logo

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్‌

పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ హెచ్చరించారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో పంచాయతీ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

Published : 18 Aug 2022 05:49 IST


అధికారులతో సమావేశంలో పాలనాధికారి విజయకృష్ణన్‌

బాపట్ల, న్యూస్‌టుడే: పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ హెచ్చరించారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో పంచాయతీ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 459 గ్రామ పంచాయతీలు ఉండగా, 150 చోట్ల చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మించినట్లు చెప్పారు. 97 గ్రామాల్లో వ్యర్థాల నుంచి వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్ప యాప్‌లో రోజూ గ్రామాల వారీగా పారిశుద్ధ్య కార్యక్రమాల వివరాలను పంచాయతీ కార్యదర్శులు నమోదు చేయాలన్నారు. వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవటంపై ఈవోఆర్డీలను కలెక్టర్‌ నిలదీశారు. చెత్త సంపద కేంద్రాల నిర్వహణపై అధికారులకు కనీస అవగాహన ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందని స్పష్టం చేశారు. జిల్లాలో 406 సామాజిక మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంకాగా ప్రస్తుతం 107 మాత్రమే నిర్మించటంపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను నిలదీశారు. ఏఈల పర్యవేక్షణ కొరవడటంతో కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాలేదన్నారు. ఇప్పటి వరకు నిర్మించిన మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. డీపీవో రమేష్‌, డీఎల్‌పీవో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని