logo

పట్టాలెక్కని పర్యాటక ప్రాజెక్టులు

సూర్యలంక బీచ్‌ అత్యంత అరుదైన బంగారపు వర్ణం ఇసుక ఇక్కడి ప్రత్యేకతతో అంతర్జాతీయ బీచ్‌ల వరుసలో నిలుస్తుంది. బీచ్‌ అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ. అలల ఉద్ధృతి లేకుండా పర్యటకులు స్నానాలు చేసేందుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తుంది

Published : 16 Aug 2022 07:11 IST

సూర్యలంక బీచ్‌ అభివృద్ధి చేస్తే ప్రయోజనాలెన్నో

ఈనాడు, బాపట్ల

సూర్యలంక బీచ్‌ అత్యంత అరుదైన బంగారపు వర్ణం ఇసుక ఇక్కడి ప్రత్యేకతతో అంతర్జాతీయ బీచ్‌ల వరుసలో నిలుస్తుంది. బీచ్‌ అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ. అలల ఉద్ధృతి లేకుండా పర్యటకులు స్నానాలు చేసేందుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తుంది. బీచ్‌ వెంబడి నీళ్లలో ఎక్కడా రాళ్లు లేకుండా అత్యంత సురక్షితమైనది. పర్యాటకుల ఆహ్లాదానికి నిలయంగా మారింది. సూర్యలంక బీచ్‌ ప్రతిష్ఠాత్మక బ్లూప్లాగ్‌ ధ్రువపత్రం సైతం పొందింది. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెలంగాణ, ఆంధ్రా ప్రజలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పర్యటకులకు స్వర్గధామంగా ఉన్న సూర్యలంక బీచ్‌ను అభివృద్ధి చేసి ఈప్రాంతం ప్రగతికి బాటలు వేయాల్సి ఉంది.

సూర్యలంక బీచ్‌ అభివృద్ధికి రెండు దశాబ్దాలుగా అనేక ప్రతిపాదనలు రూపొందించినా ఆచరణలో అమలుకాలేదు. కేంద్ర పర్యటకశాఖ మంత్రులు శంకుస్థాపనలు చేసినా కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రప్రభుత్వం సైతం పలుమార్లు ప్రకటనలు చేసినా హామీలు అమలుకు నోచుకోలేదు. బాపట్ల జిల్లా కేంద్రం కావడంతోపాటు సూర్యలంక బీచ్‌కు అనేక ప్రత్యేకతలు ఉన్నందున అభివృద్ధిపై మరోసారి చర్చనీయాంశమైంది. బీచ్‌లో మౌలిక వసతుల కల్పనకు 19 ఎకరాల భూమి సేకరించారు. బీచ్‌కు వెళ్లే ప్రవేశమార్గం నుంచి పొగరు వరకు బీచ్‌కు సమాంతరంగా రహదారి ఏర్పాటు చేయాల్సి ఉంది. బీచ్‌లో పర్యటకులు సేదతీరడానికి చెక్క బెంచీలు, గొడుగులు, తాగునీటి సౌకర్యం, దుస్తులు మార్చుకోవడానికి గదులు,  సముద్ర అందాలను వీక్షించడానికి ఏర్పాట్లు చేయాలి. తీరంలో ఉద్యానవనం అభివృద్ధి చేసి పిల్లలు ఆడుకోవడంతోపాటు విజ్ఞానాన్ని పెంపొందించేలా తీర్చిదిద్దాలి. సూర్యలంక బీచ్‌ ప్రాధాన్యతను తెలిపేలా బోర్డులు, ప్రమాద సూచికలు, సురక్షిత ప్రాంతాలు ఇలా పర్యటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి.
తీర ప్రాంత యువతకు ఉపాధి
సూర్యలంక బీచ్‌కు ఇటీవల కాలంలో పర్యటకుల సంఖ్య బాగా పెరిగింది. పర్యటక రిసార్టుకు ఏడాదికి రూ.5కోట్ల వరకు ఆదాయం వస్తోంది. బీచ్‌ ఒడ్డున రిసార్టులు, ఇతర అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పిస్తే పర్యటకుల సంఖ్య ఏటికేడు గణనీయంగా పెరుగుతుంది. తెలంగాణకు సమీపంలో ఉన్న సురక్షితమైన బీచ్‌ సూర్యలంక కావడంతో హైదరాబాద్‌ నుంచి వచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. వారాంతాల్లో ఇక్కడి పర్యటకశాఖ రిసార్టుల్లో వసతి దొరకడం గగనమవుతోంది. రిసార్టుల నుంచి నేరుగా బీచ్‌ అందాలను తిలకించడంతోపాటు ఉదయం, సాయంత్రం వేళల్లో సముద్ర ఒడ్డున గడిపేందుకు  ఏర్పాట్లు ఉండటంతో ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. పర్యటకుల సంఖ్య పెరిగితే ఆతిథ్యం, రవాణా, వివిధ రకాల వ్యాపారాలతో ప్రత్యక్షంగా వందల మందికి, పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈప్రాంతం అభివృద్ధి కూడా వేగవంతమవుతుంది.  
అటవీశాఖ ప్రణాళికలు
బీచ్‌ ఒడ్డు వెంబడి మడ అడవులతో కూడిన అటవీశాఖ భూములు ఉన్నాయి. ప్రకృతి రమణీయతను ఉట్టిపడేలా నీటి మధ్య మడఅడవులు పర్యటకులకు కనువిందు చేస్తున్నాయి. సముద్రం నుంచి భూమి వైపునకు చొచ్చుకువచ్చిన నీటిపాయలకు ఇరువైపులా మడ అడవులు వృద్ధి చెందాయి. అటవీ భూముల్లో పర్యటకులకు సేదతీరేలా ఏర్పాటుచేయడంతోపాటు ఏకో టూరిజం అభివృద్ధి చేయాలన్నా ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక్కడికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పక్షులు వస్తున్నాయి. వీటిని చూడటానికి ఏర్పాట్లు చేయడం, మడ అడవుల అందాలను బోటులో వెళ్లి చూసి వచ్చేలా బోటింగ్‌ ఏర్పాటుచేయాల్సి ఉంది. రెండు నెలల్లో ప్రతిపాదనలు తయారుచేయడానికి అటవీశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రతిపాదనలకు ఉన్నతాధికారుల నుంచి ఆమోదం లభిస్తే సూర్యలంకకు వచ్చే పర్యటకులకు ఆహ్లాదం లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని