logo

‘గుంటూరు ఛానల్‌ పొడిగింపు పనులు చేపట్టాలి’

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసి వెంటనే పనులు చేపట్టాలని నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు కోరారు. పర్చూరు బొమ్మల కూడలి సమీపంలో మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు.

Published : 17 Aug 2022 05:58 IST

నిరాహార దీక్ష చేస్తున్న నల్లమడ రైతు సంఘం నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్న డాక్టర్‌ రాజమోహనరావు

పర్చూరు, న్యూస్‌టుడే: గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసి వెంటనే పనులు చేపట్టాలని నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు కోరారు. పర్చూరు బొమ్మల కూడలి సమీపంలో మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే దీక్ష ఉద్దేశమని తెలిపారు. గుంటూరు ఛానల్‌ను పొడిగించడం ద్వారా బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 50 గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన పని చేపట్టడంలో జరుగుతున్న జాప్యం బాధాకరమన్నారు. 2019 ఎన్నికల సమయంలో కాకుమాను, పెదనందిపాడు, ప్రత్తిపాడు, ఇంకొల్లు సభల్లో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు ఛానల్‌ పనులు చేపడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రత్తిపాడులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి వాగ్దానం చేశారన్నారు. 85 సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నారని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కోసం ఇంతగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. సర్వేలు, హామీలతో కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వక్తలు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ పొడిగింపునకు అవసరమైన నిధులు వెంటనే విడుదల చేసి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంఘం ప్రతినిధులు కారుమంచి విజయకుమార్‌, యార్లగడ్డ అంకమ్మచౌదరి, నరిశెట్టి అచార్యులు, కోట హరిప్రసాద్‌, కాపు రవిచంద్ర, కొల్లా రామన్‌, అడ్డగడ వెంకటేశ్వర్లు, రావి రంగనాథబాబు, జాలాది సుధీర్‌, లంకా ప్రసాద్‌, దండా శ్రీనివాసరావు, చెన్నుపాటి సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. శిబిరం వద్దకు పలువురు నాయకులు, రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని