logo

Andhra News: రైళ్లల్లో చోరీలు.. విమానాల్లో జల్సాలు

చదివింది ఐదో తరగతి.. కానీ దొంగతనాలు చేయడంలో నేర్పరులు. రైళ్ల ఏసీ బోగీల్లో చోరీలు చేసి విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేయడం వారికి సరదా. ఇటువంటి అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను గుంటూరు జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 18 Aug 2022 08:38 IST

అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు


నిందితుల వివరాలు వెల్లడిస్తున సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీనివాసరావు

గుంటూరు: చదివింది ఐదో తరగతి.. కానీ దొంగతనాలు చేయడంలో నేర్పరులు. రైళ్ల ఏసీ బోగీల్లో చోరీలు చేసి విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేయడం వారికి సరదా. ఇటువంటి అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను గుంటూరు జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం గుంటూరు రైల్వేస్టేషన్‌లో జీఆర్పీ సీఐ గంగా వెంకటేశ్వర్లు ఆ వివరాలను విలేకర్లకు తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన హర్షవర్థన్‌రెడ్డి, ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన హరికృష్ణ స్నేహితులు. ఇద్దరు జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేయడం ఆరంభించారు. చదివింది ఐదో తరగతి అయినా ఉన్నత విద్యావంతులుగా ఇన్‌షర్టు, ప్రముఖ బ్రాండ్ల ఖరీదైన వస్త్రాలు, చెప్పులు, బూట్లు ధరించి రైళ్లల్లో ప్రయాణికులుగా తిరుగుతుంటారు. రిజర్వేషన్‌ చేసుకున్న బోగీల్లో దొంగతనాలు చేయడంలో నేర్పరులు. ధనవంతులు ఏసీ బోగీల్లో ఉంటారని భావించి నిందితులు ఏసీ టిక్కెట్లు కొనుగోలు చేసి ఆ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. తోటి ప్రయాణికులవలె ఆ బోగీలో అటు, ఇటు తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తారు. బంగారపు ఆభరణాలు ధరించినవాళ్లు, విలువైన వస్తువులు కలిగి ఉన్నవాళ్లను ఎంపిక చేసుకుంటారు. ఆయా ప్రయాణికులు ఆదమరచినప్పుడు, నిద్రకు ఉపక్రమించినవేళ వారి ఆభరణాలు తస్కరించి రైలు దిగి మాయమైపోతారు. ఆ డబ్బులతో విమానంలో గోవా తదితర ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేస్తుంటారని పోలీసుల విచారణలో తేలింది. గుంటూరు మీదగా ప్రయాణిస్తున్న మూడు రైళ్లల్లో దొంగతనాలు జరిగిన ఘటనపై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. జీఆర్పీ సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్‌ సీఐ రామయ్య, ఎస్సైలు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ఏఎస్సై శ్రీనివాసరెడ్డి, హెడ్‌కానిస్టేబులు ఎంఎస్‌కెరెడ్డి, కానిస్టేబుళ్లు వలీ, సుబానీ, శంకర్‌లు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. బుధవారం గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఇద్దరు యువకులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఆయా పోలీసు బృందాలు స్టేషన్‌ చుట్టూ మాటువేసి నిందితులను అరెస్టు చేశారు. వారి ప్యాంటు జేబులో ఉన్న కాగితం పొట్లం విప్పిచూస్తే అందులో రూ.2.50 లక్షల విలువ చేసే 78 గ్రాముల బంగారపు వస్తువులు జప్తు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు