logo

డీఏపీ ధర మోత

వేమూరు మండలం జంపనికి చెందిన ప్రదీప్‌ డీఏపీ ఎరువు కోసం స్థానిక రైతు భరోసా(ఆర్బీకే)కి వెళ్లాడు. కార్యాలయంలోని వ్యవసాయ సహాయకులు ప్రస్తుతం నిల్వ లేదని చెప్పడంతో వెనుదిరిగాడు. వరి పైరుకు తక్షణం ఎరువు వేయాల్సిరావడంతో తెనాలిలోని

Published : 17 Aug 2022 05:48 IST

నల్లబజారులో ఎమ్మార్పీ కంటే రూ.50 నుంచి రూ.100 అదనం
చోద్యం చూస్తున్న వ్యవసాయాధికారులు

వేమూరు, న్యూస్‌టుడే: వేమూరు మండలం జంపనికి చెందిన ప్రదీప్‌ డీఏపీ ఎరువు కోసం స్థానిక రైతు భరోసా(ఆర్బీకే)కి వెళ్లాడు. కార్యాలయంలోని వ్యవసాయ సహాయకులు ప్రస్తుతం నిల్వ లేదని చెప్పడంతో వెనుదిరిగాడు. వరి పైరుకు తక్షణం ఎరువు వేయాల్సిరావడంతో తెనాలిలోని ఓ ప్రైవేటు దుకాణానికి వెళ్లాడు. రూ. 1342 విక్రయించాల్సిన డీఏపీ ఎరువు బస్తాకు రూ.1400 చెల్లించాలని దుకాణ నిర్వాహకులు చెప్పారు. అదేమని ప్రశ్నిస్తే డీఏపీ స్టాకు లేదని సమాధానం ఇచ్చారు. అదనుకు ఎరువు వేయకపోతే పైరు దెబ్బతింటుందని భావించి, చేసేది లేక వారు అడిగినంత చెల్లించి ఎరువు కొనుగోలు చేశాడు. ఇలాంటి పరిస్థితి ప్రదీప్‌ ఒక్కడిదే కాదు. జిల్లాలో చాలామంది డీఏపీ ఎరువు కొనుగోలుకు ఎమ్మార్పీ కంటే అదనంగా చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు.  

నిల్వ చేసిన కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాలు

వరిపైరుకు మొదటి దఫా..

వ్యవసాయాధికారుల సూచనల మేరకు వరి పైరుకు మొదటి దఫాలో డీఏపీ ఎరువుతోపాటు, యూరియా కలిపి చల్లుతారు. రైతులు చెబుతున్న లెక్క ప్రకారం డీఏపీ ఎరువు ఎకరాకు కనీసం 50 కిలోలు వాడతారు. ఈ లెక్కన వరి పైరుకే 2.9 లక్షల ఎకరాలకు మూడు లక్షల బస్తాల డీఏపీ కావాలి. ఇవిగాక కూరగాయలు, అరటి తదితర ఉద్యాన పంటలకు మరో 60 వేల బస్తాలు మొత్తం కలిపి 3.5 లక్షల డీఏపీ ఎరువుల బస్తాలు కావాలి. ప్రస్తుతం ఆ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు లేవు. ఆర్బీకేలకు వచ్చిన సరకు ఏరోజుకారోజు విక్రయిస్తున్నారు. రైతులకు పూర్తిస్థాయిలో అందని పరిస్థితి నెలకొంది. గమనించిన ప్రైవేటు వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా రూ. 50 నుంచి రూ. 100 చొప్పున అదనంగా పెంచి అమ్ముతున్నారు. ఇదంతా వ్యవసాయాధికారులకు తెలిసినా నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది పెరిగిన కాంప్లెక్స్‌, డీఏపీ ధరలతో రైతులు సతమతమవుతుంటే అది చాలదన్నట్లు ప్రైవేటు వ్యాపారులు డీఏపీని ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తిపోతున్నారు. డీఏపీ ఎరువులకు ప్రస్తుతం కొరత లేదని తెనాలి ఇంఛార్జి ఏడీఏ వెంకట్రావ్‌ పేర్కొన్నారు. ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు ఎరువులు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచుతామని వివరించారు.

చల్లకుంటే దిగుబడులపై ప్రభావం

బాపట్ల జిల్లాలో 1.16 లక్షల హెక్టార్లలో ప్రస్తుతం వరి సాగవుతుంది. వెద పద్ధతి ద్వారా గాని, సాధారణ పద్ధతిలో గాని దాదాపుగా నాట్లు పూర్తయ్యాయి. అయితే మొదటి దఫా ఎరువులు చల్లడానికి అన్నదాతలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం వెద పద్ధతిన వరి విత్తి నెల రోజులు దాటినవారు, నాట్లు వేసి వారం రోజులు గడిచినవారు మొదటి దఫాలో డీఏపీ, యూరియా చల్లాలి. అయితే డీఏపీ ఆర్బీకేల వద్ద రైతులకు కావాల్సినంత అందుబాటులో లేకపోవడంతో అదను దాటిపోతుందని రైతులు వాపోతున్నారు. వెంటనే ఎరువులు చల్లకపోతే వరి దుబ్బు చేయదని, దీంతో దిగుబడి గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. అయితే వ్యవసాయాధికారులు మాత్రం రైతులకు డీఏపీ నిల్వలపై స్పష్టత ఇవ్వకుండా ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్‌ ఎరువులు వాడాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని