logo

నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు చర్యలు

ప్రజలకు విద్యుత్తు కోతలు లేకుండా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరా అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నరసరావుపేట డివిజన్‌ విద్యుత్తు పర్యవేక్షక ఇంజినీరు (ఈఈ) ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో మాట్లాడారు.

Published : 17 Aug 2022 06:05 IST

న్యూస్‌టుడే’ ముఖాముఖిలో నరసరావుపేట డివిజనల్‌ విద్యుత్తు ఈఈ శ్రీనివాసరావు
ఈపూరు, న్యూస్‌టుడే

ప్రజలకు విద్యుత్తు కోతలు లేకుండా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరా అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నరసరావుపేట డివిజన్‌ విద్యుత్తు పర్యవేక్షక ఇంజినీరు (ఈఈ) ఎస్‌.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో మాట్లాడారు.

నరసరావుపేట డివిజన్‌లో 35,170 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అన్నింటికీ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తాం. మీటర్ల ఏర్పాటు గురించి రైతుల్లో అపోహలున్నాయి. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు వివరించి రైతుల అంగీకారంతో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తాం. నగదు బదిలీ కింద రైతుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన డబ్బును ఆటోమెటిక్‌గా బిల్లులకు జమ చేసుకోడానికి రైతుల అంగీకార పత్రాలను సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 34 శాతం మంది అంగీకార పత్రాలు ఇచ్చారు.

జగనన్న కాలనీలకు సరఫరా పురోగతి

నరసరావుపేట డివిజన్‌ పరిధిలో 357 జగనన్న కాలనీలకు విద్యుత్తు సరఫరా అందించాల్సి ఉంది. ఈ కాలనీల్లో 40,869 ఇళ్లకు విద్యుత్తు సరఫరా అందించడానికి రూ.109 కోట్లు ఖర్చు చేయనున్నాం. ఇళ్లకు ఉచితంగా మీటర్లు, సర్వీసు వైరు, బోర్డు ఏర్పాటు చేసి ఇంటి నిర్మాణం పూర్తయ్యాక సరఫరా అందిస్తాం. నరసరావుపేట డివిజన్‌లో 2021- 2022 సంవత్సరానికి 1999 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చాం. 2022- 2023 సంవత్సరానికి సంబంధించి ఈ నాలుగు నెలల్లో 643 కనెక్షన్లు మంజూరు చేశాం. జలకళలో ఇప్పటి వరకు 109 సర్వీసులు మంజూరు చేశాం. కనెక్షను మంజూరై డీడీలు చెల్లించిన రైతులకు వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నాం. దరఖాస్తులు చేసుకున్న రైతులకు ప్రాధాన్య క్రమంలో మంజూరు చేస్తున్నాం. ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోతే ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మరు ఏర్పాటు చేస్తున్నాం.

కోతల నివారణకు చర్యలు

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు విద్యుత్తును 25 ఏళ్ల పాటు సరఫరా చేయడానికి ప్రభుత్వం సంబంధిత సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇది కార్యరూపం దాలిస్తే వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంతో పాటు ఇళ్లకు కూడా కోతలు లేకుండా నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తు అందించడం సాధ్యపడుతుంది.ప్రజలకు అంతరాయాలు లేని సరఫరా అందించడానికి వివిధ కొత్త నిర్మాణాలు చేపడుతున్నాం. డివిజన్‌కు కొత్తగా ఏడు 33 కేవీ సబ్‌స్టేషన్లు మంజూరు కాగా కొమెరపూడి, రావిపాడుల్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. వేల్పూరు, వినుకొండ (వెల్లటూరు రోడ్డు), బ్రాహ్మణపల్లి, పెదపాలెం, ఉప్పలపాడు గ్రామాల పరిధిలో స్థల సేకరణలు పూర్తయింది. అక్కడ త్వరలో పనులు ప్రారంభిస్తాం. సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్తు సరఫరా చేస్తున్న మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో నిరంతరం త్రీ ఫేజ్‌ విద్యుత్తు సరఫరా సౌకర్యం కల్పించడానికి ఎల్‌డబ్ల్యుఈ పథకం కింద ప్రభుత్వం అంగలూరు, బొమ్మరాజుపల్లి గ్రామాలను ఎంపిక చేసింది. అంగలూరులో ఇప్పటికే పనులు ప్రారంభించాం.

బాకాయి వసూళ్లపై..

నరసరావుపేట డివిజన్‌ పరిధిలో వివిధ వర్గాల నుంచి మొత్తం రూ.37 కోట్ల బకాయిలు పేరుకున్నాయి. ఇందులో రూ.15 కోట్లు ప్రభుత్వ సంస్థల బకాయిలే ఉన్నాయి. బిల్లుల చెల్లింపులో బకాయిదారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో చర్యలకు ఉపక్రమించాం. బకాయిలున్న ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని నిర్ణయించాం. ఇప్పటికే డివిజన్‌లో వివిధ తహశీల్దారు కార్యాలయాలకు సరఫరా నిలిపివేశాం. వచ్చే నెల 10లోపు బకాయిలు చెల్లించిన ప్రభుత్వ కార్యాలయాలకు సర్‌ఛార్జీ మాఫీ చేస్తాం. బకాయిలు చెలించని ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నాం. చెల్లించకపోతే వారి ఆస్తులు జప్తు చేయడానికి చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని