్టిన రోజు బయలుదేరి...
కొత్తవలస, న్యూస్‌టుడే: సౌమ్యక ఆర్కిటెక్చర్‌ పూర్తిచేసి మూడేళ్లయింది.ఆమె కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేసి మానేశారు. తనతోపాటు చదువుకున్న స్నేహితులతో కలసి డ్రాయింగ్‌లు వేస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుకొంటొంది. పుట్టినరోజున ఇంటి నుంచి బయటకు వెళ్లి 24 గంటలు దాటేసరికి కుటుంబ సభ్యులు ఆ యువతి చావుకబురు వినాల్సివచ్చింది. దీంతో తల్లి, కుటుంబ సభ్యులు నిశ్చేష్టులయ్యారు.  గుంటూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఆమె గాయపడినట్లు తల్లి లక్ష్మికి సమాచారం అందడంతో ఆందోళనకి గురయ్యారు. వీరి ఇంటికి ఆనుకునే ఉంటున్న ఇద్దరు సోదరులతో కలసి కారులో గుంటూరు పయనమయ్యారు. మృతురాలి తండ్రి నేవీలో ఉద్యోగంచేసి పదవీ విరమణ చేసి ప్రస్తుతం డ్రిగ్గింగ్‌ సంస్థలో విదేశంలో ఉద్యోగం చేస్తున్నారని సమాచారం. దేశపాత్రునిపాలెంలో తల్లి, మాచ్‌ఖండ్‌ విద్యుత్తు తయారీ కేంద్రంలో ఉద్యోగం చేసిన తాతతో కలసి ఉంటున్నారు. ఈమె అక్క పీహెచ్‌డీ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని