logo

‘వైకాపా పరిపాలనలో దళితులపై దాడులు’

దళిత ద్రోహి జగన్‌మోహన్‌రెడ్డి అని ఊరకే అనడం లేదు. వైకాపా పరిపాలన వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు మొదలయ్యాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ అన్నారు. విదేశీ విద్యకు అంబేడ్కర్‌ పేరు తొలగించి జగన్‌మోహనరెడ్డి పేరు

Published : 17 Aug 2022 05:48 IST

తెదేపా ఎస్సీ విభాగం చేపట్టిన నిరవధిక దీక్షకు సంఘీభావంగా పాల్గొన్న  నారా లోకేశ్‌

మంగళగిరి (తాడేపల్లి), న్యూస్‌టుడే: దళిత ద్రోహి జగన్‌మోహన్‌రెడ్డి అని ఊరకే అనడం లేదు. వైకాపా పరిపాలన వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు మొదలయ్యాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ అన్నారు. విదేశీ విద్యకు అంబేడ్కర్‌ పేరు తొలగించి జగన్‌మోహనరెడ్డి పేరు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కనికళ్ల చిరంజీవి, గుంటూరు పార్లమెంటు ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మైనర్‌బాబు, నియోజకవర్గ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడు ఎర్రగుంట్ల భాగ్యారావు, మరో పదిమంది సంయుక్తంగా తెదేపా ఎస్సీ సెల్‌ ఆధ్వర్యాన మంగళగిరిలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. విదేశీ విద్యకు అంబేడ్కర్‌ పేరు తిరిగి పెట్టేవరకు దీక్ష విరమించేది లేదని నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు తనికళ్ల చిరంజీవి బృందం స్పష్టం చేసింది. దీక్షకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళవారం సాయంత్రం సంఘీభావం తెలిపి మాట్లాడారు. పులివెందులలో దళిత మహిళ నాగమ్మని అత్యాచారం చేసి చంపేస్తే నేటి వరకు ఆ కుటుంబానికి న్యాయం చేయలేదన్నారు. ఎస్సీ ఉపప్రణాళిక నిధులు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. ‘సంక్షేమ కార్యక్రమాలకు చేసిన ఖర్చుని సబ్‌ ప్లాన్‌గా చూపుతున్నారు. అంబేడ్కర్‌ స్మృతివనాన్ని రద్దు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఏ ఒక్కరికి రుణం మంజూరు చేయలేదు. తెదేపా ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి కంభంపాటి శిరీషా, పార్లమెంటు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి జీవన్‌కుమార్‌, గుంటూరు పార్లమెంటు తెదేపా ప్రధాన కార్యదర్శి పోతునేని శ్రీనివాసరావు, నియోజకవర్గ పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్ధయ్య, పట్టణ అధ్యక్షుడు దామర్లరాజు, ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, తెదేపా బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని