logo

గురువుల హాజరు గందరగోళం

ప్రభుత్వమే హాజరు నమోదుకు పాఠశాలల్లో బయోమెట్రిక్‌ డివైస్‌లు ఏర్పాటు చేయాలని, ఫోన్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదు చేసుకునే విధానానికి స్వస్తి పలకాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ముఖ ఆధారిత హాజరు  యాప్‌లో సులభంగా

Published : 17 Aug 2022 05:58 IST
తొలిరోజే  మొరాయించిన సర్వరు
ఆందోళనలో ఉపాధ్యాయ వర్గం
న్యూస్‌టుడే, చీరాల గ్రామీణం

ప్రభుత్వమే హాజరు నమోదుకు పాఠశాలల్లో బయోమెట్రిక్‌ డివైస్‌లు ఏర్పాటు చేయాలని, ఫోన్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదు చేసుకునే విధానానికి స్వస్తి పలకాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ముఖ ఆధారిత హాజరు  యాప్‌లో సులభంగా నమోదు చేయవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి రామారావు చెబుతున్నారు.

పాఠశాలల్లో ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదులో తొలిరోజు తడబాటు తప్పలేదు. మంగళవారం నుంచి తప్పనిసరిగా ఉపాధ్యాయులు కొత్త యాప్‌లో తమ హాజరు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ యాప్‌ వినియోగించడంపై ఉపాధ్యాయులకు సరైన సమాచారం లేదు. ఆన్‌లైన్‌లో కొందరు డౌన్‌లోడ్‌ చేసే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. తమ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల కాంప్లెక్స్‌ ఛైర్మన్లు పంపిన లింక్‌ల ద్వారా పేర్లను నమోదు చేసే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఒకేసారి వేలాదిమంది హాజరు నమోదుకు సిద్ధమవ్వడంతో సర్వర్‌ ఆగిపోయింది. సెల్ఫీ తీసుకున్న తరువాత హాజరు కొందరివి ఫెయిలవ్వగా.. చాలామందికి లాగిన్‌ అయ్యేందుకు కూడా అవకాశం రాలేదు. ఉదయం 9 గంటల్లోపు ఉపాధ్యాయుల హాజరు పూర్తి చేయాల్సి ఉండగా మధ్యాహ్నం 2 వరకు సర్వర్‌ అందుబాటులోకి రాలేదు. దీంతో ఉపాధ్యాయుల హాజరు నమోదు ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనిపై ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. గతంలో వాడిన పరికరాలను పునరుద్ధరించకుండా ఎవరికి వారు సొంత యాప్‌ల ద్వారా హాజరు వేయాలని చెప్పడం సరికాదని చెబుతున్నారు. బాపట్ల జిల్లాలోని 25 మండలాల్లో 1474 ప్రభుత్వ పాఠశాలుండగా.. ఐదు వేలమందికి పైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో అతికొద్ది మంది మాత్రమే యాప్‌ను తమ చరవాణిలో డౌన్‌లోడ్‌ చేసుకుని హాజరు వేయడానికి ప్రయత్నించారు. మరోవైపు ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు అధిక శాతం మంది అసలు యాప్‌లు, రిజిస్త్రేషన్‌ జోలికి వెళ్లలేదు. ఉదయాన్నే బడిలోని హాజరు రిజిస్టర్‌లో సంతకం చేసే బదులు ఈ యాప్‌లో హాజరు నమోదు సులభమని విద్యాశాఖాధికారులు చెప్పుకొస్తున్నారు.


ఒత్తిడి పెంచడం సరికాదు
- జె.వినయ్‌కుమార్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

తరగతి గదుల్లో చరవాణి వినియోగించకూడదనే నిబంధనలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం తాజాగా ఎవరి చరవాణిలో వారే ముఖ ఆధారిత హాజరు వేయాలని అదేశాలు జారీ చేయడంతో బోధనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉదయాన్నే 9 గంటలకు వెళ్లి హాజరు వేయడంపై ఎవరికి అభ్యంతరాలు లేవు. అందుకోసం ప్రత్యేకంగా పరికరాలను ఏర్పాటు చేయాలి. బోధనలో లోపాలు ఉంటే పర్యవేక్షణ పెంచాలి. అందుకోసం ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలి.


పని తీరుకు యాప్‌లు కొలమానం కాదు
- పీడీ సోషలిజం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీటీఎఫ్‌

ఉపాధ్యాయుల పని తీరు కొలవడానికి రకరకాల యాప్‌లు కొలమానం కాదు. ప్రమాణాలతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుందా అనేది చూడాలి. ఒత్తిడి లేని వాతావరణం పాఠశాలలో కల్పిస్తే బోధన మెరుగుపడుతుంది. ప్రభుత్వం కక్ష పూరితంగా కాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలి. గతంలో వాడిన డివైస్‌లను పునరుద్ధరించాలి.


జీతాలకు ఆన్‌లైన్‌ హాజరుతో ముడిపెట్టడం తగదు  
- వి.ప్రభాకరరావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి, ఎస్టీయూ

కొత్తగా ప్రవేశపెట్టిన యాప్‌కు జీతాలతో లింక్‌ చేస్తామనడం సరికాదు. సర్వర్‌ సామర్థ్యం పెంచకుండా ఆన్‌లైన్‌ హాజరు వేయమనడంతో విలువైన కాలం వృథా అవుతుంది. కొత్త యాప్‌ పట్టణ ప్రాంతంలోనే సరిగా లేదంటే ఇక గ్రామీణ ప్రాంతంలో ఎలా పని చేస్తుందో అర్థం కావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని