logo

ప్రత్యేక ప్రణాళికతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి

‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమం ప్రవేశపెట్టి గిరిజన బాలల విద్యా వికాసానికి బాటలు వేశారు. గిరిజన గ్రామంలో తొలి అడ్వెంచర్‌ ఉద్యానవనం నిర్మించి గిరిజనుల జీవనశైలి తెలిపే చిత్రాలు.. చిన్నారుల కోసం బాలవిహార్‌.. పెద్దల కోసం జలవిహార్‌ నిర్మించి ఆహ్లాదాన్ని పంచారు.

Published : 17 Aug 2022 05:48 IST

బృంద స్ఫూర్తితో పనిచేసి ఫలాలు అందిస్తాం
‘ఈనాడు’తో  కలెక్టర్‌ శివశంకర్‌  

ఈనాడు, నరసరావుపేట: ‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమం ప్రవేశపెట్టి గిరిజన బాలల విద్యా వికాసానికి బాటలు వేశారు. గిరిజన గ్రామంలో తొలి అడ్వెంచర్‌ ఉద్యానవనం నిర్మించి గిరిజనుల జీవనశైలి తెలిపే చిత్రాలు.. చిన్నారుల కోసం బాలవిహార్‌.. పెద్దల కోసం జలవిహార్‌ నిర్మించి ఆహ్లాదాన్ని పంచారు. స్పందనకు వచ్చే అర్జీదారులకు దాతల ద్వారా ఆకలి తీర్చుతున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌కు రూపకల్పన చేశారు. ఆయనే పల్నాడు జిల్లా తొలి పాలనాధికారి శివశంకర్‌ లోతేటి. నూతన జిల్లా ప్రగతిపై ప్రణాళికలు, ప్రాధాన్యతలపై ‘ఈనాడు’తో ప్రత్యేక ముఖాముఖి. వివరాలు ఆయన మాటల్లోనే..

పల్నాడు ప్రగతిపై..: పల్నాడు జిల్లాలో పర్యటక, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలు ఉన్నాయి. సాగర్‌ ప్రాజెక్టు సందర్శనకు వారాంతాల్లో కూడా వందల మంది మాత్రమే వస్తున్నారు. ఇక్కడ పర్యటకులకు వసతుల కల్పనతోపాటు ఉద్యానవనాలు అభివృద్ధి చేయడం ద్వారా వేలమంది పర్యటకులను ఆకర్షించి ఆదాయం పెంచుకోవచ్చు. పర్యటకుల సంఖ్య పెరిగితే యువతకు ఉపాధితోపాటు జిల్లా ప్రగతికి దోహదపడుతుంది. సాగర్‌ జలాశయంలో లాంచీస్టేషన్‌ పక్కనే 8 ఎకరాల భూమిని గుర్తించాం. అక్కడి నుంచి జలాశయాన్ని తిలకించే  ఏర్పాట్లతోపాటు ఆహ్లాదంగా గడిపేలా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. పల్నాడు ప్రాంతంలో చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యటక ప్రాంతాల్లో సర్క్యూట్‌ ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నాం.

ప్రధాన సమస్యలపై..:  విజయపురిసౌత్‌కు పంచాయతీగా గుర్తింపు లేకపోవడంతో అక్కడ అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఉన్నాయి. పంచాయతీ ఏర్పాటుపై  ఆదేశాలిచ్చాం. ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం. అధికారులు బృంద స్ఫూర్తితో పనిచేసేలా ముందుకెళుతున్నాం.   యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు నడిపేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.


‘స్పందన’ ఫిర్యాదుల పరిష్కారం

స్పందన దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశాం. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి 28 మందిని ఎంపిక చేసుకుని వారి సేవలు ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఉద్యోగి స్పందన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ చేపడతారు. జిల్లా కార్యాలయాల స్థాయిలో పరిష్కరించాల్సిన దరఖాస్తులను ఆయా అధికారులకు పంపి వీరే ఫాలో అప్‌ చేసి పరిష్కారమయ్యేలా చూస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు వల్ల దరఖాస్తు పరిష్కారం తీరును తెలుసుకోవచ్చు. వీరందరిని పర్యవేక్షించడానికి ఒక అధికారిని నియమించి పనితీరును మదింపు చేస్తున్నాం. దాతల సహకారంతో ప్రతి సోమవారం స్పందనకు వచ్చే అర్జీదారులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం.  


ప్రాధాన్య అంశాలపై....

పల్నాడు ప్రధానంగా వ్యవసాయాధారిత జిల్లా. ఇక్కడ సంప్రదాయ పంటల స్థానంలో మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులు పండించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. వినుకొండ నియోజకవర్గంలో పండ్లు, పూలు, కూరగాయల పంటలకు నేలలు, వాతావారణం అనుకూలంగా ఉంది. ఈ ప్రాంతాన్ని ఉద్యాన క్లస్టర్‌గా ఎంపిక చేసి నూతన పంటలు సాగు చేయిస్తాం. మెట్ట పంటల సాగులో ముందడుగు వేసేలా ప్రయోగాలకు పల్నాడును వేదికగా చేసుకుంటాం. వినుకొండ ప్రాంతాన్ని ఉద్యాన క్లస్టర్‌గా గుర్తించి ప్రత్యేక దృష్టి సారిస్తాం. పంటలు పండించడమే కాకుండా వేగంగా పట్టణాలు, నగరాలకు రవాణా చేసేలా కార్యాచరణ ప్రణాళికకు కసరత్తు చేస్తున్నాం. ప్రజల్లో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సరళిని మార్చుకునేలా రైతులను చైతన్య పరుస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని