logo

సర్కారు భూములు సమర్పయామి

భూముల విలువ పెరుగుతున్నంత వేగంగా ప్రభుత్వ భూములు పరాధీనమవుతున్నాయి. ఎకరం రూ.లక్షల ధర పలుకుతుండటంతో సర్కారు భూములను ఆక్రమించి సాగు చేపట్టి ప్రైవేటు ఒప్పందాలతో ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలో కొండలు, గుట్టలు కూడా వదిలిపెట్టడం లేదు

Updated : 16 Aug 2022 07:14 IST

రూ.లక్షల విలువైనవి పరాధీనం

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, నకరికల్లు

నర్శింగపాడు పురిబోడు వద్ద ఆక్రమించిన భూములు

భూముల విలువ పెరుగుతున్నంత వేగంగా ప్రభుత్వ భూములు పరాధీనమవుతున్నాయి. ఎకరం రూ.లక్షల ధర పలుకుతుండటంతో సర్కారు భూములను ఆక్రమించి సాగు చేపట్టి ప్రైవేటు ఒప్పందాలతో ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలో కొండలు, గుట్టలు కూడా వదిలిపెట్టడం లేదు. సాగుకు పనికివస్తుందంటే కొండపైకి వెళ్లి కూడా ఆక్రమణలు చేస్తున్నారు. ఇదంతా భూమి లేని నిరుపేదలు చేస్తున్నారనుకుంటే పొరపాటే. నేతల అండదండలు.. పట్టా భూములు ఉన్న రైతులు.. యంత్రాంగం సహకారంతో కొందరు యథేచ్ఛగా ఆక్రమణలు చేస్తున్నారు. దర్జాగా ఆక్రమించి సాగు చేయడమే కాకుండా బోరుబావులు తవ్వి విద్యుత్తు కనెక్షన్‌ తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు. ఆక్రమిత భూములను కొందరు ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకోవడం గమనార్హం. ఇదీ నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామంలో పురిబోడు చుట్టూ జరిగిన ఆక్రమణల తీరు.
ఆనవాలు కోల్పోతున్న పురిబోడు
నర్సింగపాడు ఆనుకుని సర్వే నంబరు 97లో సుమారు 110 ఎకరాల్లో పురిబోడు కొండ ప్రాంతం ఉంది. ఇది ప్రభుత్వ భూమి. ఎర్రమట్టి, రాళ్లతో నిండి ఉంది. ఇక్కడ విలువైన క్రిస్టల్‌ ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. పురిబోడులో పశువులు, గొర్రెలు మేత మేయడంతోపాటు గ్రామంలో సామాజిక అవసరాలకు ఉపయోగపడుతోంది. గతంలో నడికూడి-శ్రీకాళహస్తి రైల్వేప్రాజెక్టుకు అవసరమైన మట్టి తవ్వకాల నిమిత్తం పురుబోడు వద్ద తాత్కాలికంగా అనుమతులు ఇచ్చారు. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. అప్పట్లో మట్టి తరలించగా ఏర్పడిన గోతులను చదును చేసి పంటలు సాగు చేశారు. సారవంతమైన భూములు కావడంతో ఆక్రమణలు విస్తరించాయి. ఇటీవల ఏకంగా మట్టిని అక్రమంగా తవ్వి తరలించిన తర్వాత చదును చేసి సాగుచేస్తున్నారు. సుమారు 60 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది. పురిబోడు కింద భాగంలో 1999లో 27మంది పేదలకు 17.33 ఎకరాల విస్తీర్ణంలో డీకేటీ పట్టాలు ఇచ్చారు. ఆ భూమి పోగా మిగిలిన విస్తీర్ణం ఆక్రమణలో ఉంది. ఇటీవల ఇక్కడ మట్టి తవ్వకాలు, భూముల ఆక్రమణలు విస్తరిస్తున్నాయి. ఎకరం భూమి బహిరంగమార్కెట్‌లో రూ.20లక్షల నుంచి రూ.25లక్షలు పలుకుతోంది.  
విస్తరించిన ఆక్రమణలు
పురిబోడు చుట్టూ ఆక్రమించిన వ్యక్తులు క్రమంగా కొండపైకి వెళ్లి చదును చేయడం ఆరంభించారు. కొండపైన ఎర్రమట్టి ఉన్న ప్రాంతంలో తొలుత తవ్వకాలు చేసి రాళ్లు పక్కన పోసి మట్టి అమ్ముకుంటున్నారు. ఇలా కొన్ని సెంట్లలో తవ్విన తర్వాత ఆ ప్రాంతాన్ని చదునుగా చేసి పంటల సాగుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కొండపైన చదును చేసిన భూమిలో వివిధ రకాలు పంటలు పండిస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది పెద్ద రైతులు ఉండటం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే సామాజిక అవసరాలకు కూడా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండదు. పురిబోడు ప్రాంతంలో కొంత విస్తీర్ణంలో ఇటీవల జగనన్న కాలనీకి కేటాయించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇదంతా నకరికల్లు-కారంపూడి మార్గంలో నర్సింగపాడు వద్ద ప్రధాన రహదారి పక్కనే జరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్హం. గ్రామంలో రీసర్వే ప్రక్రియ చేపట్టామని, ఇందులో ప్రభుత్వ భూములు గుర్తిస్తామని నకరికల్లు తహశీల్దార్‌ ఎస్‌.సురేష్‌ చెప్పారు. పురిబోడు వద్ద కొందరికి డీకేటీ పట్టాలు ఇచ్చారు. రీసర్వేలో వీటిని పరిశీలించి మిగిలిన ఆక్రమణలపై చర్యలు తీసుకుంటా మన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని